ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జైలు నుంచి విడుదలైన వెంటనే రాజకీయ వ్యూహాలకు పదును పెట్టారు. మరికొద్ది నెలల్లో జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఆయన ఆదివారం ఓ సంచలన ప్రకటన చేశారు. తాను రెండ్రోజుల్లో రాజీనామా చేస్తానంటా ఆయన చేసిన ప్రకటన దేశ రాజకీయాల్లో కలకలం రేపింది. ఢిల్లీ మద్యం పాలసీ అక్రమాల కేసులో జైలు పాలై, బెయిల్ మీద విడుదలైన ఆయన, తనపై పడ్డ అవినీతి మరకను ప్రజాతీర్పుతోనే తుడుచుకోవాలని చూస్తున్నారు. తాను నిజాయితీపరుడిని అని నమ్మితేనే ప్రజలు తనకు ఓటేయాలని, లేదంటే వేయవద్దని అన్నారు. ప్రజాతీర్పు ఇచ్చే వరకు తాను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకుంటానని చెప్పారు. ఆయన సంధించిన రాజీనామా అస్త్రం ద్వారా ఏం చేయబోతున్నారన్నది ఉత్కంఠ రేకెత్తిస్తోంది. జైల్లో ఉండగా రాజీనామా చేయకుండా భీష్మించుకుని కూర్చున్న ఆయన, జైలు నుంచి విడుదలైన వెంటనే ఈ ప్రకటన చేయడం రాజకీయవర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. రాజీనామా ద్వారా ఆయన ముందస్తు ఎన్నికలను కోరుకుంటున్నారా లేక ఎన్నికలు జరిగే వరకు మరొకరిని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెడతారా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఒకవేళ అప్పటివరకు మరొకరికి పాలన పగ్గాలు అప్పగించేపక్షంలో ఆ నేత ఎవరు అనే ఆసక్తి కూడా నెలకొంది.
ముందస్తు ఎన్నికలకు అవకాశం ఉందా?
కేజ్రీవాల్ రాజీనామా ప్రకటనతో ముందస్తు ఎన్నికలకు ఆయన సిద్ధపడ్డారా అన్న సందేహాలు ప్రతి ఒక్కరిలో కలిగాయి. అయితే పదవీకాలం ఇంకా మిగిలి ఉండగా ప్రభుత్వాన్ని రద్దు చేయడం దండగ అని ఆప్ అధినేత భావిస్తున్నట్టు తెలిసింది. రాజీనామా ప్రకటన చేసిన కాసేపటికే ఢిల్లీ స్పీకర్ రామ్‌నివాస్ గోయల్ ఆదివారం కేజ్రీవాల్‌ను ఆయన నివాసంలో కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వాన్ని రద్దు చేసే ఆలోచన లేదని, పదవీకాలం మిగిలి ఉన్నంత వరకు తమ ప్రభుత్వం కొనసాగుతుందని స్పష్టం చేశారు. సీఎం పదవికి రాజీనామా చేయడం ద్వారా ఆయన పూర్తి సమయాన్ని ఎన్నికల ప్రచారానికి కేటాయించే అవకాశం ఉంటుంది. పైగా అన్నా హజారే చేపట్టిన అవినీతి వ్యతిరేక ఉద్యమం నుంచి పార్టీని నెలకొల్పిన అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ మద్యం పాలసీ అక్రమాల కేసుతో కళంకం ఎదుర్కొంటున్నారు. సాధారణ రాజకీయ పార్టీల నేతలు అవినీతికి పాల్పడినా దేశంలో ఇంత చర్చ జరిగేది కాదు. కానీ అవినీతి వ్యతిరేక ఉద్యమంతో పురుడుపోసుకున్న పార్టీపై అవినీతి మరక పడడం విస్తృత చర్చకు ఆస్కారం కల్పించింది. ఆ మరకను తుడిచేసుకోవడం అంత సులభమేమీ కాదు. ఆ విషయం కేజ్రీవాల్‌కు కూడా తెలుసు. కానీ ఈలోగా ప్రజల్లో తాను కోల్పోయిన ఇమేజ్‌ను మళ్లీ తిరిగి నిలబెట్టుకోవాలి. ఇదే ఆయన ముందున్న భారీ లక్ష్యం. అందుకే భావోద్వేగాలను రగిలించేలా రాజీనామా అస్త్రాన్ని, ప్రచారాన్ని ఎంచుకున్నారు. తనపై వచ్చిన ఆరోపణలకు ప్రజాకోర్టులోనే తీర్పు కోరతానని, అప్పటి వరకు సీఎం పీఠంపై కూర్చోబోనని అన్నారు. తాను మాత్రమే కాదు, ఇదే కేసులో జైలుపాలైన మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా సైతం ఈ పీఠంపై కూర్చోరని స్పష్టం చేశారు.
తదుపరి సీఎం ఎవరు?
కేజ్రీవాల్ రాజీనామా, సిసోడియా కూడా ఆ పదవి చేపట్టరు అన్న ప్రకటనల తర్వాత ఎన్నికలు జరిగే వరకు ఆ పదవిలో ఎవరిని కూర్చోబెడతారన్న అంశంపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. అగ్రనేతలు ఇద్దరూ రేసులో లేనప్పుడు ఆ తర్వాత ప్రాధాన్యత కల్గిన నేతల పేర్లు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో కేజ్రీవాల్ సతీమణి సునీత కేజ్రీవాల్, మంత్రులు అతీషి, గోపాల్ రాయ్, కైలాస్ గెహ్లోత్, సౌరభ్ భరద్వాజ్ వంటి నేతల పేర్లు రేసులో కనిపిస్తున్నాయి. సునీత కేజ్రీవాల్ కూడా భర్త మాదిరిగానే ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్ (IRS) అధికారిణిగా పని చేసి స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. పాలన పట్ల, రాజకీయాల పట్ల అవగాహన ఉంది. ఒకవేళ సీఎం పదవి చేపడితే.. భర్త అరవింద్ కేజ్రీవాల్ నుంచి తగినంత మద్ధతు కూడా లభిస్తుంది. ఇవన్నీ ఆమెకు అనుకూల అంశాలుగా కనిపిస్తున్నాయి. అయితే కుటుంబ, వారసత్వ రాజకీయాలపై భారతీయ జనతా పార్టీ (BJP) దేశవ్యాప్తంగా అన్ని ఇతర రాజకీయ పార్టీలపై గట్టిగా విమర్శలు చేస్తున్న వేళ, భార్యను ఆ పీఠంపై కూర్చోబెట్టే అవకాశం లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
రేసులో కనిపిస్తున్న మంత్రి అతీశి, సీఎం కేజ్రీవాల్ జైల్లో ఉన్న సమయంలో పాలన బాధ్యతల్ని దాదాపు ఆమెనే చేపట్టారు. ప్రభుత్వంలో ఆర్థిక, రెవెన్యూ, విద్యాశాఖలతో పాటు మరికొన్ని కీలక శాఖలను నిర్వర్తిస్తున్న ఆమెను తాత్కాలిక ముఖ్యమంత్రిగా పరిగణలోకి తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. కేజ్రీవాల్ జైల్లో ఉన్న సమయంలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి తరఫున త్రివర్ణ పతాకాన్ని ఎగరేసే అవకాశాన్ని అతీశికే అప్పగించారు. ఇవన్నీ చూస్తుంటే తదుపరి ముఖ్యమంత్రి అతీశి అయ్యే అవకాశం ఉంది.
రేసులో ఉన్న నేతల్లో గ్రేటర్ కైలాష్ నుంచి వరుసగా 3 పర్యాయాలు గెలుపొంది, ప్రభుత్వంలో ఆరోగ్యం, విజిలెన్స్ వంటి శాఖలను నిర్వహిస్తున్న సౌరభ్ భరద్వాజ్ ఒకరు. గతంలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేసిన సౌరభ్ భరద్వాజ్ ఢిల్లీలో కేజ్రీవాల్ ఏర్పాటు చేసిన మొదటి 49 రోజుల ప్రభుత్వంలో కూడా మంత్రిగా ఉన్నారు. పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా తరచుగా మీడియా సమావేశాలు నిర్వహిస్తూ, డిబేట్లలో పాల్గొనే భరద్వాజ్‌కు కూడా అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.
పార్టీలో పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యుడిగా ఉన్న రాఘవ్ చద్దా పేరుతో సైతం సీఎం రేసులో వినిపిస్తోంది. ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఉన్నప్పటికీ.. సీఎం పదవి అప్పగించే అవకాశాలు లేకపోలేదు. అసెంబ్లీలో సభ్యుడిగా లేనివారు ముఖ్యమంత్రిగా పదవిని చేపట్టే అవకాశం ఉంది. కాకపోతే 6 నెలల్లోగా వారు అసెంబ్లీ లేదా శాసన మండలి ఉంటే అందులో సభ్యుడిగా ఎన్నికవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఢిల్లీ ప్రభుత్వ గడువు కూడా 6 నెలలే ఉంది కాబట్టి ఈ సాంకేతిక అంశం రాఘవ్ చద్దాకు అడ్డు రాదు. కాబట్టి ఆయనను సైతం సీఎం పదవికి పరిగణలోకి తీసుకోవచ్చని తెలుస్తోంది.
వీరందరితో పాటు రాష్ట్ర మంత్రి కైలాష్ గెహ్లోత్, రాజ్యసభ సభ్యులు సంజయ్ సింగ్ కూడా పోటీదారులుగా ఉన్నారు. అయితే సంజయ్ సింగ్ కూడా మద్యం పాలసీ అక్రమాల కేసులో నిందితుడిగా జైలుపాలై, తర్వాత బెయిల్‌పై విడుదలయ్యారు. అలాంటప్పుడు కేజ్రీవాల్, సిసోడియా తమకు తాము విధించుకున్న ప్రజాకోర్టు తీర్పు నిబంధనను సంజయ్ సింగ్‌కు కూడా వర్తిస్తుంది. దీంతో ఆయన పేరును పరిగణలోకి తీసుకోకుండా రాష్ట్ర రవాణా శాఖ మంత్రిగా ఉన్న కైలాష్ గెహ్లోత్ పేరును పరిశీలించే అవకాశం ఉంది. ఒకవేళ సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకుంటే.. మైనారిటీ వర్గానికి చెందిన మంత్రి ఇమ్రాన్ హుస్సేన్‌ను సైతం పరిగణించే అవకాశం లేకపోలేదు. ప్రస్తుతం మైనారిటీలు కాంగ్రెస్ వైపు ఎక్కువగా మొగ్గుచూపుతున్న నేపథ్యంలో వారి ఓటుబ్యాంకును తమ వైపు తిప్పుకునేందుకు ఈ వ్యూహాన్ని అమలు చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు.
వ్యూహం ఫలించేనా?
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ తనపై పడ్డ అవినీతి మరకను న్యాయస్థానాల ద్వారా తుడిచేసుకోడానికి చాలా సమయం పడుతుంది. ఇందుకు కొన్ని సంవత్సరాలు కాదు దశాబ్దాలు పట్టినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఈలోగా ప్రజాకోర్టులో తీర్పు కోరడం ద్వారా తాను సచ్ఛీలుడిని అని నిరూపించుకోవాలని చూస్తున్నారు. ప్రజలు నేతల అవినీతి విషయంలో పెద్దగా పట్టించుకోవడం లేదని గత రెండు దశాబ్దాల్లో జరిగిన అనేక ఎన్నికలు రుజువు చేస్తున్నాయి. అంతిమంగా తమ సంక్షేమం, ప్రాంత అభివృద్ధి కోసం నేతలు ఏ మేరకు పనిచేస్తున్నారన్నదే ఓటర్లకు ప్రామాణికంగా మారింది. ఢిల్లీ విషయానికి వస్తే.. ఇక్కడ అందిస్తున్న ఉచిత విద్యుత్తు, నీరు, ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్య, ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్య సదుపాయాలు తమను గట్టెక్కిస్తాయని, వాటికి తోడు ఎమోషనల్ ప్రసంగాలతో మళ్లీ తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించాలని అరవింద్ కేజ్రీవాల్ భావిస్తున్నారు. ఆయన వ్యూహం ఎంతమేర ఫలిస్తుంది అన్నది చూడాలంటే.. మరికొద్ది నెలలు ఆగాల్సిందే.
మరిన్ని జాతీయ వార్తలు చదవండి