భక్తి ముసుగులో మూర్ఖత్వం. అంతరిక్షానికి చేరుతున్న నేటి టెక్నాలజీ యుగంలోనూ మూఢ నమ్మకాలు..దేవుడ్ని సంతృప్తి పరిచేందుకు క్షుద్రపూజలు..ఊహించలేని దారుణాలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. తాజాగా డెహ్రాడూన్‌లో అత్యంత కిరాతక ఘటన వెలుగులోకొచ్చింది. భార్యా, పిల్లలకు ఏదైనా ఆపద వస్తే కడుపులో పెట్టుకొని కాపాడుకుంటారు. అలాంటిది ఓ దుర్మార్గుడు. ఏకంగా ఐదుగురు కుటుంబసభ్యులను దారుణంగా చంపాడు. అదీ మూఢనమ్మకంతో. డెహ్రాడూన్(Dehradun) దోయ్‌వాలాలోని రాణి పోఖారీ(Rani Pokhari) నాగఘేర్‌లో జరిగింది ఈ ఘోరం. ఐదుగురు కుటుంబసభ్యులను అత్యంత కిరాతకంగా నరికి చంపాడు మహేష్ అనే ఉన్మాది. తల్లి, భార్య, ముగ్గురు కూతుళ్లను దారుణంగా హతమార్చాడు. ఆ తర్వాత డెడ్‌బాడీస్ దగ్గర క్షుద్రపూజలు చేశాడు. అతని సోదరుని ఫిర్యాదుతో నిందితుణ్ణి అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. హత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. నిందితుడు ఉత్తరప్రదేశ్(Uttar Pradesh)లోని బండా నుంచి వచ్చి కుటుంబంతో సహా నాగఘేర్‌లో నివసిస్తున్నాడు. ఎప్పుడూ పూజలు చేసుకుంటూ ప్రశాంతంగా ఉండేవారంటున్నారు స్థానికులు. ఇప్పుడు ఇంతటి ఘోరానికి పాల్పడటంతో షాకవుతున్నారు. మృతులను నిందితుడి తల్లి బితాన్ దేవి (75), భార్య నీతూ దేవి (36), కుమార్తెలు అపర్ణ (13), అన్నపూర్ణ (9), స్వర్ణ (11)గా పోలీసులు గుర్తించారు. నిందితుడు మహేష్ కుమార్ తివారీ ఉత్తరప్రదేశ్‌లోని బండా నుంచి వచ్చి డెహ్రాడూన్‌లోని రాణి పోఖారీలో గత 7-8 సంవత్సరాలుగా ఉంటున్నాడని డెహ్రాడూన్ పోలీసు సూపరింటెండెంట్ (రూరల్) కమలేష్ ఉపాధ్యాయ్ తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తలు చదవండి