అనారోగ్యంతో మృతి చెందిన మూడేళ్ల బాబుకు ఓ కుటుంబం అంత్యక్రియలు నిర్వహించింది. బాబు బతికే ఉన్నాడని చిన్నారి అమ్మమ్మకి కల రావడంతో సమాధి నుంచి మృతదేహాన్ని తీసి పూజలు చేశారు. ఇక ఆ తర్వాత ఏం జరిగిందంటే.? ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్ రాజధాని లఖ్‌నవూలో చోటుచేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే..
పోలీసుల వివరాల ప్రకారం.. లఖ్‌నవూలోని సైద్‌పుర్ మహరి గ్రామంలో మూడేళ్ల అక్షత్ కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలోనే శనివారం తుదిశ్వాస విడిచాడు. దీంతో కుటుంబ సభ్యులు ఆ బాలుడిని పూడ్చిపెట్టారు. బాలుడిని పూడ్చిపెట్టాక సోమవారం రాత్రి ఆ కుర్రాడి అమ్మమ్మకు అక్షత్ బతికే ఉన్నట్లు కల వచ్చింది. ఈ విషయాన్ని బాలుడి తండ్రి సునీల్‌కు చెప్పగా.. అతడు ఒక తాంత్రికుడి దగ్గరకు వెళ్లి.. కల గురించి వివరిస్తాడు. ఇక ఇదే అదునుగా భావించిన ఆ తాంత్రికుడు బాలుడు బతికే ఉన్నాడని, సమాధి నుంచి బయటకు తీయాల్సిందిగా చెప్పాడు.
బయటకు తీసి మంత్రాలు చదివితే బాలుడు బతుకుతాడనే మూఢనమ్మకంతో బాలుడి తల్లిదండ్రులు, బంధువులు కలిసి తాంత్రికుడు చెప్పినట్లు చేశారు. అయితే దీనికి సంబంధించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. బాలుడి మృతదేహాన్ని స్థానిక ఆసుపత్రికి తరలించి.. కుటుంబసభ్యులను విచారిస్తున్నారు. అలాగే పరారీలో ఉన్న తాంత్రికుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.