Dalit Boy Beaten By Teacher: ఓ బాలుడి పట్ల ఉపాధ్యాయుడు దారుణంగా ప్రవర్తించాడు. తనకోసం కుండలో ఉంచిన నీరు తాగాడన్న నేపంతో దళిత విద్యార్థిని చావబాదాడు. దీంతో బాలుడు (9) మృతిచెందాడు. ఈ దారుణ ఘటన రాజస్థాన్‌లో చోటుచేసుకుంది. మూడో తరగతి చదువుతున్న దళిత వర్గానికి చెందిన తొమ్మిదేళ్ల బాలుడు.. ఉపాధ్యాయుడి కోసం పక్కన ఉంచిన కుండలోని నీరు తాగాడు. దీంతో రెచ్చిపోయిన ఉపాధ్యాయుడు.. నువ్వు నా నీళ్లు తాగుతావా అంటూ కులం పేరుతో దూషిస్తూ దారుణంగా కొట్టాడు. దీంతో చికిత్స పొందుతూ శనివారం బాలుడు మరణించాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. పోలీసులు ఉపాధ్యాయుడు చైల్ సింగ్ (40)ని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ఈ ఘటన జలోర్ జిల్లా సైలా గ్రామంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో జూలై 20న ఈ ఘటన జరిగింది. ఉపాధ్యాయుడు కొట్టడంతో చిన్నారి కంటికి, చెవికి తీవ్రగాయాలయ్యాయి. చెవిలోని కర్ణభేరి కూడా పగిలిపోయింది. తీవ్ర రక్తస్రావం కావడంతో.. వెంటనే చిన్నారిని చికిత్స నిమిత్తం ఉదయ్‌పూర్, అక్కడినుంచి 300 కిలోమీటర్ల దూరంలోని అహ్మదాబాద్‌కు తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బాలుడు నిన్న మృతి చెందినట్లు పోలీసు అధికారులు తెలిపారు.
కాగా.. ఈ ఘటన అనంతరం ఈ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలంటూ పలువురు ఆందోళన చేపట్టారు. పరిస్థితి తీవ్రతరం కాకుండా ఉండేందుకు ముందుస్తుగా ఆ ప్రాంతంలో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు.ఈ ఘటనపై ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ విచారం వ్యక్తం చేశారు. ఈ కేసును త్వరితగతిన దర్యాప్తు చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. బాధిత కుటుంబానికి వీలైనంత త్వరగా న్యాయం జరిగేలా చూస్తామని, ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి కుటుంబానికి రూ.5 లక్షల సాయం అందజేస్తామని ఆయన ట్వీట్ చేసి వెల్లడించారు.
నిందితుడైన ఉపాధ్యాయుడిని అరెస్టు చేసి షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల చట్టం కింద హత్యా నేరం కింద కేసు నమోదు చేశామని అధికారులు తెలిపారు. తాగు నీటి కుండను తాకినందుకు బాలుడిని దారుణంగా కొట్టారని బాలుడి కుటుంబీకులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. తన కొడుకు తన కుండలోని నీరు తాగినందుకు ఉపాధ్యాయుడు చైల్ సింగ్.. అతనిని దారుణంగా కొట్టాడని.. కులం పేరుతో దూషించాడని తల్లిదండ్రులు పేర్కొన్నారు. తీవ్ర రక్తస్రావం కావడంతో చికిత్స కోసం మొదట ఉదయపూర్, అక్కడి నుంచి అహ్మదాబాద్‌కు తీసుకువెళ్లానని బాలుడి తండ్రి దేవరామ్ మేఘవాల్ తెలిపారు.
కాగా.. ఈ ఘటనపై రాష్ట్ర విద్యా శాఖ ఈ విషయంపై విచారణ ప్రారంభించింది. రాజస్థాన్ ఎస్సీ కమిషన్ చైర్మన్ ఖిలాడి లాల్ బైర్వా సైతం.. ఆందోళన వ్యక్తంచేశారు. ఈ కేసును వేగంగా దర్యాప్తు చేయాలని ఆదేశించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..