
బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడన ద్రోణి మరింత తీవ్రరూపం దాల్చుతోంది. ఇది రాత్రికి తీవ్ర వాయుగుండంగా మారనుందని వాతావరణ విభాగం వెల్లడించింది. అయితే తక్షణమే తుపానుగా మారే ముప్పు ప్రస్తుతానికి లేదని స్పష్టం చేసినప్పటికీ, తీవ్ర వాయుగుండంగా బలపడి తీరం వైపు పయనించే క్రమంలో బలమైన గాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఒకవేళ మరింత శక్తిని పుంజుకుని తుపానుగా రూపాంతరం చెందితే.. దానికి అర్నాబ్ అని నామకరణం చేయనున్నారు. బంగ్లాదేశ్ సూచించిన ఈ పేరుకు సముద్రం అనే అర్థం.
వాయుగుండం ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు నైరుతి దిశలో దాదాపు 200 కిలోమీటర్ల దూరంలో, ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నానికి తూర్పుగా 290 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. విశాఖపట్నం – గోపాల్‌పూర్ రేవుల మధ్య బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఇది తీరాన్ని తాకే అవకాశాలున్నట్లు వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. ఈ ప్రభావంతో గంటకు 70 కిలోమీటర్ల పెనుగాలులతో పాటు కోస్తా తీరం వెంబడి భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఈ తీవ్ర అల్పపీడన ప్రభావంతో దక్షిణ బెంగాల్‌లోని ఆరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు హెచ్చరించారు. ముఖ్యంగా ఉత్తర 24 పరగణాలు, దక్షిణ 24 పరగణాలు, తూర్పు మేదినీపూర్, పశ్చిమ మేదినీపూర్, బీర్‌భూమ్ జిల్లాలకు వర్ష హెచ్చరికలు జారీ అయ్యాయి. కోల్‌కతా సహా పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడనున్నాయి. దక్షిణ బెంగాల్ జిల్లాలతో పాటు జార్గ్రామ్, పురూలియా జిల్లాల్లో బుధ, గురువారాల్లో వర్ష తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ సమయంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో పిడుగుపాటు ప్రమాదాల బారిన పడకుండా ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో తిరగొద్దని విపత్తు నిర్వహణ విభాగం సూచించింది. ఉత్తర బెంగాల్‌లోని డార్జిలింగ్, జల్పైగురి, కాలింపాంగ్ తదితర జిల్లాల్లోనూ శుక్రవారం వరకు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముంది.
తీవ్ర వాయుగుండం ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో పొరుగు రాష్ట్రమైన ఒడిశా పటిష్ఠ భద్రతా చర్యలు చేపట్టింది. ఒడిశా తీరంలో గంటకు 55 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీచే ప్రమాదం ఉన్నందున గంజాం, ఖుర్దా, జగత్‌సింగ్‌పూర్, గజపతి జిల్లాల్లో గురువారం వరకు పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. సముద్రం తీవ్రస్థాయిలో అల్లకల్లోలంగా మారనున్నందున పశ్చిమ బెంగాల్, ఒడిశా తీరాల వెంబడి మత్స్యకారులు ఎవరూ శుక్రవారం వరకు చేపల వేటకు వెళ్లొద్దని కఠిన ఆంక్షలు విధించారు.