బీహార్‌లోని పాట్నాలో ఏటా పెరుగు తినే పోటీ నిర్వహిస్తారు. రాష్ట్రానికి చెందిన సుధా కోఆపరేటివ్ మిల్క్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ నిర్వహిస్తున్న ఈ పోటీలు 10 సంవత్సరాలుగా అట్టహాసంగా జరుగుతుంది. ఈ ఏడాది పోటీలు జనవరి 18 బుధవారం రోజున పాట్నాలో జరిగాయి. 700 మంది దరఖాస్తుదారులలో 500 మందికి పైగా పోటీలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా బుధవారం మూడు క్యాటగిరీల్లో ఈ పోటీని నిర్వహించారు. మహిళలు, పురుషులు, సీనియర్ సిటిజన్ విభాగాల్లో సుమారు 500 మందికి పైగా పోటీ పడ్డారు. కాగా, ఈ వింత పోటీలో ఓ వృద్ధుడు సరికొత్త రికార్డ్ సృష్టించాడు. మూడు నిమిషాల్లో మూడున్నర కిలోలకుపైగా పెరుగు తిని విజేతగా నిలిచాడు. ఈ పోటీల్లో పాల్గొనేందుకు బీహార్ మాత్రమే కాకుండా ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్ వంటి పొరుగు రాష్ట్రాల నుంచి కూడా వచ్చారు.
వివిధ విభాగాల్లో పోటీలు నిర్వహించారు. పోటీ జరిగిన 3 నిమిషాలలోపు ఎక్కువ మొత్తంలో పెరుగు తినాలి. పురుషుల విభాగంలో బార్హ్ ప్రాంతానికి చెందిన అజయ్ కుమార్ విజేతగా నిలిచాడు. ఆయన మూడు నిమిషాల్లో 3 కిలోల 420 గ్రాముల పెరుగు తిన్నాడు. మహిళల విభాగంలో పాట్నాకు చెందిన ప్రేమ తివారీ మొదటి స్థానంలో నిలిచింది. ఆమె 3 నిమిషాల్లో 2 కిలోల 718 గ్రాముల పెరుగు తిన్నది.
ఇక సీనియర్ సిటిజన్ విభాగంలో డిఫెండింగ్ ఛాంపియన్ శంకర్ కాంత్ అగ్రస్థానంలో నిలిచాడు. ఆయన మూడు నిమిషాల్లో 3 కిలోల 647 గ్రాముల పెరుగు తిని మొదటి బహుమతిని గెలుచుకున్నాడు. ఈ ముగ్గురూ ‘దహీ శ్రీ’ టైటిల్‌ను సొంతం చేసుకున్నారు. 2020లో కూడా శంకర్ కాంత్ 4 కిలోల పెరుగు తిని ఈ టైటిల్‌ను గెలుచుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
Looks like the competition was ‘curdled’ with tension, but the dairy warrior emerged victorious by gobbling up 3 kgs & 647 gms of curd in just 3 minutes! Sudha Dairy successfully organized a Curd-Eating Competition today at Patna Dairy Project to promote health benefits of curd. pic.twitter.com/4aE2HeAMRD
— National Cooperative Dairy Federation of India Ltd (@ncdficoop) January 18, 2023
డబుల్స్ పోటీ కూడా జరిగింది. పురుషుల విభాగంలో అనిల్ కుమార్, రాజీవ్ రంజన్, మహిళల విభాగంలో మధు కుమారి, నీరు కుమార్, సీనియర్ సిటిజన్ విభాగంలో సంజయ్ త్రివేది, కుందన్ ఠాకూర్ గెలుపొందారు. సుధా సహకార పాల పంపిణీ సంస్థ అధ్యక్షుడు సంజయ్ కుమార్ విజేతలకు బహుమతులు అందజేసి సుధా పాల ఉత్పత్తుల వినియోగాన్ని విస్తృతం చేసేందుకు సహకరించాలని కోరారు. దర్శకుడు శ్రీనారాయణన్ ఠాకూర్ పాల్గొన్న వారందరికీ ధన్యవాదాలు తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…