మహారాష్ట్ర రాజకీయ సంక్షోభానికి వీలైనంత త్వరగా ముగింపు పలకాలని భావిస్తున్న బిజెపి హార్స్ ట్రేడింగ్ బాధ్యతలను వికేంద్రీకరించింది. శనివారం ఆగమేఘాల మీద, అర్ధరాత్రి మంతనాలతో పొద్దుపొద్దున్నే పదవీ ప్రమాణం చేసిన ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్‌లకు ఇదివరకే తమ తమ లక్ష్యాలను నిర్దేశించిన బిజెపి అధిష్టానం.. తాజాగా మరో నలుగురికి కీలక బాధ్యతలప్పగించినట్లు సమాచారం. కావాల్సిన 145 మంది శాసనసభ్యులే కాకుండా 170-180 వరకు బలపరీక్షలో దేవేంద్రుని ప్రభుత్వానికి అనుకూలంగా ఓటేసేటట్టు చూడాలని ఆ నలుగురు నేతలకు అమిత్‌షా గట్టిగానే చెప్పారని ముంబయి మీడియా కథనాలిస్తోంది.
అక్టోబర్ 24న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడైనప్పట్నించి.. తీవ్ర ఉత్కంఠ రేపుతున్న మహా రాజకీయ పరిణామాలు శనివారం అనూహ్యంగా కొత్త టర్న్ తీసుకున్నాయి. తెల్లారితే శివసేన చీఫ్ ఉద్ధవ్ థాక్రే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతారని, శివసేన-కాంగ్రెస్-ఎన్సీపీ పార్టీల కూటమి ప్రభుత్వం ఏర్పాటవుతుందని అందరు భావించారు. శనివారం అన్ని మీడియాల్లో బ్యానర్ ఐటమ్స్, హెడింగ్స్ అవే దర్శనమిచ్చాయి. కానీ అనూహ్యంగా అర్ధరాత్రి పరిణామాలతో తెల్లరగానే బిజెపి నేత దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఆయనతోపాటు డిప్యూటీ సీఎంగా ఎన్సీపీ నేత అజిత్ పవార్ పదవీ ప్రమాణం చేశారు. ఈ పరిణామాలతో శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ వర్గాలే కాదు.. యావత్ దేశ ప్రజలు ఉలిక్కిపడ్డారు.
వెంటనే అప్రమత్తమైన శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు తమ ఎమ్మెల్యేలు చేజారకుండా క్యాంపు రాజకీయాలకు తెరలేపాయి. ఇటు బిజెపి కూడా తమ ఎమ్మెల్యేలను కాపాడుకోవడంతోపాటు ప్రత్యర్థుల క్యాంపుల్లో వున్న వారికి తాయిలాలు ఆశచూపడం మొదలు పెట్టింది. ఈ నేపథ్యంలో గోవా క్యాంపునకు చాలా మంది ఎమ్మెల్యేలను తరలించారు కమలనాథులు. అయితే.. 105 మంది సభ్యులున్న బిజెపి బల పరీక్షలో నెగ్గాలంటే దాదాపు 40 మంది ఎమ్మెల్యేలను అదనంగా తమకు అనుకూలంగా మార్చుకోవాల్సి వుంది. డిప్యూటీ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన అజిత్ పవార్ తన వెంట 30 మంది ఎమ్మెల్యేలు ఈజీగా వస్తారని ధీమాతో ఉన్నట్లు సమాచారం. ఆదివారం రాత్రి సీఎంతో జరిగిన భేటీలో అజిత్ పవార్ ఈ మేరకు ధీమా వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఎన్సీపీ తరపున గెలిచిన వారిలో సుమారు 36 మందికి.. తాను ఎన్నికల ఖర్చు కోసం డబ్బులు అరేంజ్ చేసానని అజిత్ పవార్ క్లెయిమ్ చేసుకుంటున్నారు.
మరోవైపు దేవేంద్ర సర్కార్‌కు ఇప్పటికే 15 మంది ఇండిపెండెంట్లు మద్దతు ప్రకటించినట్లు తెలుస్తోంది. వారిలో 11 మంది ఎమ్మెల్యేలు ఆల్‌రెడీ తమ సంతకాలతో కూడిన మద్దతు లేఖలను సీఎం చేతికిచ్చినట్లు చెబుతున్నారు. 15 మందికి అదనంగా మరో 10 మంది ఇండిపెండెంట్లకు గాలమేసేందుకు బిజెపి నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. శివసేనకు ఇదివరకే మద్దతు ప్రకటించిన ఇండిపెండెంట్లకు భారీగా తాయిలాలను ఆశచూపుతున్నట్లు సమాచారం. బిజెపి 105, అజిత్ వర్గం 30కి తోడుగా.. ఇండిపెండెంట్లు 20 వరకు వస్తే.. బల పరీక్షలో నెగ్గడం బిజెపికి సులువు అవుతుంది. కానీ.. 145 సంఖ్య టార్గెట్‌గా పనిచేయొద్దంటూ భారీ లక్ష్యాన్ని అమిత్‌షా నిర్దేశించినట్లు చెబుతున్నారు.
145 మేజిక్ ఫిగర్ కాగా.. 170 నుంచి 180 వరకు ఎమ్మెల్యేల మద్దతు సంపాదించాలని అమిత్‌షా ఆదేశించినట్లు తెలుస్తోంది. ఇటీవలి కాలంలో కాంగ్రెస్, ఎన్సీపీల నుంచి వచ్చి బిజెపిలో చేరిన సీనియర్ నేతలకు అమిత్‌షా బాధ్యతలప్పగించినట్లు ముంబయి మీడియా రాస్తోంది. నారాయణ్ రాణే, గణేశ్ నాయక్, బాబన్ రావు లోనికర్, ఆర్కే విఖే పాటిల్‌లకు బాధ్యతలప్పగించిన అమిత్‌షా… కాంగ్రెస్, ఎన్సీపీలను చీల్చే బాధ్యతలను ఆదేశించినట్లు చెబుతున్నారు. అదే సమయంలో శివసేనను చీల్చే బాధ్యతలను దేవేంద్ర ఫడ్నవీస్ స్వయంగా చేపట్టినట్లు తెలుస్తోంది. ఇందుకు విదర్భ ప్రాంతానికి చెందిన సంఘ పరివార్ కీలక నేతలను దేవేంద్ర ఫడ్నవీస్ రంగంలోకి దింపినట్లు సమాచారం. సో.. మొత్తమ్మీద సుప్రీం కోర్టు మంగళవారం ఇవ్వనున్న తీర్పులోగానే పరిస్థితిని చక్కదిద్దుకోవాలని బిజెపి అధినాయకత్వం భావిస్తోంది.