Coronavirus Second Wave: దేశ వ్యాప్తంగా మరోసారి విజృంభిస్తున్న కరోనా మహమ్మారి.. ఇప్పుడు బెంగళూరులో చిన్నపిల్లలపై పంజా విసురుతోంది. ఇప్పటివరకు పెద్దవారిలోనే ఎక్కువగా బయటపడ్డ కరోనా.. సెకండ్ వేవ్‌లో రూటు మార్చినట్లు స్పష్టంగా అర్దమవుతోంది. ఇప్పుడు పెద్ద వారితోపాటు చిన్నారుల్లో కూడా కరోనా లక్షణాలు కనిపిస్తుండడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. మార్చి 1 నుంచి బెంగళూరులో పదేళ్ల లోపు వయస్సు ఉన్న 472 మంది పిల్లలు కరోనా బారిన పడ్డారు. అందులో 244 మంది బాలురు, 228 మంది బాలికలు ఉన్నారు. మార్చి మొదటి వారంలో చిన్న పిల్లల్లో రోజుకు 10 కేసులు వరకు నమోదవగా.. తాజా లెక్కల ప్రకారం.. అవి విపరీతంగా పెరిగిపోయాయి. మొన్న ఒక్క రోజే 46మంది చిన్న పిల్లలకు కరోనా పాజిటివ్ వచ్చింది.
సిటీలో పిల్లలు ఎక్కువగా బయట తిరగడమే కేసులు పెరగడానికి కారణంగా తెలుస్తోంది. లాక్‌డౌన్ ముగిసి పరిస్థితులు సద్దుమణగడంతో కొన్ని తరగతుల వారికి స్కూల్స్ తిరిగి తెరిచారు. దీంతో చాలా మంది స్కూలుకు వెళ్లడంతో పాటుగా ఇంటి పక్కనుండే చిన్నారులతో ఆటలాడటం వంటి చర్యల వల్లే వైరస్ స్ప్రెడ్ అయ్యినట్లు వైద్యులు చెబుతున్నారు.
మరోవైపు..మహారాష్ట్రలో కరోనా వికృత నాట్యం చేస్తోంది. గత కొన్ని రోజులుగా వేలల్లో పాజిటివ్ కేసులు నమోదు కాగా.. వందల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. ఒక్క రోజులోనే రికార్డు స్థాయిలో 40 వేల 414 కరోనా కేసులు, 108 మరణాలు నమోదయ్యాయి. 17 వేల 874 మంది కరోనా రోగులు కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అలాగే ముంబైలో గడిచిన 24 గంటల్లో 6 వేల 923 కరోనా కేసులు నమోదవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
Also Read: లాయర్ గా తన వాగ్ధాటితో అలరిస్తున్న పవన్ కళ్యాణ్… ఫ్యాన్స్‌కు షడ్రుచుల విందేగా..