వచ్చేది పండుగల సీజన్.. కరోనా వైరస్‌కేమో కాలం చెల్లడం లేదు.. ఎంతగా కట్టడి చేస్తున్నా కొత్త కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి.. మరణాలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి.. నవరాత్రులతో మొదలు పెడితే రాబోయే మూడు నెలలు పండుగలే పండుగలు.. దేశమంతటా నవరాత్రులు అత్యంత వైభవంగా జరుగుతాయి.. విజయదశమి పండుగ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంటుంది.? అమావాస్య రోజున వచ్చే దీపాల పండుగ దీపావళి హిందువులకు చాలా పెద్ద పండుగ… తర్వాత క్రిస్‌మస్.. మనకేమో బతుకమ్మ కూడా ఉంది.. ఈ పండుగల వేడుకల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొంటారు.. పది మంది కలిస్తేనే కదా పండుగ సంబరం..! ఇలా ప్రజలు పెద్ద ఎత్తున గుమికూడితే కరోనా వైరస్ పండుగ చేసుకుంటుందంటోంది కేంద్ర ప్రభుత్వం.. పండుగలు సంతోషంగా జరుపుకోవాలనే తప్ప ప్రమాదాలను కొని తెచ్చుకునేలా ఉండకూడదని హితవు చెబుతోంది.. పండుగల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్ర ఆరోగ్య శాఖ సూచిస్తోంది.. కంటైన్‌మెంట్ జోన్‌లలో పండుగ ఉత్సవాలకు అనుమతి ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చేసింది.. కంటైన్మెంట్ జోన్‌లలో ఉన్న ప్రజలు ఇంటిపట్టునే ఉంటూ పండుగలు చేసుకోవాలని చెప్పింది.. పండుగల వేళ మండపాలలో పెట్టే విగ్రహాలను చేత్తో తాకరాదని, పవిత్ర గ్రంధాలను కూడా ముట్టుకోవద్దని ఆరోగ్యశాఖ సూచించింది.. భక్తి పాటలు వినిపించవచ్చు కానీ, పాటల పోటీలను మాత్రం నిర్వహించవద్దని చెప్పింది.. పండుగ కార్యక్రమాలు జరిగే చోట జనం తప్పనిసరిగా భౌతిక దూరాన్ని పాటించాలని, కనీసం ఆరు అడుగుల దూరాన్ని పాటించాలని సూచించింది.. వేడుకలు జరిగే ప్రాంతాలను ఎప్పటికప్పుడు శానిటైజేషన్ చేయాలని, థర్మల్ స్క్రీనింగ్‌ను విధిగా విధించాలని స్పష్టం చేసింది. ర్యాలీలు, నిమజ్జనాలు తగు జాగ్రత్తలో చేసుకోవాలని తెలిపింది.. ఇలాంటి కార్యక్రమాలలో వీలైనంత తక్కువ మంది పాల్గొనే విధంగా చూసుకోవాలని సూచించింది. ర్యాలీలలో తప్పనిసరిగా అంబులెన్స్‌ను అందుబాటులో పెట్టాలని పేర్కొంది ఆరోగ్యశాఖ.. ఉత్సవాలు జరిగే చోట ఎంట్రన్స్, ఎగ్జిట్ ద్వారాలు వేరువేరుగా ఉండాలని, భక్తులకు సురక్షితమైన తాగునీటిని అందించాలని, వైద్య సదుపాయం కూడా కలిగించాలని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.. కేరళలో ఓనం పండుగ తర్వాత ఒక్కసారిగా కేసులు పెరగడాన్ని దృష్టిలో పెట్టుకునే కేంద్రం పలు జాగ్రత్తలు తీసుకుంటోంది.. కేంద్ర ప్రభుత్వ సూచనలను ప్రజలు కూడా పాటిస్తే కరోనా ముప్పు నుంచి తప్పించుకోవచ్చు.. పండుగలను సంబరంగా జరుపుకోవచ్చు..