AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కాంగ్రెస్‌ అసలు ముఖం బయటపడింది.. మహిళా బిల్లు తిరస్కరణపై కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఫైర్

లోక్‌సభలో మహిళా రిజర్వేషన్, నియోజకవర్గాల పునర్విభజన బిల్లు ఆమోదం లభించకపోవడంతో ప్రతిపక్షాలపై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ పార్టీ మహిళా వ్యతిరేక ముఖాన్ని బయటపెట్టుకుందని, ఆ పార్టీ మానసికంగా దివాళా తీసిందంటూ ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. మహిళలు, ఓబీసీల ఆశలను కాంగ్రెస్ అణచివేస్తోందని ఆయన మండిపడ్డారు.

కాంగ్రెస్‌ అసలు ముఖం బయటపడింది.. మహిళా బిల్లు తిరస్కరణపై కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఫైర్
Dharmendra Pradhan Slams Congress
Krishna S
|

Updated on: Apr 18, 2026 | 8:15 AM

Share

దేశ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. లోక్‌సభలో ప్రవేశపెట్టిన రాజ్యాంగ సవరణ బిల్లు-2026 ఓటింగ్‌లో వీగిపోయింది. మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్ ప్రక్రియతో ముడిపడి ఉన్న ఈ బిల్లు ఆమోదం పొందకపోవడంపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రతిపక్షాలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభలో జరిగిన ఓటింగ్‌లో ఈ బిల్లుకు అనుకూలంగా 298 మంది ఎంపీలు ఓటు వేయగా, 230 మంది వ్యతిరేకించారు. సాధారణ మెజారిటీ లభించినప్పటికీ, ఇది రాజ్యాంగ సవరణ బిల్లు కావడంతో 2/3 వంతు మెజారిటీ ఖచ్చితంగా అవసరం. ఆ మార్కును అందుకోలేకపోవడంతో బిల్లు తిరస్కరణకు గురైంది. దీని ఫలితంగా మహిళా రిజర్వేషన్ అమలుకు సంబంధించిన ప్రక్రియకు సాంకేతిక ఆటంకం ఏర్పడింది.

కాంగ్రెస్ మానసిక దివాళా తీసింది

బిల్లు వీగిపోవడంపై స్పందించిన కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, కాంగ్రెస్ పార్టీ వైఖరిని తీవ్రంగా తప్పుబట్టారు. కాంగ్రెస్ తన మహిళా వ్యతిరేక, ఎస్సీ, ఓబీసీ వ్యతిరేక మనస్తత్వాన్ని మరోసారి బయటపెట్టుకుందని ఆయన మండిపడ్డారు. ‘‘ఓబీసీల పేరుతో కాంగ్రెస్ కపట కన్నీరు కారుస్తోంది. దేశ జనాభాలో సగం మంది ఆశలను వారు అణచివేశారు. మహిళా సాధికారత పట్ల వారి ప్రతికూల వైఖరి పార్లమెంటు సాక్షిగా బట్టబయలైంది’’ అని ఆయన విమర్శించారు.

దేశాన్ని విభజించే కుట్ర జరుగుతోంది..

రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షాలతో కలిసి దేశాన్ని మహిళలు, ఓబీసీలు, ఉత్తర-దక్షిణ అనే ప్రాతిపదికన విభజిస్తున్నారని ప్రధాన్ ఆరోపించారు. రాజ్యాంగబద్ధంగా జరగాల్సిన నియోజకవర్గాల పునర్విభజనను ముసుగుగా వాడుకుని, తమ అసంతృప్తిని దాచుకోవడానికి ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని ఆయన సోషల్ మీడియా వేదికగా మండిపడ్డారు.గతంలో ఇందిరా గాంధీ తన అధికారం కోసం నియోజకవర్గాల పునర్విభజనను ఎలా వాడుకున్నారో దేశానికి తెలుసని గుర్తు చేశారు.

మహిళలు క్షమించరు

ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు బిల్లులూ జాతీయ ప్రయోజనం కోసమేనని ఆయన స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు ఒక పక్కా ప్రణాళికతో మహిళా శక్తికి వ్యతిరేకంగా కుట్ర పన్నాయని, దేశంలోని మహిళలు ఈ పరిణామాలను గమనిస్తున్నారని.. ఈ కుట్రదారులను వారు ఎప్పటికీ క్షమించరని ధర్మేంద్ర ప్రధాన్ హెచ్చరించారు.

Follow Us