Rahul Nyay Yatra: రెండో రోజు కొనసాగుతున్న రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర

లోక్‌సభ ఎన్నికలకు ముందు రాహుల్ గాంధీ నేతృత్వంలో ప్రారంభమైన కాంగ్రెస్ 'భారత్ జోడో న్యాయ్ యాత్ర' రెండో రోజు సోమవారం మణిపూర్‌లోని సెక్మాయి నుండి ప్రారంభమైంది. యాత్రలో రాహుల్ గాంధీ తనకు స్వాగతం పలికేందుకు క్యూలో నిలబడిన ప్రజలతో మమేకమయ్యారు.

Rahul Nyay Yatra: రెండో రోజు కొనసాగుతున్న రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర
Rahul Gandhi Nyay Yatra

Updated on: Jan 15, 2024 | 3:43 PM

లోక్‌సభ ఎన్నికలకు ముందు రాహుల్ గాంధీ నేతృత్వంలో ప్రారంభమైన కాంగ్రెస్ ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ రెండో రోజు సోమవారం మణిపూర్‌లోని సెక్మాయి నుండి ప్రారంభమైంది. యాత్రలో రాహుల్ గాంధీ తనకు స్వాగతం పలికేందుకు క్యూలో నిలబడిన ప్రజలతో మమేకమయ్యారు. అవసరానికి తగ్గట్టుగా మార్పులు చేసిన వోల్వో బస్సులో కాంగ్రెస్ అధినేత ప్రయాణం ప్రారంభించారు. బస్సు ఎక్కే ముందు రాహుల్ గాంధీ కూడా కొంత దూరం నడిచారు.

దారి పొడవునా ప్రజలను కలుసుకుని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రాహుల్ గాంధీ బస్సు ఇక్కడ చాలా రద్దీగా ఉండే ప్రాంతాల గుండా వెళ్ళినప్పుడు అయా మార్గాల్లో మహిళలు, చిన్నారులు సహా పలువురు క్యూలైన్లలో నిలబడి రాహుల్ గాంధీకి మద్దతుగా నినాదాలు చేశారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ ఈ విషయాన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’లో తెలియజేశారు.

ఈ యాత్ర సోమవారం రాత్రి నాగాలాండ్‌లో బస చేస్తుందని జైరాం రమేష్ వెల్లడించారు. “భారత్ జోడో న్యాయ యాత్ర రెండవ రోజు ఉదయం 7.30 గంటలకు క్యాంప్ సైట్ వద్ద సేవాదళ్ సాంప్రదాయ జెండా ఎగురవేయడంతో ప్రారంభమైంది. మణిపూర్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కె.మేఘచంద్ర జెండాను ఎగురవేశారు. “యాత్ర సెక్మై నుండి కాంగ్‌పోక్పి వరకు కొనసాగుతుంది, ఆపై మణిపూర్‌లోని సేనాపతి వరకు సాగుతుంది. యాత్రలో పాల్గొన్న ప్రజలు ఈరోజు రాత్రి నాగాలాండ్‌లో బస చేయనున్నారు. ” అంటూ జైరాం రమేష్ పేర్కొన్నారు.

15 రాష్ట్రాల్లోని 110 జిల్లాల గుండా యాత్ర

కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ జనవరి 14న మణిపూర్ నుండి ‘భారత్ జోడో న్యాయ యాత్ర’ ప్రారంభించారు. ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ 15 రాష్ట్రాలు, 110 జిల్లాల గుండా వెళుతుంది. ఈ ప్రయాణంలో దాదాపు 6,700 కిలోమీటర్ల దూరం ప్రయాణించనున్నారు. ప్రయాణంలో ఎక్కువ భాగం బస్సులో ఉంటుంది. కానీ కొన్ని ప్రదేశాలలో నడక కూడా ఉంటుంది. అయితే ఈ సందర్భంగా రాహుల్ గాంధీ ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ.. తన మనసులోని మాటను చెప్పేందుకు రాలేదని, మీ ఆలోచనలను వినేందుకు వచ్చానని అన్నారు. ఈ యాత్ర ద్వారా లోక్‌సభ ఎన్నికలపై చర్చ జరగాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోందన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…