
వరుస ఆందోళనలు, నిరసనలు, ధర్నాలు, ర్యాలీలతో దేశ రాజధాని ఢిల్లీ హోరెత్తుతోంది. ఓట్ చోరీ ఆరోపణలతో ఇప్పటికే పెద్దయెత్తున ఉద్యమిస్తున్న కాంగ్రెస్.. ఇండికూటమి నేతృత్వంలో పోరాటాన్ని మరింత ఉధృతం చేసేందుకు సిద్ధమైంది. ఢిల్లీ వేదికగా ఇండియా కూటమి ఇవాళ సమరభేరి మోగించబోతోంది. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు ఎంపీలు, ఇండి కూటమి నేతలతో కలిసి సుప్రీంకోర్టు వరకు భారీ నిరసన ర్యాలీ చేయాలని నిర్ణయించింది. అయితే.. CJI నిర్ణయంతో ఇండి కూటమి నేతల మార్చ్‌పై సస్పెన్స్ నెలకొంది. ఓటర్ల జాబితాల ప్రత్యేక విస్తృత సవరణ, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌కు సంబంధించిన అంశాలపై చర్చించేందుకు సోమవారం సమావేశం ఏర్పాటు చేయాలన్న లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ అభ్యర్థనను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ తిరస్కరించారు. ఈ మేరకు రాహుల్ గాంధీకి సీజేఐ కార్యాలయం ఈ మెయిల్ ద్వారా సమాచారం పంపింది.. ప్రతిపక్ష నాయకుడి అధికారిక ఈ మెయిల్‌కు ఇచ్చిన సమాధానంలో ప్రతిపక్షాలు లేవనెత్తదలిచిన అంశాలు ఇప్పటికే సుప్రీంకోర్టులో విచారణలో ఉన్నందున అటువంటి సమావేశం అనుచితమని సీజేఐ పేర్కొన్నారు. రాజ్యాంగ వ్యవస్థ ప్రకారం కార్యనిర్వాహక వర్గం పరిపాలనాపరమైన కార్యకలాపాలలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోలేదని సీజేఐ తెలియజేశారు. అయితే, నాయకులు తమ ప్రాథమిక హక్కుల పరిరక్షణ కోరుతూ న్యాయపరమైన విషయాలలో కోర్టును ఆశ్రయించే స్వేచ్ఛ ఉందని స్పష్టం చేశారు. అయితే సోమవారం సుప్రీంకోర్టుకు ప్రతిపాదిత యాత్రపై సీజేఐ ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేయలేదు.. ఎందుకంటే సీజేఐ కి రాహుల్ గాంధీ రాసిన లేఖలో సుప్రీంకోర్టు మార్చ్‌కి ఎలాంటి అనుమతి కోరలేదని సుప్రీంకోర్టు వర్గాలు వెల్లడించాయి.
ఇప్పటికే మంగళవారం సుప్రీంకోర్టులో SIR ప్రక్రియకు సంబంధించిన కేసులతో పాటు, ప్రతిపక్ష సభ్యులు దాఖలు చేసిన పిటిషన్‌లు విచారణకు రానున్నాయని సీజేఐ కార్యాలయం రాహుల్ గాంధీకి తెలిపింది. ఇతర ఎన్నికల కమిషనర్ల అంగీకారం లేకుండా తీసుకున్నారని.. అలాగే సీఈసీ వివిధ నిర్ణయాలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను కూడా ఇప్పటికే సీజేఐ ధర్మాసనం విచారిస్తోంది. ఈ రోజు ఉదయం, ప్రతిపక్ష పార్టీలు రేపు సుప్రీంకోర్టుకు పాదయాత్ర చేసి, ఎస్ఐఆర్‌ను రద్దు చేయాలని, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని కోరుతూ సీజేఐకి ఒక వినతిపత్రాన్ని సమర్పిస్తాయని రాహుల్ గాంధీ ప్రకటించారు. తాజాగా సీజేఐ SIR , సీఈసీ అంశాలపై చర్చించేందుకు రాహుల్ గాంధీ కి అపాయింట్ నిరాకరించడంతో సోమవారం జరిగే సుప్రీంకోర్టు మార్చ్ పై ఉత్కంఠ నెలకొంది.