
జమ్మూ కశ్మీర్‌లో కాల్పుల కలకలం రేగింది. తోటి జవాన్ జరిపిన కాల్పుల్లో నలుగురు సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది ప్రాణాలు కోల్పోవడం సంచలనంగా మారింది. జమ్మూ కశ్మీర్‌లోని కతువా జిల్లా బశోలి పరిధిలోని హైడ్రోఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ క్యాంప్ దగ్గర జరిగిన ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది.
షిఫ్టుల మార్పు జరిగే సమయంలో సీఐఎస్‌ఎఫ్ జవాన్ల మధ్య తలెత్తిన ఓ చిన్న వివాదం.. ఈ దారుణానికి దారి తీసినట్టు తెలుస్తోంది. జవాన్ల మధ్య వాగ్వాదం పెద్దదిగా మారి కాల్పుల వరకూ వెళ్లింది. 2009 బ్యాచ్‌కు చెందిన ఓ హెడ్ కానిస్టేబుల్ అవధేష్ సింగ్.. తన సర్వీస్ వెపన్‌తో తోటి సిబ్బందిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో అసిస్టెంట్ కమాండెంట్ అంకిత్ కుమార్ పాండే, సబ్ ఇన్‌స్పెక్టర్ లక్ష్మణ్ సింగ్, కానిస్టేబుల్ రఫీక్ అహ్మద్, కానిస్టేబుల్ సందీప్ కుమార్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు.
నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అతను ఉపయోగించిన ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై సీఐఎస్ఎఫ్ కూడా అంతర్గత విచారణ చేపట్టింది. సీఐఎస్ఎఫ్ డీజీ.. కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీకి ఆదేశించారు. అసలు వాగ్వాదం ఎందుకు జరిగింది..? కాల్పులకు దారితీసిన పరిస్థితులు ఏంటన్నది తెలియాల్సి ఉంది. హెడ్ కానిస్టేబుల్ బ్యాక్‌గ్రౌండ్‌పైనా ఆరా తీస్తున్నారు అధికారులు. ఈ ఘటన జరగడానికి కారణాలేంటనే దానిపై.. లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..