వార్నీ ఎంతకు తెగించార్రా..! శవాల మీద పేలాలు ఏరుకోవడం అంటే ఇదే! కోట్ల రూపాయలు కాజేశారు!

ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్ జిల్లాలో వెలుగులోకి వచ్చిన రూ.17.24 కోట్ల పాముకాటు పరిహార కుంభకోణం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. నకిలీ పాముకాటు మరణాల కేసులు సృష్టించి ప్రభుత్వ పరిహారాన్ని అక్రమంగా స్వాహా చేశారనే ఆరోపణలపై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఇప్పటివరకు 14 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసి, పలువురు అధికారులు, ఉద్యోగులను అరెస్టు చేసినట్లు అధికారులు వెల్లడించారు.

వార్నీ ఎంతకు తెగించార్రా..! శవాల మీద పేలాలు ఏరుకోవడం అంటే ఇదే! కోట్ల రూపాయలు కాజేశారు!
Snakebite Scam

Updated on: Jul 20, 2026 | 8:15 PM

ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్ జిల్లాలో వెలుగులోకి వచ్చిన రూ.17.24 కోట్ల పాముకాటు పరిహార కుంభకోణం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. నకిలీ పాముకాటు మరణాల కేసులు సృష్టించి ప్రభుత్వ పరిహారాన్ని అక్రమంగా స్వాహా చేశారనే ఆరోపణలపై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఇప్పటివరకు 14 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసి, పలువురు అధికారులు, ఉద్యోగులను అరెస్టు చేసినట్లు అధికారులు వెల్లడించారు.

ఈ వ్యవహారం బెల్తారా ఎమ్మెల్యే సుశాంత్ శుక్లా అసెంబ్లీలో కాల్ అటెన్షన్ మోషన్ ద్వారా ప్రస్తావించడంతో వెలుగులోకి వచ్చింది. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం దీనిని తీవ్రంగా పరిగణించి ఉన్నతస్థాయి విచారణకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో పోలీసులు, పరిపాలన యంత్రాంగం సంయుక్తంగా దర్యాప్తు ప్రారంభించి, పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేశారు.

బిలాస్‌పూర్ ఎస్‌ఎస్‌పీ రజనీష్ సింగ్ పర్యవేక్షణలో కొనసాగుతున్న దర్యాప్తులో నకిలీ పాముకాటు నివేదికలు, తప్పుడు పత్రాల సృష్టి, పరిహార ఆమోదాల్లో అక్రమాలు, నిధుల పంపిణీలో జరిగిన అవకతవకలపై అధికారులు లోతుగా విచారణ చేపడుతున్నారు. కుట్రలో భాగమైన వారిని గుర్తించేందుకు బ్యాంకు ఖాతాలు, ఆర్థిక లావాదేవీలు, అధికారిక రికార్డులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.

ఈ కేసులో అత్యంత ఆశ్చర్యకరమైన అంశం గణాంకాల్లో బయటపడింది. గత మూడేళ్లలో జష్‌పూర్ జిల్లాలో కేవలం 96 పాముకాటు మరణాలు నమోదవగా, ఒక్క బిలాస్‌పూర్ జిల్లాలోనే 431 మరణాలు నమోదైనట్లు చూపించి దాదాపు రూ.17.24 కోట్ల పరిహారం క్లెయిమ్ చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఈ భారీ వ్యత్యాసమే అధికారుల్లో అనుమానాలకు దారితీసి కుంభకోణాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది.

ఈ ఘటనపై అసెంబ్లీలో తీవ్ర చర్చ జరగగా, రెవెన్యూ మంత్రి టంకారామ్ వర్మ పూర్తి స్థాయి దర్యాప్తు నిర్వహించి దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతుండగా, మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. ఈ కుంభకోణంలో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశముందని అధికారులు పేర్కొన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us