Chennai sisters live with mothers dead body: కన్నతల్లి అనారోగ్యంతో మరిణించింది.. వైద్యులు కూడా ఆమె మరణించిందని ధ్రువీకరించారు.. కానీ కన్నతల్లి మృతిని జీర్ణించుకోలేని ఇద్దరు కుమార్తెలు.. ఆమె మృతదేహం ఐదు రోజుల పాటు ప్రార్థనలు చేస్తూ జాగారం చేశారు. తల్లి పునర్జన్మ ఎత్తాలంటూ ఓ మత గ్రంధం తీసుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అయితే.. రెండు రోజుల నుంచి ఆ ఇంటినుంచి శబ్దాలు వస్తుండటంతో స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు వచ్చి మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు ప్రయత్నించినా వారిపై దాడికి ప్రయత్నించారు. అనంతరం మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. కుమార్తెలను ఆసుపత్రిలో చేర్పించారు.
మనప్పరాయ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తమిళనాడులోని తిరుచ్చి జిల్లా మనప్పరాయ్ పరిధిలోని చొక్కంపట్టికి చెందిన రిటైర్డ్ టీచర్ మేరీ (75) గతవారం పరిస్థితి విషమించడంతో మరణించింది. అయితే.. ఆమె ఇద్దరు కుమార్తెలు జెసితా (43), జయంతి (40).. మెరీ మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చి ప్రత్యేక ప్రార్థనలు చేయడం మొదలుపెట్టారు. ఇటీవల ఓ బంధువు వారి ఇంటికి వెళ్లగా.. మేరీ మృతదేహం పక్కనే కుమార్తెలు ప్రార్థనలు చేయడం కనిపించింది. ఏం జరిగిందంటూ ప్రశ్నించిన అతనిపై జెసితా, జయంతి దాడి చేశారు. స్థానికులకు సైతం అనుమానం రావడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
శనివారం అక్కడకు వెళ్లిన పోలీసులతో మృతురాలి కుమార్తెలు గొడవకు దిగారు. తమ తల్లి ప్రభువు వద్దకు వెళ్లిందని, ఆయన చలువతో పునర్జన్మ పొందుతుందని.. ప్రార్థనలకు అంతరాయం కలిగించవద్దంటూ వారించారు. చివరకు పోలీసులు ఇంట్లోకి ప్రవేశించి మేరీ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కుళ్లిన స్థితిలో మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని ఖననం చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అనంతరం కుమార్తెలను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మేరీ మరణించి వారం అయిఉంటుందని వైద్యులు తెలిపారు.
Also Read: