
న్యూఢిల్లీ, జులై 24: నీట్ 2026 పరీక్షా పేపర్ లీక్‌లపై విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర విద్యాశాఖ కార్యదర్శి వినీత్ జోషిని ఆ పదవి నుంచి తప్పించి, పంచాయతీరాజ్ శాఖకు బదిలీ చేసింది. ఆయన స్థానంలో నరేష్ గంగ్వార్‌ను నియమించింది. 2025 జనవరిలో ఉన్నత విద్యా విభాగం కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన వినీత్ జోషి పాఠశాల విద్యాశాఖ కార్యదర్శిగానూ విధులు నిర్వహిస్తున్నారు. ఈ విభాగాన్ని టీకే అనిల్ కుమార్‌కు అప్పగించారు. ఈ మేరకు గురువారం అర్ధరాత్రి కేంద్ర ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఆధ్వర్యంలో చేపట్టిన విద్యార్ధుల నిరసన నేపథ్యంలో కేంద్రం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా పరీక్షా పేపర్ లీక్ ఘటనలపై విద్యార్థి సంఘాలు, ప్రతిపక్ష పార్టీలు పెద్దఎత్తున నిరసనలు చేపడుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కూడా పలు విద్యార్ధులు డిమాండ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఈ సందర్భంగా ఎంపీ నిశికాంత్ దూబే స్పందిస్తూ పేపర్ లీక్ అంశంపై నిర్లక్ష్యం ప్రదర్శించినందుకే విద్యాశాఖ కార్యదర్శిని మార్చినట్లు తెలిపారు. ఈ వ్యవహారానికి బాధ్యులైన వారితో పాటు నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపైనా కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
గురువారం అర్ధరాత్రి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విడుదల చేసిన వీడియో సందేశంలో విద్యార్థుల ప్రయోజనాల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, పేపర్ లీక్‌లపై మరిన్ని కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పేపర్ లీక్ కేసుల విచారణను వేగవంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసింది. ఈ అంశంపై కేంద్ర మంత్రివర్గ సమావేశంలో నేడు చర్చించి, వచ్చే వారం పార్లమెంట్‌లో ప్రత్యేక బిల్లును ప్రవేశపెట్టేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు.
ఐఐటీ కాన్పూర్ నుంచి మెకానికల్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (IIFT) నుంచి ఎంబీఏ పూర్తి చేసిన ఎవరీ వినీత్.. 1992 బ్యాచ్‌కు చెందిన మణిపూర్ కేడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి. వినీత్ జోషి గతంలో మణిపూర్ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. అలాగే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) తొలి డైరెక్టర్ జనరల్‌గా, సీబీఎస్‌ఈ (CBSE) ఛైర్మన్‌గా కూడా సేవలందించారు. ఇక వినీత్ జోషి స్థానంలో నియమితులైన నరేష్ గంగ్వార్ 1994 బ్యాచ్ పశ్చిమ బెంగాల్ కేడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి. ప్రస్తుతం కేంద్ర మత్స్య, పశుసంవర్ధక పాడి పరిశ్రమల మంత్రిత్వ శాఖలోని జంతు సంవర్ధక, పాడి పరిశ్రమల విభాగం కార్యదర్శిగా పనిచేస్తున్నారు. గతంలో రాజస్థాన్‌లోని టోంక్, ఝాలావర్, జోధ్‌పూర్, భరత్‌పూర్ జిల్లాల్లో కలెక్టర్‌గా సేవలందించారు. 2014లో రాజస్థాన్ పాఠశాల విద్యాశాఖ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. అనంతరం కేంద్ర పర్యావరణ, అటవీ వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖలో జాయింట్ సెక్రటరీగా పనిచేశారు. ఆయన కమ్యూనికేషన్ అండ్ రాడార్‌లో ఎంటెక్, ఆర్థిక శాస్త్రంలో MA డిగ్రీలు పూర్తి చేశారు. కాగా నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఈ తాజా చర్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.