
దేశవ్యాప్తంగా రేషన్ కార్డుదారులకు కేంద్ర ప్రభుత్వం బియ్యం అందిస్తోన్న విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి ఈ పథకాన్ని అమలు చేస్తోంది. రేషన్ సరఫరాలో కేంద్ర ప్రభుత్వ వాటాతో కలిపి రాష్ట్ర ప్రభుత్వాలు సరుకులు పంపిణీ చేస్తున్నాయి. అయితే రేషన్ కార్డుల్లో అనేక అక్రమాలు చోటుచేసుకుంటున్నాయి. బియ్యం పక్కదారి పట్టడం, బ్లాక్ మార్కెట్‌కు తరలిపోతుండటం, నకిలీ రేషన్ కార్డుల సమస్య ఉన్న క్రమంలో దీనిని నివారించేందుకు కేంద్రం ఓ ఆలోచన చేస్తోంది. ఇప్పటికే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్సాఫర్ సిస్టమ్ ద్వారా కేంద్రం లబ్దిదారులు ప్రభుత్వ పథకాల నగదును నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తోంది. దీంతో అక్రమాలను అడ్డుకునేందుకు ఇదే విధానాన్ని రేషన్ కార్డుదారులకు కూడా అమలు చేయాలని కేంద్రం భావిస్తోంది.
రేషన్ కార్డ్ క్యాష్ ట్రాన్స్‌ఫర్ విధానాన్ని తీసుకొచ్చేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. అంటే ప్రభుత్వ పథకాల డబ్బులను నేరుగా లబ్దిదారుల అకౌంట్లలో వేస్తున్నట్లుగానే.. రేషన్ కార్డుదారులకు సరుకులకు బదులు నగదును ఖాతాల్లో జమ చేస్తుందన్నమాట. దీని ద్వారా లబ్దిదారులకు డైరెక్ట్‌గా ప్రయోజనం కలుగుతుంది. ఆ డబ్బులతో తమకు అవసరమైన సరుకులను కొనుగోలు చేసుకోవచ్చు. దీని వల్ల రేషన్ సరఫరాలో జరుగుతున్న అక్రమాలు, బ్లాక్ మార్కెట్‌కు అడ్డుకట్ట వేయవచ్చు. దీంతో త్వరలో ఈ సంస్కరణ దిశగా మోదీ ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రేషన్ షాపుల ద్వారా బియ్యం, గోధుమలు, జొన్న, రాగులు, చక్కెర వంటివి మాత్రమే అందిస్తున్నారు. అదే నేరుగా డబ్బులు బదిలీ చేయడం వల్ల ప్రజలు తమకు నచ్చిన వస్తువులు కొనుగోలు చేయొచ్చు.
ప్రస్తుతం చండీఘడ్, పుదుచ్చేరి, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలతో పాటు దాద్రా నగర్ హావేలిలో ఈ నగదు ట్రాన్స్‌ఫర్ విధానాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభించారు. అక్కడ మంచి ఫలితాలను ఇవ్వడంతో దేశవ్యాప్తంగా అమలు చేసే ఆలోచనలో కేంద్రం ఉంది. ఇందుకోసం లబ్దిదారుల అభిప్రాయాలు, మార్కెట్ ధరల ప్రభావాన్ని ఆధ్యయనం చేస్తోంది. అటు ఏపీ ప్రభుత్వం కూడా ఇలాంటి విధానాన్ని ప్రవేశపెట్టనుందనే వార్తలు కూడా వినిపించాయి. కానీ ప్రభుత్వం ఆ తర్వాత వెనక్కి తగ్గింది. కానీ రానున్న రోజుల్లో ఈ విధానాన్ని మన చూడవచ్చు. ఇదే జరిగితే రేషన్ కార్డు ఉన్నవారి అకౌంట్లో నెలనెలా ప్రభుత్వం నుంచి డబ్బులు రానున్నాయి. ఈ విధానం వల్ల లబ్దిదారులు రేషన్ షాపుల వద్ద క్యూ కట్టాల్సిన అవసరం ఉండదు. ఇఖ మధ్యవర్తుల సమస్యలు తగ్గుతాయి. స్థానిక మార్కెట్లలో ధరలను అంచనా వేసి తక్కువ ధరకే సరుకులు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది.