ఆరు సీట్లు.. నాలుగు రాష్ట్రాలు.. ఉప ఎన్నికల్లో అధికార పార్టీలదే హవా!

నాలుగు రాష్ట్రాల్లో జరిగిన ఆరు ఉప ఎన్నికల ఫలితాలు అధికార పార్టీల ఆధిపత్యాన్ని చాటాయి. పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ, తమిళనాడులో ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని టీవీకే ఘన విజయం సాధించాయి. అస్సాం, పుదుచ్చేరిలోనూ అధికార కూటములకు ప్రజలు పట్టం కట్టారు. కొత్త ప్రభుత్వాలపై ప్రజలకున్న నమ్మకాన్ని, వాటి బలాన్ని ఈ ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి, ప్రతిపక్షాలకు సవాల్ విసురుతున్నాయి.

ఆరు సీట్లు.. నాలుగు రాష్ట్రాలు.. ఉప ఎన్నికల్లో అధికార పార్టీలదే హవా!
By Election Results

Updated on: Oct 09, 2026 | 9:33 PM

అధికారం మారిన తర్వాత ప్రజల తీర్పు ఎలా ఉండబోతోంది..? కొత్త ప్రభుత్వాలపై ఓటర్లకు నమ్మకం పెరిగిందా..? ప్రతిపక్షాలు తమ బలాన్ని నిరూపించుకున్నాయా..? నాలుగు రాష్ట్రాల్లో జరిగిన ఉపఎన్నికల ఫలితాలు ఇప్పుడు ఈ ప్రశ్నలకు సమాధానాలు ఇస్తున్నాయి. పశ్చిమ బెంగాల్‌లో బీజేపీకి బలమైన ఆధిక్యం.. తమిళనాడులో విజయ్‌ నేతృత్వంలోని టీవీకేకు కీలక పరీక్ష.. అస్సాంలో లోక్‌సభ స్థానంపై బీజేపీ పట్టు.. పుదుచ్చేరిలో అధికార కూటమి బలం.. ఇలా ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రాజకీయ లెక్క కనిపిస్తోంది. అయితే ఇవి కేవలం కొన్ని స్థానాల ఫలితాలే అయినా.. కొత్తగా అధికారంలోకి వచ్చిన పార్టీల బలాబలాలను అంచనా వేయడానికి కీలకంగా మారాయి.

ఆరు సీట్లు.. నాలుగు రాష్ట్రాలు. అధికారపార్టీలదే హవా కనిపించింది. పశ్చిమబెంగాల్‌ నందిగ్రామ్‌లో బీజేపీ అభ్యర్థి హసిరాణి రథ్‌ భారీ ఆధిక్యంతో విజయం సాధించారు. కాంగ్రెస్‌ అభ్యర్థి మిలన్‌ ప్రధాన్‌పై లక్షా 22 వేలకుపైగా ఓట్ల తేడాతో గెలిచారు. మరోవైపు, ముస్లిం జనాభా అధికంగా ఉన్న రెజీనగర్‌లోనూ బీజేపీ అభ్యర్థి శంకరరావ్‌ సర్కార్‌ ఆధిక్యంలో నిలిచారు. బెంగాల్‌లో 15 ఏళ్ల తృణమూల్‌ కాంగ్రెస్‌ పాలనకు ముగింపు పలికి బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న ఈ ఉపఎన్నికలు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అయితే, ఓటర్లను బెదిరించారంటూ ఆరోపణలు, పోలింగ్‌ కేంద్రాల్లో అక్రమాలు జరిగాయన్న ఫిర్యాదులు, రీపోలింగ్‌ కోరుతూ కాంగ్రెస్‌ చేసిన డిమాండ్లు కూడా ఈ ఎన్నికల చుట్టూ వివాదాన్ని రేపాయి.

ఇక తమిళనాడులో ముఖ్యమంత్రి విజయ్‌ నేతృత్వంలోని టీవీకే రెండు స్థానాల్లోనూ సత్తా చాటింది. ధారాపురంలో టీవీకే అభ్యర్థి పి. సత్యబామ 66,841 ఓట్లు సాధించి 9,471 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. మదురాంతకంలో టీవీకే అభ్యర్థి మరగతం కుమరవేల్‌ 70,916 ఓట్లు సాధించి డీఎంకే అభ్యర్థి పరంధామన్‌పై 19,421 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఈ రెండు స్థానాలూ గతంలో అన్నాడీఎంకే తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు రాజీనామా చేసి టీవీకేలో చేరడంతో ఖాళీ అయ్యాయి. అందుకే ఈ ఫలితాలు సాధారణ ఉపఎన్నికలకే పరిమితం కావడం లేదు. మేలో అధికారంలోకి వచ్చిన విజయ్‌ ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న ఆదరణకు ఇవి ఒక పరీక్షగా మారాయి. రెండు స్థానాలనూ గెలుచుకోవడం టీవీకేకు రాజకీయంగా ఊతమిచ్చినట్లైంది.

ఇక, అస్సాంలో నాగావ్‌ లోక్‌సభ ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్థి దేవాశిష్‌ శర్మ ఆధిక్యంలో నిలవగా, ఏఐయూడీఎఫ్‌ అధినేత బద్రుద్దీన్‌ అజ్మల్‌, కాంగ్రెస్‌ అభ్యర్థి శివమోని బోరా వెనుకబడ్డారు. కాంగ్రెస్‌ ఎంపీ ప్రద్యుత్‌ బోర్డోలోయ్‌ రాజీనామా చేసి బీజేపీలో చేరి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడంతో ఈ ఉపఎన్నిక అనివార్యమైంది. పుదుచ్చేరిలో తట్టాంచావడి స్థానాన్ని ఎన్‌ఆర్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి అశోక్‌ ఆనంద్‌ 8,474 ఓట్ల ఆధిక్యంతో గెలుచుకున్నారు. ముఖ్యమంత్రి ఎన్‌. రంగసామి ఈ స్థానానికి రాజీనామా చేయడంతో ఉపఎన్నిక జరిగింది. మొత్తంగా చూస్తే, బెంగాల్‌లో బీజేపీ బలాన్ని చాటుకుంటుండగా.. తమిళనాడులో టీవీకే తన విజయ పరంపరను కొనసాగించింది. పుదుచ్చేరిలో అధికార కూటమికి ఊరట లభించింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…

Loading...
Unable to load recommendations.
Follow Us