వెంటాడిని 8ఏళ్ల నాటి కేసు.. మాజీ మంత్రికి షాక్.. 7 ఏళ్ల జైలు శిక్షతోపాటు జరిమానా!

బీహార్ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఎనిమిదేళ్ల నాటి అక్రమ ఆయుధాల కేసులో కీలక తీర్పు వెలువడింది. మాజీ సామాజిక సంక్షేమ శాఖ మంత్రి మంజు వర్మ, ఆమె భర్త చంద్రశేఖర్ వర్మలను కోర్టు దోషులుగా నిర్ధారిస్తూ ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. జరిమానాతో పాటు జ్యుడీషియల్ కస్టడీకి పంపాలని ఆదేశించింది. ఈ తీర్పు రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారింది.

వెంటాడిని 8ఏళ్ల నాటి కేసు.. మాజీ మంత్రికి షాక్.. 7 ఏళ్ల జైలు శిక్షతోపాటు జరిమానా!
Former Minister Manju Verma

Updated on: Aug 02, 2026 | 11:08 AM

బీహార్ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఎనిమిదేళ్ల నాటి అక్రమ ఆయుధాల కేసులో కీలక తీర్పు వెలువడింది. మాజీ సామాజిక సంక్షేమ శాఖ మంత్రి మంజు వర్మ, ఆమె భర్త చంద్రశేఖర్ వర్మలను కోర్టు దోషులుగా నిర్ధారిస్తూ ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. జరిమానాతో పాటు జ్యుడీషియల్ కస్టడీకి పంపాలని ఆదేశించింది. ఈ తీర్పు రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారింది.

బీహార్‌లోని బెగుసరాయ్ ఎంపీ-ఎమ్మెల్యే ప్రత్యేక కోర్టు మాజీ సామాజిక సంక్షేమ శాఖ మంత్రి మంజు వర్మ, ఆమె భర్త చంద్రశేఖర్ వర్మలకు గట్టి షాక్ ఇచ్చింది. 2018లో నమోదైన అక్రమ ఆయుధాల కేసులో ఇద్దరినీ దోషులుగా తేల్చిన కోర్టు.. చెరో ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. అలాగే ఒక్కొక్కరికి రూ.50 వేల చొప్పున జరిమానా కూడా విధించింది. జరిమానా చెల్లించకపోతే అదనంగా మరో ఏడాది జైలు శిక్ష అనుభవించాలని కోర్టు స్పష్టం చేసింది.

శిక్షను ప్రకటించిన వెంటనే ఇద్దరినీ జ్యుడీషియల్ కస్టడీకి అప్పగిస్తూ జైలుకు తరలించాలని న్యాయస్థానం ఆదేశించింది. ఈ కేసు బెగుసరాయ్ జిల్లా చెరియాబరియార్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో 2018లో నమోదైంది. శనివారం (ఆగస్టు 01) బెగుసరాయ్ ఏడీజే-2 ప్రత్యేక న్యాయమూర్తి బ్రజేష్ కుమార్ సింగ్ నేతృత్వంలోని ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు ఈ తీర్పును వెలువరించింది.

ప్రాసిక్యూషన్ వివరాల ప్రకారం.. మంజు వర్మ నివాసంలో సోదాలు నిర్వహించిన సమయంలో 50 అక్రమ తూటాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సమాచారం ఆధారంగా అప్పటి సీబీఐ డీఎస్పీ ఉమేష్ కుమార్ సింగ్ కేసు నమోదు చేయగా, దర్యాప్తు అధికారి రంజిత్ కుమార్ రజక్ విచారణ చేపట్టారు. ఈ కేసులో ప్రాసిక్యూషన్ తరఫున ఏడుగురు సాక్షులు కోర్టులో వాంగ్మూలం ఇచ్చారు. వారి వాంగ్మూలాలు, సమర్పించిన ఆధారాలను పరిశీలించిన కోర్టు.. నిందితులపై ఆరోపణలు రుజువయ్యాయని పేర్కొంటూ శిక్ష విధించింది.

ఈ కేసు వెలుగులోకి వచ్చిన సమయంలో మంజు వర్మ బీహార్ ప్రభుత్వంలో సామాజిక సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అప్పట్లో ఈ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారం రేపింది. అనంతరం కేసు విచారణ వివిధ దశల్లో కొనసాగుతూ దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత తుది తీర్పు వెలువడింది.

ఈ తీర్పుతో మాజీ మంత్రి మంజు వర్మ, ఆమె భర్త చంద్రశేఖర్ వర్మ జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ హైప్రొఫైల్ కేసులో కోర్టు ఇచ్చిన తీర్పు బీహార్ రాజకీయాల్లో మరోసారి చర్చకు దారితీసింది. రాజకీయ నాయకులపై నమోదైన కేసుల్లో చట్టపరమైన విచారణలు ఎంతకాలం పట్టినా, చివరకు న్యాయ ప్రక్రియ తన పని తాను చేస్తుందనే సందేశాన్ని ఈ తీర్పు మరోసారి స్పష్టం చేస్తోందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us