
నవంబర్ 6న బీహార్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశ పోలింగ్ ముగిసిన తర్వాత, మహ్నార్ నియోజకవర్గంలోని ఒక స్ట్రాంగ్ రూమ్ లోపల EVM డిస్‌ప్లే బ్లాంక్‌గా కనిపించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇది కాస్తా స్థానికంగా తీవ్ర దుమారానికి దారి తీయడంతో వైశాలి జిల్లా మేజిస్ట్రేట్ వర్ష సింగ్ ఈ ఘటనపై స్పందించారు. అక్కడ జరిగిన వాస్తవాలను ఆమె తెలియజేశారు. దాంతో పాటు ఆర్జేడీ ఏజెంట్లు కావాలనే ఇలా తప్పుడు ప్రచారం స్ప్రెడ్ చేయడానికి వీడియోలను షేర్ చేస్తున్నారని ఆరోపించారు.
వైశాలి డిఎం వర్ష సింగ్ మాట్లాడుతూ.. జిల్లాలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఆర్‌ఎన్ కళాశాలలో స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటు చేశామని.. జిల్లాలోని ఆయా పార్టీల అభ్యర్థులు, వారి ఏజెంట్లు ఓటింగ్ ప్రక్రియను పర్యవేక్షించడానికి అక్కడ డిస్ప్లే యూనిట్లను ఏర్పాటు చేశామని తెలిపారు. అయితే రాత్రి 11:52 గంటలకు మహనార్ నియోజకవర్గంలోని ఒక డిస్ప్లే బ్లాంక్‌గా కనిపించిందని.. మిగిలిన నాలుగు నియోజకవర్గాల డిస్ప్లేలు పనిచేస్తూనే ఉన్నట్లు ఒక వీడియో వైరల్ అయ్యిందని ఆమె చెప్పుకొచ్చింది. అయితే అది బ్లాంక్ కనిపించడానికి కారణం.. టీవీ ఆటో టైమర్ లాక్ యాక్టివేట్ అవడంతో దాని డిస్ప్లే అకస్మాత్తుగా ఆగిపోయిందని తెలిపారు. కానీ వీడియో రికార్డింగ్ మాత్రమే అలానే కొనసాగిందని.. అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ రూమ్‌లో, ఆ సమయంలో ఐదు అసెంబ్లీ నియోజకవర్గ డిస్ప్లేలు సరిగ్గా పనిచేస్తున్నాయి అని ఆమె తెలియజేసింది.
వీడియో చూడండి..
VIDEO | On viral video showing EVM camera turning off in Mahnar constituency, Vaishali DM Varsha Singh said, “A strong room has been set up at RN College for five Assembly constituencies, and display units have been installed there for the candidates or their agents to monitor.… pic.twitter.com/6yOT28T4Xn
— Press Trust of India (@PTI_News) November 8, 2025
ఆ డిస్ప్లే బ్లాంక్ అయిన సమయంలో లాల్‌గంజ్ నియోజకవర్గానికి చెందిన ఇద్దరు ఆర్జేడీ ఏజెంట్లు అక్కడ ఉన్నారు. ఏజెంట్లలో ఒకరైన కుందన్ కుమార్ వీడియోను రికార్డ్ చేయగా, మరొకరు సోను కుమార్ కంట్రోల్ రూమ్‌కి వెళ్లి మహ్నార్ వీడియో ఫీడ్ కూడా ఆన్‌లోనే ఉందని తెలుసుకున్నాడు. అయినప్పటికీ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని ఆమే ఆరోపించారు.
ఇక ఆ వీడియోలో కనిపించిన పికప్ వ్యాన్ విషయానికొస్తే, అది భద్రతా దళాలకు చెందిన బెడ్డింగ్ మెటీరియల్స్, ఇతర వస్తువులను తీసుకువెళ్లే వ్యాన్‌గా వారు గుర్తించారు. వాహనాన్ని గేటు వద్ద సరిగ్గా తనిఖీ చేసిన తర్వాతే మెటీరియల్‌లను దించడానికి లోపలికి అనుమతించినట్టు తెలిపారు. లోపలికి వచ్చిన 15 నిమిషాల్లోనే అది అన్‌లోడ్ చేసి అక్కడి నుంచి వెళ్లిపోయినట్టు ఆమె తెలిపారు.
ఇదిలా ఉండగా బీహార్ అసెంబ్లీ ఎన్నికలు రెండు దశల్లో జరుగుతున్నాయి. మొదటి దశలో 121 స్థానాలకు నవంబర్ 6న పోలింగ్ ముగిసింది, మిగిలిన 122 స్థానాలకు నవంబర్ 11న పోలింగ్ జరగనుంది. ఫలితాలు నవంబర్ 14న ప్రకటించబడతాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.