
బీహార్‌లోని నలంద జిల్లాలో కేవలం ఒక నిమ్మకాయ కోసం జరిగిన వివాదం, ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. అస్థవాన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సకారావా గ్రామంలో చోటుచేసుకున్న ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
సకారావా గ్రామానికి చెందిన రాజ్‌కుమార్ పాశ్వాన్ కుమారుడు ఝఘ్రు కుమార్ (12), తన స్నేహితులతో కలిసి గ్రామంలో గోలీలాట ఆడుతున్నాడు. అదే సమయంలో పక్కనే ఉన్న నిమ్మ చెట్టు నుండి ఒక నిమ్మకాయ కింద పడటంతో, ఆ బాలుడు దానిని తీసుకున్నాడు. ఇది చూసిన తోట యజమాని గోరఖ్ మియాన్ తీవ్ర ఆగ్రహానికి లోనయ్యాడు. చిన్న పిల్లాడనే జాలి కూడా లేకుండా, చేతిలోని కర్రతో ఝఘ్రుపై విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ దాడిలో బాలుడి తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు.
తీవ్రంగా గాయపడిన బాలుడిని కుటుంబ సభ్యులు హుటాహుటిన బీహార్ షరీఫ్ సదర్ ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే, ఆసుపత్రికి చేరుకునే లోపే ఝఘ్రు కుమార్ ప్రాణాలు విడిచాడు. బాలుడి మరణవార్త తెలియడంతో గ్రామంలో ఒక్కసారిగా విషాదఛాయలు అలుముకున్నాయి. బాధితుడి కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.
నిందితుడిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులకు, గ్రామస్తులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. పరిస్థితి అదుపు తప్పుతుండటంతో పోలీసులు లాఠీఛార్జ్ చేశారని, మహిళలను కూడా కనికరించలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీనివల్ల గ్రామంలో ఉద్రిక్తత మరింత పెరిగింది.
ప్రస్తుతం సకారావా గ్రామంలో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పరారీలో ఉన్న నిందితుడు గోరఖ్ మియాన్ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు హామీ ఇచ్చారు. కేవలం ఒక నిమ్మకాయ కోసం బాలుడిని కొట్టి చంపడం మానవత్వానికే మచ్చగా మిగిలిపోయింది.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..