బెంగళూరులో జరిగిన మహాలక్ష్మి హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ముక్తిరంజన్ రాయ్ అనే వ్యక్తి మహాలక్ష్మిని అత్యంత దారుణంగా హత్య చేసి ఫ్రిజ్‌లో కుక్కిన వ్యవహారంతో దేశం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. అయితే ఈ హత్య అనంతరం కొన్ని రోజులకే నిందితుడు ముక్తిరంజన్ చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.
అయితే ఆత్మహత్యకు ముందు ముక్తిరంజన్ రాసిన సూసైడ్ లెటర్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఎందుకు హత్య చేశాడన్న వివరాలను లెటర్‌లో ప్రస్తావించాడు. మహాలక్ష్మి తన వ్యక్తిగత విషయాలను ప్రస్తావిస్తూ గొడవపడి దాడి చేసి కొట్టిందని, ఆత్మాభిమానం దెబ్బ తినడంతో ఆమెపై ప్రతిదాడి చేసి గొంతు నులిమి చంపేశానని రాసుకొచ్చాడు. అనంతరం మృతదేహాన్ని స్నానం గదిలోకి తీసుకువెళ్లి ఆక్సల్ బ్లేడ్‌తో 59 ముక్కలు చేసి.. ఫ్రిజ్‌లో ఉంచానని తెలిపాడు.
ఇక వాసన రాకుండా రసాయనాలను పిచికారీ చేసి, స్నానాల గదిని శుభ్రం చేసి.. ఆ ఇంటికి తాళం వేసి రైల్లో ఒడిశాలోని మా ఊరికి వచ్చా అంటూ సూసైడ్ లెటర్‌లో ప్రస్తావించాడు. ఈ లేఖరాసిన తర్వాత బుధవారం చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విచారణ చేపట్టిన పోలీసులు సంఘటన స్థలంలో ఉన్న లేఖతో పాటు ల్యాప్‌టాప్, సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
రాయ్- లక్ష్మి ఇద్దరూ మల్లేశ్వరంలోని ఓ సంస్థలో పని చేసేవారు. ఇదే సమయంలో వీరిద్దరి మధ్య స్నేహం ఏర్పడింది, క్రమేణా ఆ స్నేహం ప్రేమగా మారింది. దీంతో ఇద్దరూ కలిసి ఒక గదిని అద్దెకు తీసుకొని సహజీవనం చేయడం మొదలుపెట్టారు. అయితే ఇదే సమయంల రాయ్ ఇతర యువతులతో చనువుగా మాట్లాడటం లక్ష్మికి నచ్చలేదు. దీంతో ఇదే విషయమై ఇద్దరు మధ్య గొడవకు దారి తీసింది. అయితే అప్పటికే పెళ్లై, ఒక బిడ్డకు జన్మనిచ్చిన లక్ష్మిని పెళ్లి చేసుకోవడానికి రాయ్ నిరాకరించాడు. ఈ క్రమంలోనే సెప్టెంబర్ 21వ తేదీని ఇద్దరి మధ్య తీవ్ర స్థాయిలో గొడవ జరగడంతో లక్ష్మిని హతమార్చాడు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..