
కన్నబిడ్డలకు ఏ చిన్న కష్టం వచ్చినా తల్లడిల్లిపోయే తల్లిదండ్రులను చూస్తుంటాం. కానీ, బెంగళూరులో జరిగిన ఒక సంఘటన మాత్రం సమాజం తలదించుకునేలా చేసింది. కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నవారే కాలయముళ్లయ్యారు. కేవలం 11 నెలల వయసున్న పసికందును అత్యంత దారుణంగా హత్య చేసి, ఆపై దానిని ఒక యాక్సిడెంట్‌గా నమ్మించేందుకు ప్రయత్నించిన దంపతుల ఉదంతం నగరంలో తీవ్ర కలకలం రేపింది. స్థానికులు, పోలీసులు ఇచ్చిన సమాచారం ప్రకారం..
పోలీసుల కథనం ప్రకారం, బెంగళూరులో నివసిస్తున్న ఒక దంపతులు తమ 11 నెలల పాప అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయిందని, ప్రమాదవశాత్తు కిందపడిపోవడంతో గాయాలయ్యాయని చెబుతూ ఆసుపత్రికి తీసుకువచ్చారు. అయితే, ఆసుపత్రికి తీసుకువచ్చే లోపే ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. పాప శరీరంపై ఉన్న కొన్ని గాయాల గుర్తులను గమనించిన వైద్యులకు, తల్లిదండ్రులు చెబుతున్న మాటలపై తీవ్ర అనుమానం వచ్చింది. ఇది సాధారణ ప్రమాదం వల్ల జరిగిన మరణం కాదని గ్రహించిన వైద్యులు, వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు.
రంగంలోకి దిగిన పోలీసులు చిన్నారి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించి, తల్లిదండ్రులను విడివిడిగా విచారించడం ప్రారంభించారు. పోస్ట్‌మార్టం ప్రాథమిక నివేదికలో చిన్నారి మరణానికి గల కారణాలు, ఆమె శరీరంపై ఉన్న గాయాలు ఏదో భారీ బలప్రయోగం వల్ల జరిగినవని తేలింది. పోలీసుల తమదైన శైలిలో గట్టిగా నిలదీయడంతో, ఆ కసాయి తల్లిదండ్రులు చేసిన పాపాన్ని ఒప్పుకోక తప్పలేదు.
విచారణలో తేలిందేమిటంటే, జూన్ 9వ తేదీ మధ్యాహ్నం భోజనం కోసం ఇంటికి తిరిగి వచ్చిన తండ్రి శేఖప్ప, తల్లి విజయలక్ష్మిల మధ్య మాటల యుద్ధం జరిగింది. ఆ గొడవలో పాప ఏడవడంతో విజయలక్ష్మి కాలితో తన్నింది. దాంతో, ఆవేశానికి లోనైన శేఖప్ప ఆ పసికందును పైకి ఎత్తి బలంగా నేలకేసి విసిరేశాడు. దీంతో పాపకు అంతర్గత గాయాలయ్యాయి. చంపిన తర్వాత, తాము చట్టం నుండి, సమాజం నుండి తప్పించుకోవడానికి ఆ మరణాన్ని ఒక ప్రమాదంగా చూపించేందుకు నాటకమాడినట్లు వారు అంగీకరించారు.
సాక్షుల నుండి నమోదు చేసిన వాంగ్మూలాల ప్రకారం ఆ దంపతుల మధ్య తరచుగా గొడవలు జరిగేవని తెలిపారు. విజయలక్ష్మికి వివాహేతర సంబంధం ఉందని, ఆమె తన బిడ్డ పట్ల ఆప్యాయంగా ఉండేది కాదని కూడా సాక్షులు ఆరోపించినట్లు సమాచారం. వైద్య ఆధారాలు, సాక్షుల వాంగ్మూలాలు, దర్యాప్తులో వెల్లడైన విషయాల ఆధారంగా, అవలహళ్లి పోలీసులు శిశువు తండ్రి శేఖప్ప, తల్లి విజయలక్ష్మిలపై కేసు నమోదు చేశారు. తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది.
కన్న బిడ్డను అల్లారుముద్దుగా సాకాల్సిన వారే ఇంతటి ఘాతుకానికి ఒడిగట్టడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు నిందితులైన ఆ భార్యాభర్తలను అరెస్ట్ చేసి, వారిపై హత్య, సాక్ష్యాలను తారుమారు చేయడం వంటి తీవ్రమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ దారుణ ఘటనపై సమగ్ర దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు.