బెంగాల్‌లో ఆగని రక్తపాతం: సువేందు అధికారి పీఏ దారుణ హత్య..

పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల అనంతరం హింస పరాకాష్టకు చేరింది. బీజేపీ కీలక నేత, సీఎం అభ్యర్ధి సువేందు అధికారి పర్సనల్ అసిస్టెంట్ చంద్రనాథ్‌ను దుండగులు పాయింట్ బ్లాక్ రేంజ్‌లో కాల్చి చంపడం సంచలనం రేపుతోంది. గత 24 గంటల్లో ఐదుగురు రాజకీయ కార్యకర్తలు ప్రాణాలు కోల్పోవడంతో బెంగాల్ మళ్లీ నెత్తురోడుతోంది.

బెంగాల్‌లో ఆగని రక్తపాతం: సువేందు అధికారి పీఏ దారుణ హత్య..
Suvendu Adhikari

Updated on: May 07, 2026 | 7:09 AM

రాజకీయ హింసకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే పశ్చిమ బెంగాల్‌లో మళ్లీ నెత్తుటి చారలు కనిపిస్తున్నాయి. ఎన్నికల ప్రక్రియ ముగిసినా, ప్రతీకార జ్వాలలు మాత్రం చల్లారడం లేదు. తాజాగా బీజేపీ కీలక నేత, సీఎం రేసులో ఉన్న సువేందు అధికారికి ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న చంద్రనాథ్‌ను గుర్తు తెలియని దుండగులు దారుణంగా కాల్చి చంపారు. నార్త్ 24 పరగణాల జిల్లా మధ్యమ్‌గ్రామ్‌లో ఈ ఘోరం జరిగింది. కారులో వెళ్తున్న చంద్రనాథ్‌ను అడ్డగించిన దుండగులు, పాయింట్ బ్లాక్ రేంజ్‌లో అతి దగ్గరి నుంచి నాలుగు రౌండ్ల కాల్పులు జరిపారు. బుల్లెట్లు శరీరంలోకి దూసుకెళ్లడంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు వదులుకోగా, డ్రైవర్ పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. చంద్రనాథ్ మృతితో ఆగ్రహించిన బీజేపీ శ్రేణులు ఆసుపత్రి ముందు భారీగా ఆందోళనకు దిగాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు భారీగా మోహరించారు.

కేవలం చంద్రనాథ్ హత్యే కాకుండా, గత 24 గంటల్లో బెంగాల్ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో జరిగిన అల్లర్లలో మరో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. బసిర్‌హాట్, ఇంగ్లీష్ బజార్ ప్రాంతాల్లో జరిగిన ఘర్షణల్లో బీజేపీ, టీఎంసీ కార్యకర్తలు మృతి చెందారు. మొత్తం 8 జిల్లాల్లోని 20 ప్రాంతాల్లో అల్లర్లు చెలరేగినట్లు పోలీసులు ప్రకటించారు. కోల్‌కతాలో హింసకు పాల్పడుతున్న 80 మందిని ఇప్పటివరకు పోలీసులు అరెస్టు చేశారు. మరోవైపు టీఎంసీ కూడా ఈ దాడులను తీవ్రంగా ఖండిస్తోంది. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులో ఉన్న సమయంలో ఇలాంటి దాడులు జరగడం ఆందోళనకరమని, తమ కార్యకర్తలను కూడా టార్గెట్ చేస్తున్నారని ఆరోపిస్తోంది. ఈ ఘటనలపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని టీఎంసీ డిమాండ్ చేస్తోంది. బెంగాల్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరడానికి ఏర్పాట్లు జరుగుతున్న తరుణంలో, కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటనకు ముందే ఇలాంటి హత్యలు జరగడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది.

Follow Us