
కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఎన్నిక సమీపిస్తున్న కొద్ది పార్టీలో హడావుడి పెరుగుతోంది. గాంధీలు దూరంగా ఉండడంతో కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష రేసు వేడెక్కింది. కొత్తకొత్త పేర్లు ప్రస్తావనకు వస్తున్నాయి. ఈ లెక్కన ఏఐసీసీ ప్రెసిడెంట్ పోస్ట్‌కు పోటీ తప్పేట్టు లేదు. మరో నాలుగు రోజుల్లో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానున్న తరుణంలో ఇద్దరి మధ్య పోటీ ఉంటుందని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. ఇందులో ఒకరు రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోట్(Ashok Gehlot).. ఒరొకరు సీనియర్ కాంగ్రెస్ నేత శశి థరూర్(Shashi Tharoor) మధ్య పోటీ నడుస్తుందని చర్చించుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష రేసులో శశిథరూర్ నిలబడటం దాదాపు ఖరారైంది. ఆయన పోటీకి కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు జాతీయ రాజకీయాల్లో చర్చ నడుస్తోంది. పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగాలనీ, పార్టీలో సంస్కరణలు రావాలని ఈ మధ్య మలయాళ పత్రికలో ఆర్టికల్ రాసిన శశి థరూర్.. సోనియాగాంధీతో చర్చలు జరిపారు. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానున్న తరుణంలో సీనియర్ నేత శశి థరూర్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీతో భేటీ అయ్యారు.
నిన్న సాయంత్రం థరూర్ సోనియా గాంధీని విదేశాల నుంచి తిరిగి వచ్చిన వెంటనే కలిశారు. తాను ప్రత్యేకంగా ఏ అభ్యర్థికి ప్రాధాన్యత ఇవ్వడం లేదని.. అయితే స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా పోటీ చేయాలని సోనియా గాంధీ చెప్పినట్లుగా ఉన్నత స్థాయి వర్గాలు చెప్పుకుంటున్నాయి. పార్టీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు థరూర్‌కు ఎలాంటి అనుమతి అవసరం లేదని, అది పారదర్శకంగా జరుగుతుందని సోనియా గాంధీ అన్నారు.
అధ్యక్ష ఎన్నికపై చర్చ జరుగుతున్న తరుణంలో రెండు అంశాలకు ప్రాధాన్యత నెలకొంది. ఇందులో మొదటిది -రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌ను గాంధీయేతర అభ్యర్థిగా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఒప్పించేందుకు గాంధీ కుటుంబం ప్రయత్నిస్తున్నాయి. రెండవది – రాజస్థాన్‌తోపాటు ఇతర రాష్ట్రాల్లోని కాంగ్రెస్ యూనిట్లు రాహుల్ గాంధీని మళ్లీ కాంగ్రెస్ అధ్యక్షునిగా తీసుకోవాలని కోరుతూ తీర్మానాలు చేయడం.
ప్రెసిడెంట్‌గా ఉండటానికి తాను విముఖంగా ఉన్నానని బహిరంగంగా చెప్పే గెహ్లాట్.. తాను బయటకు చెప్పినంత విముఖత చూపడం లేదు. మంచి నాయకత్వ లక్షణాలున్న నాయకుడు గెహ్లాట్.. ఇప్పటి వరకు లభించిన పదవులు కాంగ్రెస్ పార్టీ పుణ్యమని ఆయనకు తెలుసు.
అధ్యక్ష పదవిని చేపట్టేందుకు రెడీ ఉన్నట్లుగా ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఇది కాంగ్రెస్ హైకమాండ్‌కు – గాంధీ కుటుంబానికి – ఆయనపై ఉన్న అధిక అభిప్రాయాన్ని కూడా నొక్కి చెబుతుంది. గెహ్లాట్ 2017 గుజరాత్ ఎన్నికలలో రాహుల్ గాంధీతో సన్నిహితంగా పనిచేశారు. రాజస్థాన్‌లో అధికార బీజేపీని ఓడించేందుకు పూర్తి స్థాయిలో పని చేశారు. అయితే ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న తాను ఆ పదవిని వదులుకోవడానికి అస్సలు ఇష్టంగా లేరు. అందులోనూ తన పార్టీ సహోద్యోగి, ప్రత్యర్థి సచిన్ పైలట్‌కు ముఖ్యమంత్రి పదవిని అప్పగించడానికి సిద్ధంగా లేరు. ఇదే విషయాన్ని సోనియా గాంధీతో ప్రస్తావించినట్లుగా తెలుస్తోంది.
గెహ్లాట్.. మంచి ఆర్గనైజర్, క్లిష్టమైన సమయంలో పార్టీ వెంట నడిచిన వ్యక్తి. కాంగ్రెస్ పార్టీతో దీర్ఘకాల సంబంధాలను కలిగిన వ్యక్తి. థరూర్ పోటీలో ఉండటంతో గెహ్లాట్ కూడా పోటీలో ఉండటం తప్పని స్థితి ఏర్పడింది. అయితే థరూర్ ఒక విధంగా G-23 నుంచి ప్రాతినిద్యం వహిస్తే…, గెహ్లాట్ మాత్రం గాంధీ కుటుంబానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారని కాంగ్రెస్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఇరువురు నేతలూ పోటీలో ఉంటే రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీకి వైల్డ్ కార్డ్ ఇచ్చినట్లే అని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
శశిథరూర్..
లేటెస్ట్‌గా స్మార్ట్ పొలిటీషియన్ శశిథరూర్ పేరు కాంగ్రెస్ సర్కిల్స్‌లో మారుమోగుతోంది. మంచివాడే కానీ.. అంటూనే నీళ్లు నములుతున్నారు కాంగ్రెస్ నేతలు. శశిధరూర్‌ని సపోర్ట్ చేస్తారా..? శశిథరూర్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. అందరినీ కలుపుకుపోయే క్వాలిటీ శశికి ఉందా.. అనే కోణంలో ఏఐసీసీ వర్గాల్లో చర్చ మొదలైంది. శశిథరూర్ కెరీర్ ఐక్యరాజ్య సమితిలో ప్రారంభమైంది. జెనీవా, సింగపూర్‌లోని యూఎన్ఓ కార్యాలయాల్లో పనిచేశారు. 2006లో ఐక్యరాజ్యసమితి సెక్రెటరీ జనరల్ ఎన్నికల్లో పోటీ చేశారు. రెండో స్థానంలో నిలిచారు. విద్యావేత్తగా, మేథావిగా, స్ట్రాటజిస్టుగా మంచి పేరున్న శశిథరూర్.. తనను రాజకీయాల్లోకి రమ్మని కమ్యునిస్టులు, బీజేపీ ఆహ్వానించినప్పటికీ కాంగ్రెస్ పార్టీనే ఎంచుకున్నట్టు చెప్పేవారు. 2009 తర్వాత తిరువనంతపురం నుంచి మూడు సార్లు లోక్ సభ ఎన్నికల్లో పోటీచేసి గెలిచారు థరూర్. మన్మోహన్ సింగ్ హయాంలో విదేశి వ్యవహారాల శాఖ మంత్రిగా పనిచేశారు. తర్వాత మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా కూడా చేశారు.
గతంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నిక జరపాలని గట్టిగా డిమాండ్ చేసింది కూడా శశి థరూరే. సీడబ్ల్యుసీలో 12 స్థానాలకు సైతం ఎన్నికలు జరపాలని డిమాండ్ చేసి.. స్మార్ట్ రెబెల్ అనిపించుకున్నారు. కాంగ్రెస్ పార్టీని సంస్కరించాలని డిమాండ్ చేసిన జీ-23 నేతల్లో శశి థరూర్ కూడా ఉన్నారు. వ్యక్తిగతంగాను, వైవాహిక జీవితంలోనూ శశిథరూర్ వివాదాస్పదమయ్యారు. ఆయనకు ముగ్గురు భార్యలు. ఒక భార్య సునంద పుష్కర్ మరణం అనుమానాస్పదంగా మారింది. అమెను శశిథరూరే హత్య చేశారని మీడియాలో ఆరోపణలు వచ్చాయి.
ఇక కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల నామినేషన్ ఈ నెల 24న ప్రారంభం కానుంది. 30 వరకు నామినేషన్ల స్వీకరిస్తారు. అవసరమైతే అక్టోబర్ 17న ఓటింగ్ నిర్వహిస్తారు. ఫలితాన్ని అక్టోబర్ 19న ప్రకటించారు.
దక్షిణాది నేతగా..
కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి అక్టోబర్ 17న ఎన్నికలు జరగబోతున్నాయి. ఎవరు నిలుస్తారు.. ఎవరు గెలుస్తారన్న హీట్ ఇప్పటి నుంచే పెరిగిపోతోంది. దక్షిణాది మనిషిగా శశిథరూర్ ఎంట్రీ ఇవ్వడంతో.. ఉత్తరాది నుంచి పరిస్థితి ఎలా ఉంటుందన్న చర్చ కూడా జరుగుతోంది. కాంగ్రెస్‌లో కామరాజర్ నాటి రోజుల్ని గుర్తు చేసుకుంటున్నారు పాతకాపులు.
కేరళలో రాహుల్ గాంధీ..
మరో వైపు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కేరళలో కొనసాగుతోంది. కేరళలో పాదయాత్ర చేస్తున్న రాహుల్ గాంధీ అక్కడ బోటింగ్‌లో పాల్గొన్నారు. అలపుళ-పున్నమడ సరస్సులో నిర్వహించిన స్నేక్ బోట్‌లో ప్రయాణించారు. ఆయన కూడా కాసేపు తెడ్డు వేశారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి KC వేణుగోపాల్ కూడా బోటులో ప్రయాణం చేశారు. ఒడ్డుకు వచ్చిన తర్వాత బోటు రేసర్లకు ట్రోఫి అందజేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం