
హైదరాబాద్, సెప్టెంబర్ 27: వరుసగా కురుస్తున్న భారీ వర్షాలతో హైదరాబాద్ నగరం ఉక్కిరిబిక్కిరి అవుతుంది. ఎగువ నుంచి వరద నీరు భారీగా చేరడంతో హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్(గండిపేట) నిండుకుండలా ఉన్నాయి. దీంతో ఈ రెండు జంట జలాశయాల గేట్లు తెరచి వరదను దిగువకు వదలడంతో మూసీ ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. శుక్రవారం అర్ధరాత్రి చాదర్‌ఘాట్ లోలెవల్ వంతెన పైనుంచి ఆరు అడుగుల మేర, మూసారాంబాగ్ వంతెనపై నుంచి 10 అడుగుల మేర వరద ప్రవహించింది.
దీంతో ఎంజీబీఎస్‌లోకి వెళ్లే రెండు బ్రిడ్జిలు నీట మునిగాయి. మూసీ వరద నీరు భారీగా ఎంజీబీఎస్ బస్డాండ్‌లోకి చేరింది. చుట్టూ జలదిగ్బంధం కావడంతో వేల మంది ప్రయాణికులు బస్డాండ్‌లో చిక్కుకుపోయారు. మూసీ అంతకంతకు మహోగ్రరూపం దాల్చడంతో సమీప కాలనీల్లో జనాలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. శుక్రవారం రాత్రి 8 గంటల తర్వాత ఒకేసారి 35 వేల క్యూసెక్కుల నీటిని వదలడంతో కనీవినని రీతిలో వరద పోటెత్తింది. ఇంత ప్రవాహం మూసీలో రావడం ఇదే తొలిసారి.
మరిన్ని తాజా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ వార్తా కథనాల కోసం ఇక్కడ వీక్షించండి.
ఉద్యోగులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరిక జారీ చేశారు. మీ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయకండి. తల్లిదండ్రులను పట్టించుకోకపోతే మీ జీతంలో 10 శాతం కట్ చేసి మీ పేరెంట్స్‌కు ఇస్తామని స్పష్టం చేసిన ముఖ్యమంత్రి. త్వరలో చట్టం చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.
తెలంగాణలోని యువతీ యువకులు తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవడానికి ప్రభుత్వం అన్ని రకాల అవకాశాలు కల్పిస్తుందని, ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకుని భవిష్యత్తుకు ప్రణాళికలు వేసుకోవాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. నైపుణ్యత కలిగిన యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనతో పాటు విదేశాల్లో ఉద్యోగావకాశాలను అందిపుచ్చుకోవడానికి సహాయకారిగా ప్రభుత్వంలో ప్రత్యేకంగా ఒక విభాగాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.
అమెరికాలో ఎఫ్ వన్ విద్యార్థులు, ఓపిటిలో ఉన్న అభ్యర్థులు H1b వీసా కోసం దరఖాస్తు చేసుకుంటే లక్ష రూపాయల డాలర్లు ఫీజు వర్తించదని అమెరికా ఇమిగ్రేషన్ నిపుణులు స్పష్టం చేశారు. శనివారం ప్రజాభవన్ లో సీఎం ప్రవాసి ప్రజావాణి నిర్వహించిన హెచ్ -1 బి ఇంటరాక్టివ్ సెషన్ లో పలువురి అనుమానాలను యూఎస్ఏ ఇమిగ్రేషన్ నిపుణులు నివృత్తి చేశారు. భారతదేశంతో సహా ఇతర దేశాల నుంచి కొత్తగా అమెరికా హెచ్ వన్ బి వీసా కోసం దరఖాస్తు చేసుకునే వారికి మాత్రమే లక్ష రూపాయల ఫీజు వర్తిస్తుందని పేర్కొన్నారు.
రాగల రెండు, మూడు గంటలలో జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్ జిల్లాలలో అక్కడక్కడ భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మూడు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. మరో 15 జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. హన్మకొండ, హైదరాబాద్, జనగాం, కామారెడ్డి, కరీంనగర్, మేడ్చల్ మల్కాజిగిరి, మహబూబాబాద్, మంచిర్యాలు, మెదక్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలలో అక్కడక్కడ మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి ఉరుములు, మెరుపులతో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది..
బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అవసరమైతే స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. గవర్నర్ దగ్గర బిల్లు పెండింగ్‌లో ఉన్నప్పుడు జీవో ఇవ్వడం సరికాదని హైకోర్టు స్పష్టం చేసింది. కోర్టుల జోక్యం ఉండకూడదంటే.. 10 రోజులు ఎన్నికలు వాయిదా వేసుకోవాలని హైకోర్టు సూచించింది. తదుపరి విచారణ అక్టోబర్ 8కి వాయిదా వేసింది హైకోర్టు.
బాలకృష్ణ-చిరంజీవి వివాదంపై అసెంబ్లీలో BJP MLA కామినేని శ్రీనివాస్ స్పందించారు. తన వ్యాఖ్యలు అపార్థాలకు దారితీశాయని, ఆ వ్యాఖ్యలకు రికార్డుల నుంచి తొలగించాలని విజ్ఞప్తి చేశారు. వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్‌తో సినీ పరిశ్రమ సమావేశంపై అసెంబ్లీలో కామినేని వ్యాఖ్యలతో రచ్చ జరిగింది. బాలకృష్ణ అసెంబ్లీలోనే కామినేని వ్యాఖ్యలను ఖండించారు. తన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో బాలకృష్ణ -చిరు వివాదంపై కామినేని వెనక్కు తగ్గారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భద్రాచలం దగ్గర గోదావరి పెరగడంతో మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. భక్తులు గోదావరిలోకి వెళ్లకుండా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. పాలేరు, వైరా రిజర్వాయర్లు పూర్తిస్థాయి నీటిమట్టం చేరుకున్నాయి. రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలతో అధికార యంత్రాంగం అప్రమత్తం అయ్యింది.
మంచిర్యాల జిల్లా పరిధిలో ఆదివాసీలకు, అటవీశాఖ అధికారులకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. అటవీ భూములను ఆక్రమించుకుని గుడిసెలు వేసుకున్నారని అటవీశాఖ వాటిని తొలగించి ఆక్రమించిన భూమిని స్వాధీనం చేసుకుంది. మూడు నెలల క్రితం పాలగోరిలో గుడిసెలు వేసుకున్న సిర్పూర్(యు), లింగాపూర్, జైనూరు మండలాల్లోని ఆదివాసీల గుడిసెలను తొలగించి చుట్టు కందకాలను తవ్వించింది. ఆదివాసీలు 350కి పైగా చెట్లు నరికి గుడిసెలు వేసుకున్నారని పేర్కొంది. ఆక్రమణలకు పాల్పడ్డ 26మంది ఆదివాసీలపై కేసు అటవీశాఖ నమోదు చేసింది. అంతేకాక వారిని అరెస్ట్ చేసింది. ప్రస్తుతం ఆదివాసీలు రిమాండ్ లో ఉన్నారు.
కర్నూలు జిల్లాలో దేవరగట్టు మాల సహిత మల్లేశ్వర స్వామి దసర ఉత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. దేవరగట్టు అనేసరికి కర్రల సమరం గుర్తుకొస్తుంది. దసరా రోజు అర్ధరాత్రి నుంచి ఈ సమరం ప్రారంభమవుతుంది.బన్నీ ఉత్సవాలుగా పిలిచే ఈ కర్ర సమరానికి నాంధిగా అర్చకులు పూజలు ప్రారంభించారు.నేరినికి గ్రామంలో ఆలయ అర్చకులు స్వామివార్ల ఉత్సవ విగ్రహాలకు ప్రత్యెక పూజలు చేసి ఉత్సవాలు ప్రారంభించారు. సెప్టెంబర్ 27 శుక్రవారం సాయంత్రం 4 గంటలకు నెరినికి, నెరినికి తండా, కొత్త పేట గ్రామాల భక్తుల మధ్య దేవరగట్టుకు ఉత్సవ విగ్రహాలు తీసుకెళతారు. వచ్చే నెల 2న వరకు దేవరగట్టు కాడు సిద్దప్ప మఠం లో ఉత్సవ విగ్రహాలకు పూజలు భక్తులు నిర్వహిస్తారు.ఈ విగ్రహాలను దక్కించుకోవడానికి పరిసర గ్రామాల ప్రజల సమరం చేస్తారు. దేవరగట్టు ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లను చేశారు అధికారులు.
ఉమ్మడి విశాఖ జిల్లా నక్కపల్లిలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుపై ప్రజాభిప్రాయ సేకరణ ప్రారంభమైంది. ముందు జాగ్రత్తగా పలు గ్రామాల్లో పోలీసులను మోహరించారు. ప్లాంట్ ఏర్పాటుకు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతున్నాయి. భూమి కోల్పోవడం, పర్యావరణ కాలుష్యం మరియు స్థానిక ప్రజల జీవితాలపై ప్రభావం పడుతుందంటూ కొన్ని గ్రామాల ప్రజలు స్టీల్ ప్లాంట్‌ను వ్యతిరేకించడంతో పీసీబీ ప్రజాభిప్రాయసేకరణ ప్రారంభించింది. పాటిమీద గ్రామంలో ఈ కార్యక్రమానికి హాజరయ్యారు కలెక్టర్ విజయ్ కృష్ణన్, కాలుష్య నియంత్రణ మండలి అధికారులు. రాజయ్య పేట, బుచ్చిరాజుపేట, చందనాడ, పాటిమీద, వేంపాడు గ్రామాలనుంచి ప్రజలు భారీగా తరలివచ్చారు.
కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డిని సైతం సైబర్ నేరగాళ్ల వదిలిపెట్టలేదు. ఎమ్మెల్యే సిమ్ కార్డు ను బ్లాక్ చేసి.. కొత్త సిమ్ కార్డు తీసుకున్నారు సైబర్ నేరగాళ్లు. ఆధార్ కార్డు కూడా బ్లాక్ చేయడంతో కొత్త సిమ్ తీసుకునేందుకు ఎమ్మెల్యే కి 23 రోజుల సమయం పట్టింది. గత ఆగస్టు నెల 25 నుంచి సెప్టెంబర్ 1 వరకు ఎమ్మెల్యే అకౌంట్ నుంచి 23 లక్షల రూపాయల నగదును సైబర్ మోసగాళ్లు మాయం చేశారు. ఎమ్మెల్యే ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం పెద ఉప్పలంలో తీవ్ర విషాదం.. ఇంటి పెరట్లోని కొన్ని మొక్కలను పెంచుకుంటోంది ఓ మహిళ రోజూ వాటికి నీరు పోస్తూ బాగోగులు చూసుకుంటోంది. అయితే.. అప్పుడప్పుడు అక్కడ పూలు, కాయలు కోస్తూ ఉంటుంది. అయితే.. పెరట్లోని కరవేపాకును కోసేందుకు చెట్టు దగ్గరకు వెళ్లింది. ఏదో కుట్టినట్టు అనిపించింది. క్షణాల్లో అస్వస్థతకు గురైంది. ఆసుపత్రికి తరలించ్చారు. కానీ ఫలితం లేదు. ప్రాణాలు నిలవలేదు. పాము కాటుతో మహిళ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో కుటుంబం తీవ్ర విషాదంలోకి వెళ్లింది.
స్వదేశీ 4జీ నెట్‌వర్క్‌తో దేశంలో కనెక్టివిటీ విప్లవం వచ్చిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. దేశీయంగా తయారు చేసుకున్న సాంకేతికతతో దేశంలోని మారుమూల ప్రాంతాలన్నీ అనుసంధానం కావటం ప్రగతికి సూచిక అని సీఎం స్పష్టం చేశారు. శనివారం (సెప్టెంబర్ 27) విజయవాడ ఏ కన్వెన్షన్ సెంటర్‌లో బీఎస్ఎన్ఎల్ స్వదేశీ 4జీ నెట్వర్క్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరై ప్రసంగించారు.
పార్టీ కీలక బాధ్యతల నుంచి CPI నేత నారాయణ తప్పుకున్నారు. ఇక నుంచి CPI కంట్రోల్ కమిషన్ చైర్మన్‌గా వ్యవహరించనున్నారు. 75 ఏళ్లు దాటితే రిలీవ్ కావాలని పార్టీ నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే నాయకత్వ స్థాయి నుంచి పదవీ విరమణ చేశానని నారాయణ తెలిపారు.
దక్షిణ ఒడిస్సా తీర ప్రాంతంలో తీరం దాటిన వాయుగుండం. దక్షిణ ఒడిస్సా లో కేంద్రీకృతమైన వాయుగుండ కేంద్రం. ఛత్తీస్గఢ్ లోకి ప్రవేశించి బలహీనపడున్న తీవ్ర అల్పపీడనం. దీని ప్రభావంతో ఈ రోజు తెలంగాణలోని అన్ని జిల్లాలలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం. రేపటి నుండి తగ్గుముఖం పట్టనున్న వర్షాలు. అయితే సెప్టెంబర్ 30 తరువాత బంగాళాఖాతంలో మరొక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం మరో హెచ్చరిక.
నీ పాలన నిర్లక్ష్యం వల్లనే హైదరాబాద్ జల దిగ్బంధంలో ఉందని మాజీ మంత్రి హరీశ్ రావు సీఎం రేవంత్‌పై ధ్వజమెత్తారు. తీవ్ర వర్షాలు ఉంటాయి అని వెదర్ రిపోర్ట్ వచ్చినా ప్రభుత్వం అప్రమత్తంగా లేదు. ఎలాంటి ముందస్తు చర్యలకు ఉపక్రమించక లేదు. ఇది దుర్మార్గం. ఇది క్రిమినల్ నెగ్లిజెన్స్. వరద అంచనా వేయడంలో ప్రభుత్వ వైఫల్యం, ప్రణాళికలు వేయడంలో వైఫల్యం, ప్రభుత్వ విభాగాల సమన్వయంలో వైఫల్యం. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్లనే జల దిగ్బంధంలో హైదరాబాద్! ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్లనే MGBS లో ప్రయాణికులు వరద నీటిలో చిక్కుకోవాల్సిన పరిస్థితి!
పండగ వేళ సొంతూళ్లకు వెళ్ళలేక, భయం భయంగా రాత్రి నుండి పడిగాపులు కాస్తున్నారు. మూసి నది ప్రమాదకరంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో పరిసర ప్రాంత ప్రజలు బిక్కు బిక్కుమంటూ బతుకుతున్నారు. ఇలాంటి సమయంలో ప్రభుత్వం ముందు చూపుతో వ్యవహరించాలి. రేవంత్ రెడ్డి గారు.. మీ బురద రాజకీయాలు కాసేపు పక్కన పెట్టీ వరదలో చిక్కుకున్న ప్రయాణికులను సురక్షితంగా తరలించండి. మూసి పరిసర ప్రాంతాల ప్రజలు ఆందోళనలో ఉన్నారు. ఎప్పటికపుడు సమాచారం అందిస్తూ, అప్రమత్తం చేస్తూ, ముంపు ప్రభావం ఉన్న వారిని తరలించి భరోసా కల్పించండి. తీవ్ర వర్షాలు, వరదల నేపథ్యంలో రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా హైదరాబాద్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నామన్నారు.
భారీ వర్షాల ధాటికి మంజీరా నది ఉదృతంగా ప్రవహిస్తుంది. వనదుర్గా ఆనకట్ట నుంచి దాదాపు 85,396 క్యూసెక్కుల వరద నీరు దిగువకు విడుదల. గర్భగుడిని ముంచెత్తి, అమ్మవారి పాదాలను తాకుతూ ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్న మంజీరా నది.
మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తి ఓ ఇంట్లోకి చొరబడి 5 ఏళ్ల చిన్నారి తలనరికాడు. చిన్నారి తల్లి కేకలు వేయడంతో గ్రామస్థులు చుట్టుముట్టి నిందితుడిని చితకబాదారు. తీవ్ర గాయాలతో నిందితుడి మృతి చెందాడు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది.
ఢిల్లీ విమానాశ్రయంలో వెలుగులోకి ఔషధాల అక్రమ రవాణా. రూ.18 లక్షల విలువైన ఔషధాలను స్వాధీనం చేసుకున్న CISF. విదేశాలకు తరలిస్తున్న ప్రయాణికుడి వద్ద స్వాధీనం. డాక్యుమెంటేషన్ లేకుండా అక్రమంగా తరలిస్తున్నట్టు గుర్తింపు. ప్రయాణికుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్న సంబంధిత ఏజెన్సీలు.
నాగర్ కర్నూలు జిల్లా కోడేరు మండలం బావాయిపల్లి దగ్గర వర్షానికి ఉదృతంగా ప్రవహిస్తున్న వాగు. బైక్ పై వాగు దాటుతుండగా జారీ కింద పడిపోయిన వ్యక్తి. బైక్ తో సహా కొట్టుకుపోతుండగా రక్షించిన స్థానికులు.
మూసి వరద ఎక్కువ అవ్వడంతో మూసి పరివాహిక ప్రాంతంలోని ముసానగర్, శంకర్ నగర్‌లలో ఇళ్లు ఖాళీ చేసి వెళ్తున్న ప్రజలు. మాలక్ పేట్, చాదర్ ఘాట్, శంకర్ నగర్ లో మూసి పరివాహక ప్రాంతాలలో వరద నీరు శంకర్ నగర్‌లోకి రావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు. స్థానిక టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పగిళ్ల నర్సింగ్ పలు కుటుంబాలను వరద ముప్పు నుంచి కాపాడి సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
అంబర్‌పేట్, దిల్‌షుక్‌గర్ వెళ్లే మరో రహదారి గోల్నాక బ్రిడ్జిని మూసివేసిన పోలీసులు. మూసరాంబాగ్ బ్రిడ్జ్, గోల్నాక బ్రిడ్జ్ మూసివేతతో వాహనదారుల ఇబ్బందులు. ప్రత్యామ్నాయ దారి చాదర్‌ఘాట్ నుంచి మళ్లింపు. చాదర్ఘట్ నుంచి వాహనాల దారి మళ్లింపు.
నరేందర్ యాదగిరి గుట్ట భువనగిరి మున్సిపాలిటీ పరిధి రాయగిరి చెరువులో దూకి తల్లి కుమారుడు ఆత్మహత్య. ఆర్ధిక, అనారోగ్యం బాధతో ఆత్మహత్య చేసుకున్న తల్లి, కుమారుడు. యాదగిరిగుట్ట చెందిన కైరంకొండ లలిత, రామకృష్ణ గా గుర్తింపు. కుళ్ళిపోయిన స్థితిలో మృతదేహలు లభ్యం. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పోలీసులు.
కర్నూలు ఎమ్మిగనూరు మండలం సొగనూరులో విషాదం. రోజంతా కురుస్తున్న వర్షానికి తట్టుకోలేక మృత్యువాత పడుతున్న జంతువులు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి తడిసి ముప్పై గొర్రెలు మృతి చెందాయి. అనేక చోట్ల గొర్రెలు మృత్యువాత పడినట్లు ఫిర్యాదులు. మూడు లక్షలు నష్టం. ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్న గొర్రెల కాపారులు.
ఖలిస్తాన్ ఉగ్రవాది పర్మీందర్ సింగ్‌ను పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అబూదాబీ నుంచి భారత్‌కు రప్పించిన పంజాబ్ పోలీసులు. ఖలిస్థాన్ అనుకూల ఉగ్రవాద సంస్థ బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్‌తో పర్మీందర్‌కు సంబంధాలు. కేంద్ర సంస్థల సహాయంతో UAE నుంచి డిపోర్టేషన్. అబూదాబీ నుంచి పంజాబ్‌కు తీసుకెళ్లిన పంజాబ్ పోలీసులు.
సరోగసీ పేరుతో జనాలను మోసం చేస్తున్న యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ అండ్ రీసెర్చ్ సెంటర్ మోసాలు ఈడీ సోదాల్లో బట్టబయలయ్యాయి. పదేళ్లుగా సృష్టి మోసానికి పాల్పడినట్లు దర్యాప్తులో ఆధారాలు లభించాయి. పచ్చిపల్లి నమ్రత ఎలియాస్ అట్లూరి నమ్రత పేరిట దీనిని ఏర్పాటు చేసి పెద్ద మొత్తంలో ఆస్తులు కూడబెట్టినట్లు ఈడీ సోదాల్లో వెల్లడైంది.
తెలుగు రాష్ట్రాల్లో కల్లోలం సృష్టించిన వాయుగుండం దక్షిణ ఒడిశా-గోపాల్‌పూర్ సమీపంలో ఎట్టకేలకు తీరం దాటింది. ప్రస్తుతం పశ్చిమ దిశగా ఛత్తీస్‌గఢ్ వైపు కదిలి బలహీనపడనుంది. దీని ప్రభావంతో ఏపీ, తెలంగాణలో తెలుగు వచ్చే 24 గంటల పాటు అతి భారీ వర్షాలు కురవనున్నాయి.
42 శాతం బీసీ రిజర్వేషన్ల జీఓపై రాంచందర్ రావు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు స్పందించారు. బీజేపీ పదే పదే చెప్పింది జీఓ తెమ్మని. ఇన్నాళ్లు తేలేదు. ఇప్పటికైనా తెచ్చారు. ఈ జీఓ ప్రకారం స్థానిక ఎన్నికలు రాష్ట్ర ప్రభుత్వం జరిపించాలి. ఈ జీఓకు బీజేపీ మద్దతు ఉంటుంది. స్థానిక ఎన్నికలకు బీజేపీ సిద్దంగా ఉంది.
బతుకు పోరాటంలో.. విధులు ముగించుకుని వెళ్తున్న ఆటో డీసీఎం మిల్లర్‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందగా, పలువురికి గాయాలయ్యాయి. ఈ సంఘటన రంగారెడ్ది జిల్లా కందుకూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని పవర్ గ్రీడ్ సమీపంలో శుక్రవారం రాత్రి జరిగింది. ఆటోలో ప్రయాణిస్తుండగా రోడ్లో నిలిచిన డీసీఎం మిల్లర్ ను ఢీ కొట్టింది. వీరంతా యాచారం మండలం కురుమిద్దకు చెందిన వారీగా గుర్తించారు. తుక్కుగూడ సమీపంలోని సోలార్ కంపెనీలో.. రాత్రి 10 గంటలకు విధులను ముగించుకొని తిరిగి వెళుతుండగా ఈ సంఘటన జరిగింది.
ఆరో రోజుకి చేరుకున్న దసరా నవరాత్రి మహోత్సవాలు. శ్రీ లలితా త్రిపుర సుందరి దేవిగా దర్శనమిస్తున్న దుర్గమ్మ. దుర్గమును దర్శించేందుకు బారులు తీరిన భక్తులు. జై దుర్గా జై జై దుర్గ అన్న నామస్మరణతో మారుమోగుతున్న ఇంద్రకీలాద్రి. దసరా వేడుకల్లో అమ్మవారు 6 వ రోజున శ్రీలలితా త్రిపురసందరీదేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తారు. శ్రీచక్ర అధిష్టాన దేవతగా.. పంచదశాక్షరీ మంత్రాధిదేవతగా కొలిచే భక్తులకు అమ్మవారు వరప్రదాయినిగా నిలుస్తారు. అమ్మను ఈరోజు సేవిస్తే సర్వ విధ సౌభాగ్యాలు సిద్ధిస్తాయి. అత్యున్నత స్థితి లభిస్తుంది.ప్రకృతిశక్తికి ప్రతీక లలితాదేవి. మన చుట్టూ ఉండే పాంపభౌతికశకే లలితా.
పంచభూతాలన్నీ ఒకదానిలో ఒకటిగా ఇమిడి ఉన్నాయి. శబ్దం, స్పర్శ, రూపం, రసం, గంధం అనే ఐదు తన్మాత్రల ద్వారా ఒకదానిలో ఒకటి చొచ్చుకొని ఉన్నాయి. ఇన్నిటిలోను ఉండే శక్తి మరొకటి ఉంది. ఆ శక్తినే లలితగా భావన చేసే సంప్రదాయం భారతీయులది సాక్షత్తూ శ్రీలక్ష్మి, సరస్వతీదేవి ఇరువైపులా వింజామరలతో సేవిస్తుండగా.. చిరుమందహాసంతో.. చెరుగడను చేతపట్టుకుని.. పరమశివుని వక్షస్థలంపై కూర్చుకున్న అమ్మవారిని చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. అమ్మవారి ఉపాసన వ్యక్తిలో సౌమ్యత్వాన్ని పెంచుతుంది.
నంద్యాల జిల్లా అష్టాదశ శక్తిపీఠం, ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో దసరా మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఐదవరోజు భ్రమరాంబికాదేవి స్కందమాత అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారి ఆలయ ప్రాంగణం బయట ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై స్కందమాత అలంకారంలో ఉన్న అమ్మవారికి పలురకాల పూలతో అలంకరించి బిల్వాదళాలతో శాస్త్రోక్తంగా ఆలయ అర్చకులు, వేదపండితులు వేదమంత్రాలతో మంగళవాయిద్యాల నడుమ సుగంధ ద్రవ్యాలతో ధూపదీప నైవేద్యాలతో పూజించి మంగళ హారతులిచ్చారు. శ్రీభ్రమరాంబికాదేవి స్కందమాత అలంకారంలో అలానే శ్రీమల్లికార్జునస్వామి అమ్మవారు శేష వాహనంపై ఆశీనులను చేసి ప్రత్యేక పూజలు చేసి కర్పూరహారతులిచ్చరు. దసరా నవరాత్రి ఉత్సవాలలో భాగంగా స్వామి అమ్మవార్ల గ్రామోత్సవానికి వర్షం అడ్డంగిక మారింది.
ఉదయం నుంచి కురుస్తున్న వర్షంతో ఆలయ అధికారులు స్వామి అమ్మవార్ల గ్రామోత్సవాన్ని నిలుపుదల చేసిన అధికారులు అక్కమహాదేవి అలంకారం మండపం వద్ద శేష వాహనంపై ఆసీనులైన స్వామి అమ్మవార్లను భక్తులు దర్శించుకునేలా ఏర్పాట్లు చేశారు. స్వామి అమ్మవార్ల ముందు కేరళ వాయిద్యాలు, కోలాటాలు,రాజభటుల వేషాలు, బ్యాండ్ వాయిద్యాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో శ్రీనివాసరావు దంపతులు, అర్చకులు అధికారుల,పెద్దఎత్తున భక్తులు పాల్గొన్నారు.
చెన్నైలోని సోలింగనూర్‌లో తెలంగాణ విద్యార్థులు బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. చెన్నైలో ఉన్నత విద్య చదువుతున్న తెలంగాణ హైదరాబాద్ విద్యార్థినులు తమ సంప్రదాయ పండుగ ఐన బతుకమ్మను తొలిసారి నిర్వహించటం చాలా గర్వంగా ఉందని విద్యార్థులు అన్నారు. బతుకమ్మ పండుగను నిర్వహియించటానికి తమ విద్యాసంస్థ అనుమటించటం అభినందనీయమని విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు.
చట్టబద్ధత లేని లంబాడీలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలని డిమాండ్ చేస్తూ చలో భద్రాచలం అంటూ ఈ నెల 28న జరిగే ధర్మ యుద్ధం బహిరంగ సభ వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు ఆదివాసీ నాయకులు. పూర్వ కాలంలో ఆదివాసీలు సమాజం, చట్టాలపై అవగాహన లేని కారణంగా పార్లమెంటరీ ప్రక్రియలో ఆర్టికల్ 342 నిర్వహించకుండా, ఆంత్రోపాలజీ, కమిషన్ ఏర్పాటు చేయకుండా ఏకపక్షంగా అధికార బలప్రయోగంతో లంబాడీలను ఎస్టీ జాబితాలో చేర్చారన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో రిజర్వేషన్ల పేరుతో ఆదివాసీల హక్కులకు నష్టం కల్గిస్తున్న లంబాడీలను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు.
పల్నాడు జిల్లామాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అతని సోదరుడు వెంకట్రామిరెడ్డికి పోలీసుల నోటీసులు. నేడు మాచర్ల రూరల్ పిఎస్‌లో విచారణకు హాజరుకానున్న మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. వెల్దుర్తి మండలం గుండ్లపాడు జంట హత్యల కేసులో విచారణకు హాజరుకావాలని మాచర్ల రూరల్ పోలీసులు నోటీసులు. హత్య కేసులో అరెస్టు చేయవద్దంటూ సుప్రీంకోర్టు ను ఆశ్రయించిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. అరెస్టు వద్దంటూనే విచారణకు హాజరు కావాలన్న సుప్రీంకోర్టు.
మూసీ వరదలపై అధికార యంత్రాంగానికి సూచనలు చేశారు సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్ MGBS బస్ స్టేషన్ నుంచి బస్సుల రాకపోకలను టీజీఎస్ఆర్టీసీ తాత్కాలికంగా నిలిపివేసింది. ఎంబీజీఎస్ నుంచి బయలుదేరే బస్సులను హైదరాబాద్ లోని వివిధ ప్రాంతాల నుంచి సంస్థ నడుపుతోంది.
మూసీ వరదనీరు చేరిన నేపథ్యంలో ఎంజీబీఎస్ కు ప్రయాణికులు ఎవరూ రావొద్దంటూ టీజీఎస్ఆర్టీసీ విజ్ఞప్తి. ఇతర వివరాలకు టీజీఎస్ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లను 040-69440000, 040-23450033 సంప్రదించవచ్చు.
తెలంగాణలో భారీగా ఐఏఎస్, ఐపీఎస్‌ల బదిలీలు చేపట్టారు. ఇందులో..
తెలంగాణలో 23 మంది ఐపీఎస్ అధికారులకు బదిలీలు మంజూరయ్యాయి. ఇందులో హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సీవీ ఆనంద్‌ను నియమించారు. హైదరాబాద్ సీపీగా వీజీ సజ్జనార్ నియామకయ్యారు.
తెలంగాణ రాష్ట్రంలో వచ్చే రెండురోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ క్రమంలో రెడ్ అలర్ట్ ప్రకటించింది. సెప్టెంబర్ 27 నుంచి 29వ తేదీ వరకు పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కనీవినని రీతిలో కురుస్తున్న వానలు ఈ నైరుతిలో సగటు కంటే 31% అధిక వర్షపాతం నమోదైనట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది.
పశ్చిమగోదావరి జిల్లా తణుకులో భారీ చోరీ జరిగింది. తణుకు పట్టణంలో మాజీ కౌన్సిలర్ వాకలపూడి వీర రాఘవ ఇంటిలో చోరీ. వారణాసి వారి వీధిలోని ఆయన నివాసంలో ఒంటరిగా ఉంటున్న భార్య కనకదుర్గను అర్ధరాత్రి గుర్తు తెలియని నలుగురు వ్యక్తులు బెదిరించి.. సుమారు 70 కాసులు బంగారంతో పరారైన దుండగులు. సమాచారం తెలుసుకొని దర్యాప్తు ప్రారంభిస్తున్న తాడేపల్లిగూడెం డిఎస్పి విశ్వనాథం.
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో 4వ రోజు. ఉదయం కల్పవృక్ష వాహనం పై నాలుగు మాడ వీధుల్లో ఊరేగనున్న మలయప్ప స్వామి. రాత్రి సర్వభూపాల వాహనంపై శ్రీవారి దర్శనం.
తిరుమల తిరుపతిలో పెరిగిన భక్తుల రద్దీ. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం. 29 కంపార్ట్మెంట్ల లో వేచి ఉన్న భక్తులు. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 75,358 మంది భక్తులు. హుండీ ఆదాయం రూ 2.58 కోట్లు.
రాగల రెండు, మూడు గంటలలో ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ, హైదరాబాద్, జయశంకర్ భూపాలపల్లి, జగిత్యాల, జనగాం, జోగులాంబ గద్వాల్, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, మంచిర్యాలు, నాగర్ కర్నూల్, నల్గొండ, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, వరంగల్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో అక్కడక్కడ తేలకపాటి ఉరుములతో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఏలూరులో పంట పొలాలపై నత్తల దాడి తీవ్రరూపం దాల్చింది. చెట్ల కొమ్మలకు అతుక్కుని రసం పీల్చేస్తుండటంతో నిలువునా ఎండిపోతున్న చెట్లు. తూర్పు గోదావరి జిల్లా నల్లజర్ల మండలం అవపాడు, సింగరాజు పాలెం గ్రామాల్లోని పండ్ల తోటలను తినేస్తున్న నత్తలు. నిమ్మ, కోకో, పామాయిల్, బొప్పాయి, జామతోటలను తీవ్రంగా నష్టపరుస్తున్న నత్తలు.
జోగులాంబ గద్వాల్ జిల్లాలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. తృటిలో తప్పిన పెను ప్రమాదం. ఎర్రవల్లి మండలం వేముల స్టేజి NH 44 పై ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన బోలేరో వాహనం. బోలేరో వాహనం వెనకాలే వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు. ప్రమాదాన్ని తప్పించపోయి ప్రైవేట్ ట్రావెల్ బస్సు బోల్తా. 18 మందికి స్వల్ప గాయాలు, కర్నూల్ ఆస్పత్రికి తరలింపు.
అసెంబ్లీ లో కొందరు ఎమ్మెల్యేల ప్రవర్తన పై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం. ఎమ్మెల్యేలు బొజ్జల సుధీర్ రెడ్డి, కూన రవికుమార్ పై చంద్రబాబు అసహనం. వ్యక్తిగత విషయాలను అసెంబ్లీలో ప్రస్తావించి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలని చూస్తున్నారన్న చంద్రబాబు. శాంతిభద్రతల చర్చ సందర్భంగా వ్యక్తిగత అజెండాలను సభలో ప్రస్తావించి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేలా మాట్లాడారని ఆగ్రహం. 15 నెలలుగా తనను వేధించిన సీఐని మార్చలేకపోతున్నామన్న బొజ్జల సుధీర్. G20 లో సమావేశాల నిర్వహణలో అక్రమాలు జరిగినా చర్యలు తీసుకోలేదన్న కూన రవికుమార్. బొండా ఉమ వ్యక్తిగతంగా అధికారుల టార్గెట్ గా మాట్లాడ్డం కరెక్ట్ కాదన్న చంద్రబాబు.
కామినేని, బాలకృష్ణలు కూడా అనవసర విషయాలను సభలో ప్రస్తావించి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేలా చేశారన్న సీఎం చంద్రబాబు. సభలో సభ్యులను నియంత్రణలో ఉంచలేకపోతున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, చీఫ్ విప్ జీ వీ ఆంజనేయాలపైనా సీఎం ఆగ్రహం. గీత దాటితే సహించేది లేదని వార్నింగ్ ఇచ్చిన చంద్రబాబు. అసెంబ్లీ సమావేశాలకు ఎమ్మెల్యేలు సరిగ్గా హాజరుకాకపోవడం, ఆలస్యంగా రావడం పైనా చంద్రబాబు సీరియస్. కొంతమంది ఎమ్మెల్యేలు ఉదయం 10 గంటలకు వచ్చి, మధ్యాహ్నం మూడు గంటలకు వెళ్ళిపోతున్నారన్న సీఎం. తాను రోజూ 15 గంటలు కష్టపడుతుంటే ఇలాంటి చర్యల వల్ల తన శ్రమ వృధా అవుతుందంటూ సీఎం ఆవేదన. మనం చేసే తప్పులు కారణంగా మళ్ళీ వైసీపీ పుంజుకునేలా చేయొద్దని చెప్పిన సీఎం చంద్రబాబు.
హైదరాబాద్ MGBSను ముంచేసిన మూసీ వరద. జలదిగ్బంధంలో చిక్కుకున్న ఎంజీబీఎస్. బస్‌స్టేషన్‌లో ఇరుక్కుపోయిన ప్రయాణికులు. ప్రయాణికులను తాళ్ల సాయంతో తరలిస్తున్న సిబ్బంది. బస్టాండ్‌కు బస్సుల రాకపోకలను నిలిపివేసిన అధికారులు.
శుక్రవారం తెల్లవారుజాము నుంచి రాత్రి వరకు ఎడతెరిపి లేకుండా కురిసిన వానకు వాగులు, వంకలు పొంగిపొర్లాయి. ఈ క్రమంలో మూసీకి వరద నీరు పోటెత్తింది. గేట్లు ఎత్తి వరద నీటిని దిగువకు వదలడంతో నదికి ఇరువైపులా అంబేడ్కర్ బస్తీతో సహా పలు కాలనీలు నీట మునిగాయి. అధికారులు వందల మందిని సమీపంలోని పునరావాస కేంద్రాలకు తరలించారు. మూసానగర్, శంకర్‌నగర్ బస్తీల్లోని జనాలను పోలీసులు బలవంతంగా బయటకు తీసుకెళ్లారు.
Musi foolds at MGBS bustand
వాయువ్య, పశ్చిమమధ్య బంగాళాఖాతంలో దక్షిణ ఒడిశా-ఉత్తరాంధ్ర తీరాల్లో ఏర్పడిని వాయుగుండం. గడిచిన 6 గంటల్లో, గంటకు 10కిమీ వేగంతో కదిలిన వాయుగుండం. ఇది ప్రస్తుతానికి పూరికి 60 కి.మీ. గోపాల్‌పూర్(ఒడిశా)కి 70కి.మీ., కళింగపట్నం(ఏపీ)కి 180 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. మరికాసేపట్లో గోపాల్‌పూర్‌కు దగ్గరగా దక్షిణ ఒడిశా -ఉత్తరాంధ్ర తీరాలను దాటనున్న వాయుగుండం. ఇవాళ కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. ప్రకాశం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి. మిగతా జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. తీరం వెంబడి 40-60 కిమీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.