మమతాబెనర్జీపై అమిత్‌షా విమర్శలు, కౌంటరిచ్చిన తృణమూల్‌ నేతలు

|

Nov 06, 2020 | 3:19 PM

పశ్చిమ బెంగాల్‌లో అధికారాన్ని చేజిక్కించుకోవాలనే ఏకైక లక్ష్యంతో ఉన్న భారతీయ జనతా పార్టీ తన వ్యూహాలకు మరింత పదునుపెడుతోంది..

మమతాబెనర్జీపై అమిత్‌షా విమర్శలు, కౌంటరిచ్చిన తృణమూల్‌ నేతలు
Follow us on

పశ్చిమ బెంగాల్‌లో అధికారాన్ని చేజిక్కించుకోవాలనే ఏకైక లక్ష్యంతో ఉన్న భారతీయ జనతా పార్టీ తన వ్యూహాలకు మరింత పదునుపెడుతోంది.. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాకు ఆ బరువుబాధ్యతలను అధినాయకత్వం అప్పగించింది.. ఆ పని మీదనే అమిత్‌షా పశ్చిమ బెంగాల్‌లో రెండు రోజులుగా పర్యటిస్తున్నారు.. అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌పార్టీపై ధ్వజమెత్తుతున్నారు. బెంగాలీ సంస్కృతి సంప్రదాయాలను ముఖ్యమంత్రి మమతాబెనర్జీ సర్వనాశనం చేశారని విమర్శించారు అమిత్‌షా. గిరిజన ప్రాంతాల అభివృద్ధి ఆమెకు నచ్చడం లేదని చెప్పారు. పలు ప్రాంతాలలో పర్యటించిన ఆయన బెంగాల్‌ గొప్పదనాన్ని చెప్పుకొచ్చారు. ఈశ్వర్‌చంద్ర విద్యాసాగర్‌, స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంస వంటి గొప్ప గొప్ప మేధావులు జన్మించిన నేల ఇదని కొనియాడారు. ప్రజల మనోభావాలకు విరుద్ధంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యవహరిస్తున్నారన్నారు.. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీకి ఘన విజయం కట్టబెట్టాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.. తాము అధికారంలోకి రావడం ఖాయమన్న ధీమాను కూడా అమిత్‌షా వ్యక్తం చేశారు.. ఇదిలా ఉంటే అమిత్‌ షా చేసిన వ్యాఖ్యలను తృణమూల్‌ కాంగ్రెస్‌పార్టీ తిప్పికొట్టింది. బెంగాల్‌ సంస్కృతి సంప్రదాయాల గురించి వేరేవాళ్లు తమకు చెప్పాల్సిన అవసరం లేదని తెలిపింది. రాజకీయ లబ్ధి కోసం ప్రజల మనోభావాలను పదేపదే అవమానపరుస్తున్నారంటూ తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ నుస్రత్‌ జహాన్‌ ట్విట్టర్‌లో మండిపడ్డారు. తమ సంస్కృతిని తక్కువ చేసి మాట్లాడితే సహించేది లేదన్నారు. ఈశ్వర్‌ చంద్ర విద్యాసాగర్‌, బీర్సాముండాల చరిత్ర చదువుకుంటే మంచిదని సలహా ఇచ్చారు. మమతా బెనర్జీని విమర్శించే నైతికహక్కు బీజేపీ నాయకులకు లేదన్నారు. ఆమె పాలనలో ప్రజలంతా ఆనందంగా ఉన్నారని నుస్రత్‌ జహాన్‌ తెలిపారు.