మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో సంఖ్యా పరంగా వచ్చిన మెజారిటీ..స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే హక్కును కల్పిస్తుంది. కానీ మెజారిటీ ఓటర్లు మద్దతిచ్నినట్లు కాదని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి సంస్మరణ సభలో ప్రసంగించిన ప్రణబ్..ఈ కామెంట్స్ చేశారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ప్రణబ్ వ్యాఖ్యలు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి.
1952 నుంచి వివిధ ప్రభుత్వాలకు ప్రజలు బలమైన మెజారిటీ ఇచ్చినప్పటికీ..ఏ ఒక్క ప్రభుత్వం కూడా 50 శాతానికి పైగా ఓట్లతో ఎన్నుకోబడలేదన్నారాయన. ఈ ఎన్నికల్లో బిజెపి 38 శాతం ఓట్లను సాధించింది. ఇది ఇతర పార్టీలకన్నా ఎక్కువగా ఉన్నప్పటికీ – ప్రజాస్వామ్య మెజారిటీగా పరిగణించలేమన్నారు. 1989లో కాంగ్రెస్ సాధించిన 39.5 శాతం ఓట్లు..ఇప్పటికీ అత్యధిక మెజారిటీ రికార్డును కలిగి ఉన్నాయన్నారు. అఖండ మెజారిటీ రాగానే ఏమైనా చేయొచ్చనే పార్టీలకు ఆ తరువాత అదే ఓటర్లు శిక్ష విధించిన సందర్భాలు కూడా ఉన్నాయన్నారు. అందువల్ల అధికారంలో ఉన్న పార్టీలు ఈ ఆధిక్యతావాదంపై జాగ్రత్త వహించాలని..ఓటరిచ్చే తీర్పును పార్టీలు సరిగా అర్థం చేసుకోవాలని సూచించారు.
అటల్ బిహారీ వాజ్‌పేయికి దేశం, ప్రజలపై మంచి అవగాహన, దూరదృష్టి ఉన్న వ్యక్తి అని కొనియాడారు ముఖర్జీ. దేశంలోని ఏడు ప్రధాన మతాలు, 122 భాషలు, 1600 మాండలికాలకు భారత రాజ్యాంగ ప్రాతినిధ్యం వహిస్తుందన్న వాస్తవికతను అటల్‌జీ అంగీకరించారని అన్నారు. సైద్ధాంతిక ప్రవృత్తులతో చాలా మంది అంగీకరించకపోయినా అందరినీ ఏకతాటిపై నడిపించడంపై దృష్టి సారించారని అన్నారు.