జాట్ల గడ్డపై సమరం.. జయంత్ చౌదరికి అగ్నిపరీక్షగా మారిన మొదటి విడత పోలింగ్

సార్వత్రిక ఎన్నికల రణరంగంలో తొలి సమరానికి అంతా సిద్ధమైంది. దేశవ్యాప్తంగా 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 102 లోక్‌సభ నియోజకవర్గాల్లో జరగనున్న తొలి విడత పోలింగ్‌లో ఉత్తరాదిన ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని 8 నియోజకవర్గాలు యావద్దేశం దృష్టిని ఆకర్షిస్తున్నాయి. యూపీలో పైచేయి సాధిస్తేనే కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం సాధ్యమని దేశ రాజకీయాల్లో ఉన్న నానుడి, నమ్మకం. అన్నట్టుగానే భారతీయ జనతా పార్టీ (BJP) ఈ రాష్ట్రంలో తన ఆధిపత్యాన్ని వరుసగా చాటుతూ వచ్చింది.

జాట్ల గడ్డపై సమరం.. జయంత్ చౌదరికి అగ్నిపరీక్షగా మారిన మొదటి విడత పోలింగ్
Bjp And Rld
Follow us

| Edited By: Srikar T

Updated on: Apr 18, 2024 | 1:58 PM

సార్వత్రిక ఎన్నికల రణరంగంలో తొలి సమరానికి అంతా సిద్ధమైంది. దేశవ్యాప్తంగా 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 102 లోక్‌సభ నియోజకవర్గాల్లో జరగనున్న తొలి విడత పోలింగ్‌లో ఉత్తరాదిన ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని 8 నియోజకవర్గాలు యావద్దేశం దృష్టిని ఆకర్షిస్తున్నాయి. యూపీలో పైచేయి సాధిస్తేనే కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం సాధ్యమని దేశ రాజకీయాల్లో ఉన్న నానుడి, నమ్మకం. అన్నట్టుగానే భారతీయ జనతా పార్టీ (BJP) ఈ రాష్ట్రంలో తన ఆధిపత్యాన్ని వరుసగా చాటుతూ వచ్చింది. అయితే 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో ప్రధాన రాజకీయ పార్టీలు సమాజ్‌వాదీ (SP), బహుజన్ సమాజ్ పార్టీ (BSP), రాష్ట్రీయ లోక్‌దళ్ (RLD) ఒకవైపుగా నిలిచి బీజేపీకి సవాల్ విసరాయి. ఈ పరిస్థితుల్లో 2014తో పోల్చితే 2019లో బీజేపీ స్కోర్ తగ్గింది. కానీ ఈసారి సమీకరణాలు మారాయి. ఈ మూడు పార్టీలు ఇప్పుడు వేర్వేరు కూటముల్లో ఉన్నాయి. సమాజ్‌వాదీ పార్టీ కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్ష కూటమి (I.N.D.I.A)లో ఉండగా, రాష్ట్రీయ లోక్‌దళ్ కొద్ది నెలల క్రితం బీజేపీ సారథ్యంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA)లో చేరింది. మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ ఒంటరి పోరాటానికి సిద్ధపడింది. ఇలా సమూలంగా మారిన రాజకీయ పరిస్థితులు, సమీకరణాల నేపథ్యంలో తొలి విడతలో యూపీలోని మొత్తం 80 నియోజకవర్గాల్లో 8 కీలక నియోజకవర్గాలు తొలి విడత పోలింగ్‌కి సిద్ధపడ్డాయి. ఉత్తరాఖండ్ రాష్ట్రానికి ఆనుకున్న పశ్చిమ యూపీలోని సహరన్‌పూర్, కైరానా, ముజఫర్‌నగర్, బిజ్నోర్, నగీనా, మొరాదాబాద్, రాంపూర్, పీలీభీత్ నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది.

15 సంవత్సరాల తర్వాత మళ్లీ కుదిరిన పొత్తు..

సార్వత్రిక ఎన్నికలకు కొద్ది నెలల ముందు వరకు రాష్ట్రీయ లోక్‌దళ్ విపక్ష కూటమిలో భాగంగా ఉంది. ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్ వారసుల చేతిలో ఈ పార్టీకి జాట్ సామాజికవర్గంలో గట్టి పట్టుంది. ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలో పశ్చిమ ప్రాంతంలో ఈ వర్గం ప్రజలు గణనీయమైన సంఖ్యలో ఉండడంతో పాటు ఇతర వర్గాలను ప్రభావితం చేయగల్గిన భూస్వాములుగా ఉన్నారు. హర్యానాను ఆనుకున్న యూపీలోని 14-15 జిల్లాల్లో వీరు ప్రభావం చూపగలరు. గత ఎన్నికల్లో ఎస్పీ, బీఎస్పీతో కలిసి పోటీ ఆర్ఎల్డీ ఒక్క సీటు కూడా సాధించలేకపోయినప్పటికీ.. బీజేపీ ఆధిపత్యానికి గండికొట్టింది. రాష్ట్రంలోని మొత్తం 80 నియోజకవర్గాల్లో ఎస్పీ-బీఎస్పీ-ఆర్ఎల్డీ కూటమి 15 స్థానాలను కైవసం చేసుకోగా, వాటిలో ఎక్కువ సంఖ్యలో పశ్చిమ యూపీలోనే ఉన్నాయి. తొలి విడత పోలింగ్ జరుపుకోనున్న 8 నియోజకవర్గాల్లో 5 చోట్ల ఈ కూటమే గెలుపొందింది. ఈ పార్టీ కల్గించిన నష్టాన్ని గ్రహించిన కమలనాథులు ఈసారి ఎలాగైనా తమ కూటమిలో చేర్చుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆర్ఎల్డీ అధినేత చౌదరి జయంత్ సింగ్‌ తాత, మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్‌కు భారతరత్న ప్రకటించడం కూడా ఇందులో భాగమేనని రాజకీయ విశ్లేషకులు చెబుతుంటారు. తనను రాజ్యసభకు పంపిన సమాజ్‌వాదీ పార్టీపై కృతజ్ఞత కంటే.. తన తాతకు భారతరత్న ఇచ్చిన బీజేపీపైనే జయంత్ ఎక్కువ కృతజ్ఞతను ప్రదర్శించారు. ఎలాగైతేనేం కమలదళం అధినేతల ప్రయత్నాలు ఫలించాయి. దాదాపు 15 ఏళ్ల తర్వాత బీజేపీ-ఆర్ఎల్డీ మళ్లీ కలిశాయి. చివరిసారిగా 2009లో బీజేపీతో కలిసి 7 స్థానాల్లో పోటీ చేయగా, 5 చోట్ల గెలుపొందింది. ఈసారి బీజేపీతో పొత్తుల్లో భాగంగా కేవలం 2 స్థానాల్లో మాత్రమే పోటీ చేస్తుండగా.. వాటిలో ఒకటైన బిజ్నోర్ తొలి విడత పోలింగ్ జాబితాలో ఉంది.

ఈ కూటమి చెలిమిని వివిధ అంశాలు ప్రతికూలంగా ప్రభావితం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దశాబ్దకాలానికి పైగా విరోధులుగా ఉన్న రెండు పార్టీల కార్యకర్తల మధ్య సయోధ్య ఒక అంశమైతే.. రైతుల ఆందోళన మరో అంశం. ఢిల్లీ నగరాన్ని చుట్టుముట్టిన రైతుల్లో పశ్చిమ యూపీలోని జాట్ రైతులు కూడా భాగమే. ఈ రెండు అంశాలతో పాటు 2013లో జరిగిన ముజఫర్‌నగర్ అల్లర్ల ఘటనల ప్రభావం కూడా ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. యూపీలోని ముస్లిం జనాభాలో ఎక్కువ శాతం పశ్చిమ యూపీలోనే ఉన్నారు. సహజంగానే దేశ రాజకీయాల్లో ముస్లిం జనాభా బీజేపీకి వ్యతిరేకంగా ఉంటుంది. ఇలాంటి ప్రతికూలతల మధ్య పొత్తు ద్వారా సానుకూల ఫలితాలు తీసుకురావడం సవాళ్లతో కూడుకున్న వ్యవహారంగా కనిపిస్తోంది. తొలి విడతలోని 8 నియోజకవర్గాల్లో ఈసారి కనీసం 5 గెలిచినా ఆర్ఎల్డీతో పొత్తు విజయం సాధించినట్టే. అందుకే ఇది జయంత్ చౌదరికి అగ్నిపరీక్షగా మారింది.

ఇవి కూడా చదవండి

కీలక నేతలు – సమీకరణాలు..

తొలి విడత పోలింగ్ జరుపుకోనున్న 8 నియోజకవర్గాల్లో 2019లో బీఎస్పీ 3 (సహరన్‌పూర్, బిజ్నోర్, నగీనా), సమాజ్‌వాదీ 2 (రాంపూర్, మొరాదాబాద్) గెలుచుకోగా బీజేపీ 3 (కైరానా, ముజఫర్‌నగర్, పీలీభీత్) స్థానాలు గెలుచుకుంది. ఇందులో ముజఫర్‌నగర్ స్థానాన్ని కేవలం 6,526 ఓట్ల తేడాతో గెలుచుకోగలిగింది. అక్కడ గెలిచిన సంజీవ్ బల్యాన్ ప్రస్తుతం కేంద్ర మత్స్య, పశు సంవర్థక, డైరీ శాఖ మంత్రిగా ఉన్నారు. జాట్-ముస్లిం వర్గాల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న ఈ నియోజకవర్గంలో ఈసారి బల్యాన్‌పై సమాజ్‌వాదీ తరఫున మాజీ ఎంపీ హరేంద్ర మాలిక్ బరిలోకి దిగడంతో హోరాహోరీ పోరు నెలకొంది. బల్యాన్‌కు వ్యతిరేకంగా రాజ్‌పుత్ – ఠాకూర్ నేత, మాజీ ఎమ్మెల్యే సంగీత్ సోమ్ తిరుగుబాటు చేయడంతో కమలనాథులు కొంత ఆందోళన చెందుతున్నారు. ఆ వర్గానికి చెందిన సీనియర్ నేతలు రాజ్‌నాథ్ సింగ్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌లు రంగంలోకి దిగి సంగీత్ సోమ్‌ను బుజ్జగించే ప్రయత్నాల్లో ఉన్నారు.

గత ఎన్నికల్లో పీలీభీత్ నుంచి 2.55 లక్షల మెజారిటీతో గెలుపొందిన వరుణ్ గాంధీని బీజేపీ పక్కనపెట్టి, ఆ స్థానంలో యూపీ మంత్రిగా ఉన్న జితిన్ ప్రసాదను బరిలోకి దించింది. మోదీ సర్కారుపై వరుణ్ గాంధీ చేసిన విమర్శలే ఆయన్ను పక్కనపెట్టేలా చేశాయని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు అక్కణ్ణుంచి పోటీలో ఉన్న జితిన్ ప్రసాద స్థానికేతరుడు కావడం ఒక ప్రతికూలాంశంగా ఉండగా, ఆయన పూర్తిగా మోదీ మ్యాజిక్‌పై ఆధారపడి ప్రచారం చేసుకుంటున్నారు.

గత ఎన్నికల్లో ఎస్పీ-బీఎస్పీ-ఆర్ఎల్డీ పొత్తుల్లో భాగంగా బీఎస్పీ గెలుపొందిన సహరన్‌పూర్‌లో సమీకరణాలు విచిత్రంగా మారాయి. బీఎస్పీ సిట్టింగ్ ఎంపీ హాజీ ఫజీలుర్ రెహమాన్ సమాజ్‌వాదీలో చేరారు. అయితే పొత్తుల్లో ఈ సీటు కాంగ్రెస్‌కు కేటాయించగా, ఆ పార్టీ తరఫున తరఫున ఇమ్రాన్ మసూద్ మరోసారి పోటీ చేస్తున్నారు. ఆయన 2014 నుంచి జరిగిన పార్లమెంటు ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఓడిపోతూ వచ్చారు. మరోవైపు సిట్టింగ్ ఎంపీని కోల్పోయిన బీఎస్పీ మాజిద్ అలీని రంగంలోకి దించింది. 3.5 లక్షల మంది దళితులు, 6 లక్షల మంది ముస్లింలు ఉన్న ఈ నియోజకవర్గంలో ఇప్పుడు సమీకరణాలు ఆసక్తికరంగా మారాయి.

ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గమైన నగీనాలో ముస్లిం జనాభా దాదాపు 50 శాతం ఉంది. ఇక్కడ ముస్లిం – దళిత సమీకరణాల్లో ఎప్పుడూ బీఎస్పీ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ వస్తోంది. అయితే ఈసారి దళిత వర్గాల్లో పట్టు పెంచుకుంటున్న ఆజాద్ సమాజ్ పార్టీ (ASP) చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ పోటీ చేస్తున్నారు. మరోవైపు బీజేపీ తమ ఎమ్మెల్యే ఓం కుమార్‌కు నగీనా లోక్‌సభ సీటు ఇచ్చింది. సమాజ్‌వాదీ పార్టీ రిటైర్డ్ జడ్జి మనోజ్ కుమార్‌ను బరిలోకి దించింది. దీంతో ఇక్కడ బీఎస్పీ ఏకపక్ష ఆధిపత్యం కొనసాగించే పరిస్థితి లేకుండా చతుర్ముఖ పోటీ నెలకొంది.

వీటితో పాటు గతంలో ప్రముఖ క్రికెటర్ మహ్మద్ అజారుద్దీన్ ప్రాతినిథ్యం వహించిన మొరాదాబాద్, ప్రముఖ సినీ నటి జయప్రద ప్రాతినిథ్యం వహించిన రాంపూర్ నియోజకవర్గాలు కూడా తొలి విడతలోనే ఉన్నాయి. గత ఎన్నికల్లో సమాజ్‌వాదీ గెలుపొందిన ఈ నియోజకవర్గాల్లో ప్రముఖ సమాజ్‌వాదీ పార్టీ నేత ఆజంఖాన్ ప్రభావం, ఆధిపత్యం ఎక్కువగా ఉంటుంది. నిజానికి గత ఎన్నికల్లో రాంపూర్ స్థానం నుంచి ఆజంఖాన్ గెలిచినప్పటికీ.. ఓ ఫోర్జరీ కేసులో జైలు శిక్ష పడడంతో ఆయన 2022లో తన పదవిని కోల్పోవాల్సి వచ్చింది. అప్పుడు జరిగిన ఉపఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఘన్‌శ్యాం లోధి గెలుపొందగా, ఈసారి పార్టీ మళ్లీ ఆయనకే టికెట్ ఇచ్చింది. 50 శాతం కంటే ఎక్కువ సంఖ్యలో ముస్లిం జనాభా కల్గిన ఈ నియోజకవర్గంలో ఈసారి సమాజ్‌వాదీ పార్టీ యాదవ్ వర్గానికి చెందిన స్థానికేతర నేతకు టికెట్ ఇచ్చింది. ఈ చర్య ఆజంఖాన్‌కు ఏమాత్రం ఇష్టం లేదు. టికెట్ ఆశించిన ఖాన్ అనుచరుడు మౌలానా మొహిబుల్లా నద్వీ.. ఇప్పుడు బీఎస్పీ అభ్యర్థి జిషన్ ఖాన్‌ కోసం పనిచేస్తున్నారు. జైల్లో ఉన్నప్పటికీ ఆజంఖాన్ కూడా చక్రం తిప్పుతున్నారు. ఇలా సమాజ్‌వాదీలోనే నెలకొన్న అంతర్గత విబేధాలు ఎవరికి చేటు చేస్తాయి, ఎవరికి మేలు చేస్తాయన్నది ఆసక్తికరంగా మారింది.

మొత్తంగా ఈ ప్రాంతంలో ఓటర్లను ప్రభావితం చేసే అంశాల్లో ముఖ్యమైనది చక్కెర మిల్లుల బకాయిలు, చెరకు పంటకు కనీస మద్దతు ధర, శాంతిభద్రతలు, కనీస మద్ధతు ధరకు చట్టబద్ధత, క్షత్రియ (రాజ్‌పుత్) సామాజికవర్గానికి టికెట్ల కేటాయింపులో ప్రాధాన్యత లేకపోవడం వంటివి ఉన్నాయి. వీటిలో ప్రధాన కూటములు, ఏ కూటమిలోనూ లేని బీఎస్పీ విజయావకాశాలను ఎంతమేర ప్రభావితం చేస్తాయన్నది త్వరలో తేలనుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.