Air Ambulance Crush: ఝార్ఖండ్‌లో కుప్పకూలిన ఎయిర్‌ అంబులెన్స్‌.. పైలట్లతో సహా ఏడుగురి దుర్మరణం!

ప్రాణాపాయంలో ఉన్న ఓ రోగికి అత్యవసర చికిత్స కోసం ఢిల్లీకి తరలించేందుకు రాంచీ నుంచి బయల్దేరిన ఎయిర్‌ అంబులెన్స్‌ సోమవారం (ఫిబ్రవరి 23) రాత్రి కుప్పకూలిపోయింది. ఈ దుర్ఘటన లో ఎయిర్ అంబులెన్స్‌లో ఉన్న ఏడుగురు వ్యక్తులు దుర్మరణం చెందారు. ఝార్ఖండ్‌లోని చత్రా జిల్లా సిమరియా వద్ద ఫారెస్ట్‌ ఏరియాలో విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో అందులో ఉన్న ఏడుగురు ప్రాణాలు కోల్పోయినట్లు ఝార్ఖండ్‌ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది..

Air Ambulance Crush: ఝార్ఖండ్‌లో కుప్పకూలిన ఎయిర్‌ అంబులెన్స్‌.. పైలట్లతో సహా ఏడుగురి దుర్మరణం!
Jharkhand Air Ambulance Crush

Updated on: Feb 24, 2026 | 6:11 AM

రాంచీ, ఫిబ్రవరి 24: రెడ్‌బర్డ్ ఎయిర్‌వేస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన బీచ్‌క్రాఫ్ట్‌ సీ90 విమానం సోమవారం రాత్రి 7.11కి రాంచి నుంచి బయల్దేరిన కాసేపటికే కుప్పకూలింది. సరిగ్గా 7.34 గంటల సమయంలో ఏటీసీతో సంబంధాలు కోల్పోయింది. ఆ తర్వాత కాసేపటికే సిమారియాలోని బరియాటు పంచాయతీ ప్రాంతంలో ఈ ఘోరం చోటు చేసుకుందని చత్రా డిప్యూటీ కమిషనర్ కీర్తిశ్రీ వెల్లడించారు. ఎయిర్‌ అంబులెన్స్ విమానం రాత్రి 10 గంటలకు ఢిల్లీకి చేరుకోవాల్సి ఉంది. కాలిన గాయాలతో ఉన్న రోగి సంజయ్‌కుమార్‌ (41)ను మెడికల్‌ ఎమర్జెన్సీ కోసం ఢిల్లీకి తరలిస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

ప్రమాదంలో ఎయిర్‌ అంబులెన్సులో ఉన్న రోగితోపాటు ఓ డాక్టర్ ఒక పారామెడికల్‌ ఉద్యోగి, ఇద్దరు సహాయకులు, ఇద్దరు పైలట్లు ఉన్నారు. విమానం ప్రమాదంలో మృతి చెందిన ఈ ఏడుగురి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు SDPO శుభం ఖండేల్వాల్ మీడియాకు తెలిపారు. మృతులను కెప్టెన్ వివేక్ వికాస్ భగత్, కెప్టెన్ సావ్రాజ్‌దీప్ సింగ్, సంజయ్ కుమార్, డాక్టర్ వికాస్ కుమార్ గుప్తా, సచిన్ కుమార్ మిశ్రా, అర్చన దేవి, ధురు కుమార్‌గా గుర్తించారు. DGCA వెబ్‌సైట్ ప్రకారం ఢిల్లీకి చెందిన నాన్-షెడ్యూల్డ్ ఆపరేటర్ రెడ్‌బర్డ్ తన ఫ్లీట్‌లో ఆరు విమానాలు ఉన్నాయి. వీటిల్లో క్రాష్ అయిన విమానం కూడా ఉంది.

కుప్పకూలిన ఈ ఎయిర్ అంబులెన్స్‌ను తమ రోగులలో ఒకరు ఏర్పాటు చేశారని రాంచీలోని దేవ్‌కమల్ హాస్పిటల్ CEO అనంత్ సిన్హా మీడియాకు చెప్పారు. లతేహార్ జిల్లాలోని చాంద్వా నివాసి సంజయ్ కుమార్ (41) అనే రోగిని ఫిబ్రవరి 16న 65 శాతం కాలిన గాయాలతో ఆసుపత్రికి తీసుకువచ్చారు. అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని, మెరుగైన చికిత్స కోసం కుటుంబ సభ్యులు అతన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారని ఆయన అన్నారు. సోమవారం వారు ఎయిర్ అంబులెన్స్ ఏర్పాటు చేశారు. రోగి సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో ఆసుపత్రి నుంచి ఢిల్లీకి బయలుదేరడని తెలిపారు. విమానం టేకాఫ్ అయిన 20 నిమిషాల తర్వాత ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తో సంబంధాలు తెగిపోయాయని రాంచీ విమానాశ్రయ డైరెక్టర్ వినోద్ కుమార్ చెప్పారు. ప్రమాదానికి ప్రతికూల వాతావరణం కారణం కావచ్చని, కానీ అసలు కారణం దర్యాప్తు తర్వాతే తెలుస్తుందని ఆయన అన్నారు. జిల్లా యంత్రాంగం సెర్చ్ అండ్ రెస్క్యూ బృందం ఇప్పటికే ఘటనా స్థలానికి చేరుకుందని, వీరితో పాటు ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) బృందాన్ని కూడా పంపుతున్నట్లు తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us