
పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు అన్ని పక్షాలూ ఎవరికివాళ్లు కావల్సినంత స్టఫ్ రెడీ చేసుకున్నాయి. పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్, బిహార్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ, జమ్మూకాశ్మీర్ రాష్ట్ర హోదా పునరుద్ధరణ… ఇలా మాట్లాడ్డానికి పెద్ద ఎజెండానే సిద్ధంగా ఉంది. ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారిగా భేటీ కాబోతోంది ఇండియన్ పార్లమెంట్. సింధూరే కాదు అంతకుమించి సౌండిస్తామంటున్నాయి అపోజిషన్ పార్టీలు. ఉభయసభలూ దద్దరిల్లిపోగలవ్ అనే సంకేతాలు ఆల్రెడీ వచ్చేశాయ్. ముఖ్యంగా ఆపరేషన్ సిందూర్‌పై గోప్యత లేకుండా అన్ని వివరాలూ సమగ్రంగా దేశప్రజల ముందుంచాలని కేంద్రాన్ని డిమాండ్ చేయబోతోంది ఇండీ కూటమి. పాక్‌తో కాల్పుల విరమణపై ట్రంప్ చేసిన వ్యాఖ్యల్ని ప్రస్తావించి ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశముంది. పార్లమెంటు వేదికగా దేశానికి ఆపరేషన్ సింధూర్‌పై క్లియర్ పిక్చర్ ఇవ్వడానికి మోదీ సర్కార్ కూడా సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది.
సమావేశాల ఎజెండాపై ఓ నిర్ణయానికొచ్చేందుకు పార్లమెంట్ అనెక్స్ భవనంలో కేంద్రమంత్రి జేపీ నడ్డా నేతృత్వంలో అఖిల పక్షం సమావేశమైంది. రెండున్నర గంటలపాటు జరిగిన ఈ భేటీకి రక్షణమంత్రి రాజ్‌నాథ్ అనారోగ్య కారణాలతో హాజరు కాలేదు. కేంద్ర మంత్రులు అర్జున్‌రామ్ మేఘ్‌వాల్, రాందాస్ ఆఠవలే, కాంగ్రెస్ నేతలు జైరాం రమేశ్, గౌరవ్ గొగొయ్, ఎన్సీపీ-ఎస్పీ నాయకురాలు సుప్రియా సులె, డీఎంకే నేత టీఆర్ బాలుతో పాటు మరికొందరు హాజరయ్యారు. పార్లమెంటు ఉభయసభలు సజావుగా కొనసాగేదెలా, చర్చించాల్సిన అంశాలేంటి… ఇదే ఎజెండా. పహల్గామ్ దాడికి దారితీసిన పరిస్థితులపై ప్రధాని మోదీ వివరణ ఇచ్చి నిబద్ధత చాటుకోవాలని విపక్షాలు డిమాండ్ చేశాయి.
జూలై 21 నుంచి ఆగస్టు 21 వరకు 21 పనిదినాలు జరిగే ఈ సమావేశాల్లో 7 పెండింగ్ బిల్లులతోపాటు 8 కొత్త బిల్లులను ప్రవేశపెడతారు. నేషనల్ స్పోర్ట్స్ గవర్నెన్స్ బిల్లు, జియో హెరిటేజ్ సైట్స్, జియో రెలిక్స్ బిల్లు, మైన్స్ అండ్ మినరల్స్ సవరణ బిల్లు, నేషనల్ యాంటీ డోపింగ్ బిల్లు, మణిపూర్ జీఎస్‌టీ బిల్లు ఇవన్నీ ఆమోదం పొందే ఛాన్సుంది. ఇన్‌కమ్ ట్యాక్స్-2025 బిల్లును కూడా కేంద్రం ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. ఏపీకి సంబంధించి ముఖ్యంగా నదుల అనుసంధానం చర్చకు రాబోతోంది.
కాలిపోయిన కరెన్సీ కట్టలు బయటపడిన వ్యవహారంలో జస్టిస్ యశ్వంత్ వర్మ అభిశంసన కోసం పార్లమెంటు సమావేశాల్లో తీర్మానం ప్రవేశపెడతారు. మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన పొడిగింపు కూడా చర్చకొస్తుంది. ఇలా… ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ అంశాలతో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు చర్చలతో వేడి పుట్టించబోతున్నాయి.