
ఇప్పుడు చైనావాడు మనకు బద్ధ శత్రువయ్యాడు.. చైనావాళ్లంటే మనకు రెండు రకాలుగా కోపం కలుగుతోంది.. మొదటిదేమో కరోనా వైరస్‌ను మన మీదకు వదిలాడన్న కసి.. రెండోదేమో అకారణంగా సరిహద్దులో గొడవ పెట్టుకుంటున్నాడన్న ఆగ్రహం. కరోనా వైరస్‌ను కావాలని పుట్టించాడో లేదో తెలియదు కానీ… సరిహద్దులో మాత్రం కావాలనే కయ్యానికి కాలు దువ్వుతున్నాడు. అలాంటివాడి మీద కోపం కలగడం సహజమే! ఇక కోల్‌కతాలోని చైనాటౌన్‌లో ఉంటున్న వారిని దూరం పెట్టేస్తున్నారు.. వారికైతే ఎకంగా కరోనా అన్న పేరు కూడా పెట్టేశారు.. వారి రెస్టారెంట్లకు ఎవరూ వెళ్లడం లేదు.. అంతెందుకు .. వారితో కనీసం మాట్లాడేందుకు కూడా ఇష్టపడటం లేదు. ప్రస్తుతం చైనాటౌన్‌లో అయిదువేల మంది నివసిస్తున్నారు.. ఒకప్పుడు 20 వేలకు పైనే ఉండేవారు కానీ క్రమంగా ఆ సంఖ్య తగ్గుతూ వస్తోంది.. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో చైనా నుంచి కొందరు ఇక్కడికి వచ్చి స్థిరపడిపోయారు.. మూడు తరాలు గడిచాయి.. ఇప్పటి వరకు వారి పట్ల ఎలాంటి భేదభావం చూపించలేదు కోలకతా వాసులు.. వారిని అచ్చమైన భారతీయుల్లాగే పరిగణించారు.. దోస్తానా కూడా గట్టిగానే ఉండింది.. ఎప్పుడైతే గల్వాన్ లోయలో చైనా ఆర్మీ మన సైనికులను పొట్టన పెట్టుకుందో అప్పటి నుంచి పరిస్థితి మారింది.. చైనాటౌన్‌లో ఉంటున్నవారిలో చాలామంది ఇళ్లల్లోంచి బయటకు రావడం లేదు. జనాగ్రహాన్ని పసిగట్టి తలుపులేసుకుని బిక్కుబిక్కుమని గడుపుతున్నారు. అక్కడున్న అందరికీ భారత పౌరసత్వం ఉంది.. ఓటరు కార్డులున్నాయి.. చాలా మంది ఇక్కడ పుట్టి పెరిగినవారే! ఇక్కడకు వచ్చిన మొదటితరం ఎప్పుడో అంతరించింది.. అదే విషయాన్ని చెప్పుకుంటూ బాధపడుతున్నారు ఇక్కడ స్థిరపడిన ఒకప్పటి చైనావాళ్లు.. చరిత్ర సంస్కృతి పట్ల అవగాహనలేని వారంతా తమను ఓ రకంగా చూస్తున్నారని.. తమను కరోనా అంటూ పిలుస్తూ ఎగతాళి చేస్తున్నారని ఆవేదన చెందుతున్నారు. కొన్ని తరాలుగా ఇక్కడ తాము నివసిస్తూ వస్తున్నామని.. భారత ప్రజలతో మమేకమయ్యామని.. ఇక్కడి సంస్కృతి సంప్రదాయాలతో కలిసిపోయామని చెబుతున్నారు. అయినా తమను దోషులుగా చూస్తున్నారని బాధపడుతున్నారు. చైనాటౌన్‌లో ఉంటున్న చాలా మంది వివిధ వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఎక్కువగా రెస్టారెంట్ల వ్యాపారంలో ఉన్నారు.. ఇక లెదర్ ప్రొడక్టులకు ఇదో హబ్ అని చెప్పుకోవచ్చు. కరోనా వైరస్ కారణంగా వ్యాపారాలు పూర్తిగా దెబ్బతిన్నాయని.. ఇప్పుడు సరిహద్దు ఉద్రిక్తలతో తాము మరింత నష్టపోతున్నామని చెప్పుకొస్తున్నారు. తమను అభద్రతాభావం వెంటాడుతోందని ఆందోళన చెందుతున్నారు. బయటకు తిరగాలంటేనే భయమేస్తోందని.. తాము కూడా భారతీయులేమనని ..భారతదేశాన్ని మాతృభూమిగానే భావిస్తున్నామని అంటున్నారు. ఇప్పుడు తమను చైనాకు వెళ్లిపోమనడం భావ్యం కాదంటున్నారు.