ఎర్రకోట వద్ద ఓ ఫ్లాగ్ పోల్ పై పతాకాన్ని తానే ఎగురవేశానని పంజాబీ నటుడు దీప్ సిద్దు అంగీకరించాడు. ఈ స్తంభంపై ‘నిషాన్ సాహిబ్’ పతాకాన్ని తను ఎగురవేశానని, కానీ జాతీయ పతాకాన్ని మాత్రం తొలగించలేదని, అది దేశ సమైక్యత, సమగ్రతలకు చిహ్నమని ఆయన అన్నాడు. ఈ మేరకు తన ఫేస్ బుక్ లో ఈ విషయాలు తెలియజేస్తూ.. మన దేశ సమగ్రత, సమైక్యతలను ఎవరూ ప్రశ్నించజాలరన్నాడు. రెడ్ ఫోర్ట్ వద్ద రైతులను తానే రెచ్ఛగొట్టినట్టు వఛ్చిన ఆరోపణలను ప్రస్తావిస్తూ.. నేను గానీ, నా సహచరులు గానీ నేషనల్ ఫ్లాగ్ ని ముట్టుకోలేదని, కానీ ఆ ఘటన జరిగిన సమయంలో నేను అక్కడ ఉన్నది వాస్తవమేనని పేర్కొన్నాడు. ఇది ముందుగా వేసుకున్న పథకం కాదన్నాడు. దీనికి ఎలాంటి మతపరమైన రంగు పులమరాదని దీప్ సిద్దు కోరాడు.
నిషాన్ సాహిబ్ అంటే అది సిక్కుల మతపరమైన చిహ్నమని, అన్ని గురుద్వారాలపైనా ఈ పతాకం కనిపిస్తుందని ఆయన వెల్లడించాడు.