
కోపంలోనో, గొడవల్లోనో వాడే తిట్లు, అసభ్య పదజాలం లేదా బూతులు ఎంత అసహ్యకరంగా ఉన్నప్పటికీ, వాటిని క్రిమినల్ చట్టం ప్రకారం నేరుగా అశ్లీలత కింద పరిగణించలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఒక మాటను అశ్లీలంగా భావించాలంటే దానికి చట్టపరమైన నిర్దిష్ట ప్రమాణాలు ఉండాలని, అది వినేవారిని లైంగికంగా ప్రేరేపించేలా లేదా దిగజార్చేలా ఉంటేనే ఆ సెక్షన్ వర్తిస్తుందని కోర్టు తెలిపింది. తమిళనాడుకు చెందిన మణి అనే వ్యక్తి దాఖలు చేసిన అప్పీల్‌ను పాక్షికంగా అనుమతిస్తూ జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ విపుల్ ఎమ్. పాంచోలిలతో కూడిన ధర్మాసనం ఈ కీలక తీర్పును వెలువరించింది.
2017 ఆగస్టులో తమిళనాడులో జరిగిన ఒక వ్యవసాయ భూమి వివాదంలో మణి అనే వ్యక్తి తన ప్రత్యర్థులను అత్యంత అసభ్య పదజాలంతో దూషించడమే కాకుండా కొడవలితో దాడి చేసి ఒకరి ముక్కు ఎముక విరిగేలా చేశాడు. ఈ కేసులో ట్రయల్ కోర్టు అతనికి ఐపీసీ సెక్షన్ 294(బి) (అశ్లీలత), 326 (తీవ్రమైన గాయం చేయడం), 506(ii) (క్రిమినల్ బెదిరింపు), ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద శిక్ష విధించింది. మద్రాస్ హైకోర్టు ఎస్సీ, ఎస్టీ చట్టం కేసును కొట్టివేసినప్పటికీ.. ఐపీసీ శిక్షలను అలాగే ఉంచడంతో నిందితుడు సుప్రీంకోర్టును ఆశ్రయించాడు.
ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం, ఐపీసీ సెక్షన్ 294(బి) కింద అశ్లీలత అనే నేరాన్ని మోపాలంటే కేవలం చెడు మాటలు మాట్లాడితే సరిపోదని స్పష్టం చేసింది. ‘‘చట్టప్రకారం అశ్లీలత అనేది కేవలం అసభ్యత లేదా తిట్లకు సమాన అర్థం కాదు. గొడవల సమయంలో వాడే బూతు పదాలు వినడానికి అసహ్యంగా, దిగ్భ్రాంతికరంగా అనిపించవచ్చు. కానీ అవి ఎదుటివారిని మానసికంగా లేదా నైతికంగా దిగజార్చేలా ఉంటేనే అశ్లీలత అవుతుంది. అంతేకాకుండా ఆ మాటల వల్ల పబ్లిక్ స్థలంలో ఇతరులకు ఇబ్బంది కలిగిందనే రుజువు కూడా ఉండాలి. ప్రస్తుత కేసులో నిందితుడు తిట్టిన తిట్లు కేవలం కోపంలో అన్నవే కానీ అవి చట్ట పరిధిలోని అశ్లీలత కిందికి రావు’’ అని అభిప్రాయపడింది. ఇదే ప్రాతిపదికన గొడవ పడేటప్పుడు వాడే హెచ్చరికలన్నీ క్రిమినల్ బెదిరింపుల కిందకు రావంటూ సెక్షన్ 506(ii) శిక్షను కూడా కోర్టు రద్దు చేసింది.
బూతులు, బెదిరింపుల సెక్షన్లను కొట్టేసినప్పటికీ.. నిందితుడు కొడవలితో దాడి చేసి బాధితుడి ముక్కు ఎముకను విరగ్గొట్టినట్లు మెడికల్ రిపోర్టులలో స్పష్టంగా రుజువైంది. అందువల్ల సెక్షన్ 326
కింద నిందితుడి నేరాన్ని కోర్టు సమర్థించింది. అయితే ఈ వివాదం భూమి గొడవల వల్ల జరిగిందని, ప్రస్తుతం నిందితుడి వయస్సు దాదాపు 70 ఏళ్లు దాటడం, అతని ఆరోగ్య పరిస్థితిని పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు శిక్షను తగ్గించింది. కోర్టు సమయం ముగిసేవరకు జైలు శిక్ష విధిస్తూ, రూ. 50,000 జరిమానా చెల్లించాలని ఆదేశించింది. ఈ మొత్తాన్ని రెండు నెలల్లోగా చెల్లించాల్సి ఉంటుంది.