ఢిల్లీలో ఆమ్‌ఆద్మీ పార్టీ , బీజేపీ శ్రేణులు పోటాపోటీగా ధర్నాలు నిర్వహించాయి. లిక్కర్ స్కాంపై రెండు పార్టీల మధ్య మాటలయుద్దం మరింత ముదిరింది. ఢిల్లీ జంతర్‌మంతర్ దగ్గర భారీ దర్నా చేపట్టారు ఆప్ ఎంపీలు , ఎమ్మెల్యేలు. కుట్రపూరితంగా కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేశారని ఆరోపించారు. లిక్కర్ స్కాంలో బీజేపీ నేతల ప్రమేయంపై ఈడీ,సీబీఐ,ఐటీ శాఖ దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. లిక్కర్ స్కాంలో బీజేపీ నేతలకు రూ.56 కోట్ల ముడుపులు ముట్టినట్టు కచ్చితమైన ఆధారాలు లభించాయన్నారు ఆప్ నేత సంజయ్‌సింగ్. లిక్కర్ స్కాంతో సంబంధం ఉన్న బీజేపీ నేతలను అరెస్ట్ చేయిస్తారా ? అని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌ను ప్రశ్నించారు సంజయ్‌సింగ్. కేజ్రీవాల్‌కు మద్దతుగా ఢిల్లీతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు జరగడం తమ పార్టీకి చాలా ఉత్తేజాన్ని ఇచ్చిందన్నారు. దేశంలో బీజేపీ అతిపెద్ద అవినీతి పార్టీ అని విమర్శించారు.
ఆప్‌కు పోటీగా బీజేపీ శ్రేణులు కూడా ధర్నా చేపట్టాయి. షరాబ్ సే శీష్‌మహల్ పేరుతో ఢిల్లీలో బీజేపీ నేతలు ఆందోళన చేశారు. లిక్కర్ స్కాంతో సంపాదించిన సొమ్ముతో కేజ్రీవాల్ రాజభవనం నిర్మించారని ఆరోపించారు. లిక్కర్ స్కాంలో కేజ్రీవాల్‌తో పాటు మనీష్ సిసోడియా కూడా జైలుకు వెళ్లారని అన్నారు బీజేపీ నేతలు. మొహల్లా క్లినిక్‌ల పేరుతో ఆప్ నేతలు రోగులకు నకిలీ మందులను కట్టబెట్టారని ఆరోపించారు. శీష్‌మహల్‌తో పాటు కేజ్రీవాల్ , సిసోడియా , సంజయ్‌సింగ్‌లు అవినీతికి పాల్పడ్డారని బ్యానర్లు ప్రదర్శించారు బీజేపీ కార్యకర్తలు. ఆప్ అవినీతిపై పోరాటం కొనసాగుతుందని ప్రకటించారు. ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్రసచ్‌దేవాతో పాటు పలువురు పార్టీ అగ్రనేతలు ఈ ధర్నాలో పాల్గొన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..