NEET Topper 2025: నీట్‌లో 99.99% మార్కులతో టాప్ స్కోర్‌.. అడ్మిషన్‌ రోజే విద్యార్థి సూసైడ్!

నీట్‌ యూజీలో ర్యాంకు కొట్టడం ఎందరికో కల. అయితే ఈ అబ్బాయి మాత్రం ఎంతో అలవోకగా ఏకంగా టాప్ ర్యాంకు సాధించాడు. కానీ ఎంబీబీఎస్‌ చదవడం ఇష్టం లేదని తల్లిదండ్రులకు చెప్పలేకపోయాడు. అంతే నీట్‌ యూపీ అడ్మిషన్‌ రోజే నిందు ప్రాణాలు తీసుకున్నాడు. ఈ షాకింగ్‌ ఘటన..

NEET Topper 2025: నీట్‌లో 99.99% మార్కులతో టాప్ స్కోర్‌.. అడ్మిషన్‌ రోజే విద్యార్థి సూసైడ్!
NEET UG 2025 topper suicide

Edited By: Shaik Madar Saheb

Updated on: Sep 25, 2025 | 3:15 PM

పూణె, సెప్టెంబర్‌ 25: తల్లిదండ్రుల గొంతెమ్మ కోరికలకు వారి పిల్లలు బలి అవ్వడం ఇప్పటికే పలు సంఘటనల్లో రుజువైంది. తాజాగా అటువంటి ఘటన మరొకటి చోటు చేసుకుంది. నీట్‌ యూజీలో ర్యాంకు కొట్టడం ఎందరికో కల. అయితే ఈ అబ్బాయి మాత్రం ఎంతో అలవోకగా ఏకంగా టాప్ ర్యాంకు సాధించాడు. కానీ ఎంబీబీఎస్‌ చదవడం ఇష్టం లేదని తల్లిదండ్రులకు చెప్పలేకపోయాడు. అంతే నీట్‌ యూపీ అడ్మిషన్‌ రోజే నిందు ప్రాణాలు తీసుకున్నాడు. ఈ షాకింగ్‌ ఘటన మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..

సిందేవాహి తాలూకాలోని నవర్‌గావ్ ప్రాంతానికి చెందిన 19 ఏళ్ల విద్యార్థి అనురాగ్‌ ఈ ఏడాది నిర్వహించిన నీట్‌ యూజీ-2025లో ఏకంగా 99.99 శాతం మార్కులు సాధించాడు. జాతీయ స్థాయిలో OBC కేటగిరీలో 1475 ర్యాంకును దక్కించుకున్నాడు. కౌన్సెలింగ్‌ ఉత్తర్‌ప్రదేశ్‌లోని గోరఖ్‌పుర్‌లోని కాలేజీలో ఎంబీబీఎస్‌ కోర్సులో సీటు కూడా పొందాడు. అడ్మిషన్‌ తీసుకోవడానికి బయల్దేరేందుకు అంతా సిద్ధం అవుతుండగా మంగళవారం (సెప్టెంబర్ 23) తెల్లవారుజామున ఇంట్లోని తన గదిలో అనురాగ్‌ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు అనురాగ్‌ గదిలో సూసైడ్‌ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆ నోట్‌లోని విషయాలను అధికారులు మీడియాకు విడుదల చేయనప్పటికీ, తాను డాక్టర్ కావాలని కోరుకోవడం లేదని అనురాగ్ రాసినట్లు పోలీసు వర్గాలు ఆఫ్‌ ది రికార్డ్‌గా పేర్కొన్నాయి. ఈ కేసు ప్రస్తుతం నవర్గావ్ పోలీసుల దర్యాప్తులో ఉంది. కొడుకు ఎంబీబీఎస్‌లో చేరి, తమ కలలు నెరవేరుస్తాడని ఆశపడిన కన్నోళ్లు కొడుకు మృతికి షాక్‌కు గురయ్యారు. అనురాగ్ మాత్రమే కాదు నేటి కాలంలో చాలా మంది చదువుల ఒత్తిడిని అనుభవిస్తున్నారు. వీరిని తల్లిదండ్రులే ఓ కంట కనిపెట్టి వారి మనసుని అర్ధం చేసుకోవాలి. కనిపెంచిన తల్లిదండ్రులే వారిని అర్ధం చేసుకోలేకపోతే, వారిక ఎవరితో పంచుకుంటారు? యువత కూడా మనసు విప్పి తమ భావాలను కుటుంబ సభ్యులు, స్నేహితులతో బహిరంగంగా మాట్లాడటానికి ప్రయత్నించాలి. అప్పుడే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.