భారత మట్టిలో కలిపేయండి.. ఓ ఆస్ట్రేలియన్‌ పౌరుడి చివరి కోరిక! ఇండియా అంటే ఎందుకంత ఇష్టమంటే..?

91 ఏళ్ల ఆస్ట్రేలియా పౌరుడు డొనాల్డ్ సామ్, భారత పర్యటనకు వచ్చి అనారోగ్యంతో మరణించారు. తన చివరి కోరికగా భారతదేశంలోనే ఖననం చేయాలని కోరుకున్నారు. అతని భార్య అలెస్ తెలిపిన విషయం ప్రకారం, అతనికి భారతదేశంపై, ముఖ్యంగా అస్సాంపై ఎంతో అభిమానం ఉంది. అతని తండ్రి బ్రిటీష్ ఆర్మీలో పనిచేసిన కారణంగా ఈ అనుబంధం ఏర్పడింది. చివరి కోరిక మేరకు ముంగేర్‌లో ఖననం చేశారు.

భారత మట్టిలో కలిపేయండి.. ఓ ఆస్ట్రేలియన్‌ పౌరుడి చివరి కోరిక! ఇండియా అంటే ఎందుకంత ఇష్టమంటే..?
Australia Man Last Wish

Updated on: Feb 24, 2025 | 8:03 AM

ఆస్ట్రేలియాకు చెందిన ఓ 91 ఏళ్ల వ్యక్తి ఇండియాలో పర్యటించేందుకు కొంతమంది స్నేహితులతో కలిసి వచ్చాడు. గతంలో కూడా చాలా సార్లు వచ్చారు. తాజాగా పాట్నా నుంచి కోల్‌కత్తాకు గంగా నది గుండా ఓ క్రూజ్‌ షిప్‌లో ప్రయాణిస్తూ.. తన విహారయాత్రను ఎంతో ఉత్సాహంగా కొనసాగిస్తున్నాడు. కానీ, ప్రయాణం మధ్యలోనే బిహార్‌ రాష్ట్రం ముంగేర్‌కు చేరుకున్న తర్వాత ఉన్నట్టుండి అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో తనతో వచ్చిన వారు ఆ వ్యక్తిని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు.. ఆ సమయంలో తన చివరి కోరిక అతను ఏం కోరాడో తెలుసా? ఒక వేళ నేను చనిపోతే నన్ను ఈ భరత భూమిలోనే ఖననం చేయండి అంటూ తన స్నేహితుల వద్ద మాట తీసుకున్నాడు. అంతకంటే ముందు ఇదే విషయాన్ని తన కుంటుంబ సభ్యులు, భార్యకు కూడా చెప్పేవాడంటా.. అయితే ముంగేర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆ వ్యక్తి శనివారం చనిపోతే, మృతదేహాన్ని ఆస్ట్రేలియా తీసుకెళ్లకుండా అతని చివరి కోరక మేరకు అతన్ని ముంగేర్‌లోనే ఖననం చేశారు. అయితే ఆ వ్యక్తి ఎవరు? ఎందుకు ఇండియాలోనే తనను ఖననం చేయాలని చివరి కోరకగా కోరుకున్నాడు? మనదేశంతో అతనికి ఉన్న అనుబంధం ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

ఇండియాలోనే తనను ఖననం చేయాలని కోరిన వ్యక్తి డొనాల్డ్‌ సామ్‌. ఈయన గతంలో అనేక సార్లు ఇండియాలో పర్యటించారు. ఆయనకు ఇండియా అన్నా, అస్సాం అన్నా ఎంతో ఇష్టం. తాను చనిపోతే తనను ఎలాగైనా ఇండియాలోనే క్రైస్తవ మత సాంప్రదాయ పద్దతిలో ఖననం చేయాలని తన భార్యకు చెబుతుండేవారు. ఈ విషయాన్ని ఆయన భార్య అలెస్ తెలిపారు. అలెస్‌ తండ్రి బ్రిటీష్‌ ఆర్మీలో ఆఫీసర్‌గా పనిచేసేవారు. ఆయన బ్రిటీస్‌ ఆర్మీ తరఫున అస్సాం రాష్ట్రంలో పనిచేశారు. అలా తన భర్తకు అస్సాం, ఇండియా గురించి తెలిసి, ఇక్కడ పర్యటించిన తర్వాత ఇండియాపై మరింత ప్రేమను ఆయన పెంచుకున్నారు అని అలెస్‌ వెల్లడించారు. కాగా, శనివారం సామ్‌ మృతి చెందిన తర్వాత స్థానిక అధికారులు జిల్లా మేజిస్టేట్‌కి సమాచారం అందించారు.

ఆయన ఇండియాలోని ఆస్ట్రేలియా ఎంబసీకి సమాచారం ఇచ్చి, సామ్‌ కుటుంబ సభ్యులకు ఆయన మరణ వార్తను చేరవేశారు. ఆయన చివరి కోరిక ప్రకారం ఇండియాలోనే ఖననం చేయాలని భార్య అలెస్‌ చెప్పారు. దీంతో ముంగేర్‌లో సామ్‌ను ఖననం చేశారు. ఈ సందర్భంగా సామ్‌ భార్య అలెస్‌ తన భర్తకు చివరిసారిగా వీడ్కోలు పలికారు. ఆస్ట్రేలియా పౌరుడై ఉండి కూడా ఇండియా మట్టిలోనే కలిసిపోవాలని సామ్‌ అనుకున్నాడంటే.. ఇండియా అంటే ఆయనకు ఎంత ప్రేమ ఉండాలి, కచ్చితంగా ఈ కర్మ భూమిలో ఖననం అయితే తనకు మోక్షం లభిస్తుందని ఆయన అనుకొని ఉంటారని స్థానికులు అనుకుంటున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.