Mini bus Falls Into River: జమ్మూకాశ్మీర్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మినీ బస్సు నదిలో పడిన సంఘటనలో ఏడుగురు ప్రయాణికులు మరణించారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘోర ప్రమాదం దోడా పట్టణానికి 42 కిలోమీటర్ల దూరంలోని పియాకుల్ గ్రామ సమీపంలో థాత్రి-గండో రోడ్‌లో సోమవారం జరిగింది. బస్సు ప్రయాణికులతో దోడా వెళుతున్న క్రమంలో పియాకుల్ గ్రామం సమీపంలో కొండ మార్గం నుంచి నదిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో మొత్తం ఏడుగురు చనిపోయారు. వారిలో నలుగురు మహిళలు ఉన్నారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. కొండ ప్రాంతం కావడంతో.. ఓ మలుపు వద్ద డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోయాడని పోలీసులు వెల్లడించారు. ప్రమాద తీవ్రతకు బస్సు నుజ్జునుజ్జయింది. సమాచారం అందుకున్న వెంటనే రక్షణ, సిబ్బంది పోలీసులు స్పందించారు.
సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. తీవ్రంగా గాయపడిన వారిని రక్షించేందుకు వాయుసేనకు కూడా సమాచారం అందించారు. హుటాహుటిన ఐఏఎఫ్ సిబ్బంది హెలికాప్టర్ ద్వారా సంఘటనా స్థలానికి చేరుకొని.. అక్కడి నుంచి ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారంతా దోడా జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని పోలీసు సూపరింటెండెంట్ భదర్వా రాజ్ సింగ్ గౌరియా వెల్లడించారు. భారీ లోయలో పడిపోవడంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉందని ఆయన వెల్లడించారు. సైన్యం, స్థానికుల సహాయంతో వెంటనే వేగంగా సహాయక చర్యలు చేపట్టినట్లు ఎస్పీ తెలిపారు. ప్రత్యేక హెలికాప్టర్‌లో ఆసుపత్రికి సకాలంలో తరలించామని తెలిపారు.
విచారం వ్యక్తంచేసిన ప్రధాని మోదీ
ఇదిలాఉంటే.. ఈ ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విచారం వ్యక్తంచేశారు. దోడాలో బస్సు ప్రమాదం కారణంగా పలువురు ప్రాణాలు కోల్పోయారన్న వార్త విని చాలా బాధపడ్డానంటూ ట్విట్ చేశారు. గాయపడినవారందరికీ అన్నిరకాల సహాయం అందిస్తాం. వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానంటూ పీఎంఓ హ్యాండిల్ నుంచి ట్విట్ చేశారు.
Also Read: