మష్రుమ్స్‌ పెంచండి.. కోవిడ్‌కు మందు కనిపెడతామంటూ భారీ స్కామ్‌! రైతుల నుంచి రూ.కోటి కాజేసిన కేటుగాళ్లు!

కరోనా సమయంలో చాలా మంది ఉద్యోగాలు కోల్పోతే.. ఈ కేటుగాళ్లు కరోనాను కూడా తమ స్వార్థానికి వాడుకొని నలుగురికి అన్నం పెట్టే రైతులకే సున్నం పెట్టారు. కరోనాకు మందు కనిపెడుతున్నాం అని చెప్పి రైతులను నిండముంచారు. ఆ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి..

మష్రుమ్స్‌ పెంచండి.. కోవిడ్‌కు మందు కనిపెడతామంటూ భారీ స్కామ్‌! రైతుల నుంచి రూ.కోటి కాజేసిన కేటుగాళ్లు!
Covid Vaccine Mushroom

Updated on: Feb 16, 2025 | 2:14 PM

కరోనాకు మందు కనిపెడుతున్నాం, అందుకోసం మష్రుమ్స్‌ అవసరం అవుతాయి, వాటిని మీరు పెంచితే భారీ ఆదాయం పొందవచ్చని కొందరు కేటుగాళ్లు రైతులను నిండా ముంచారు. 2021-2023 మధ్య జరిగిన ఈ భారీ స్కామ్‌ తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ స్కామ్‌కు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. అంబ్రోసియా ఫుడ్‌ ఫామ్‌, అంబ్రోసియా న్యూ మెడిసిన్‌ అనే రెండు కంపెనీలకు చెందిన కొంతమంది ఉత్తరాఖండ్‌లోని కాశీపూర్‌కు వచ్చారు. అక్కడి స్థానిక రైతులతో సమావేశం అయి.. తమ అంబ్రోసియా న్యూ మెడిసిన్‌ కంపెనీ భోపాల్‌లోని AIIMS(All India Institute of Medical Sciences), నాగ్‌పూర్‌లోని AIIMSతో కలిసి కోవిడ్‌కు వ్యాన్సిన్‌ కనిపెడుతున్నాం అని చెప్పారు. అందుకు భారీ ఎత్తున ప్రత్యేకమైన మష్రుమ్స్‌ అవసరం అవుతాయని పేర్కొన్నారు.

ఆ మష్రుమ్స్‌ను కోవిడ్‌ మందు తయారీకి ఉపయోగిస్తామని నమ్మబలికారు. అయితే.. తమ అంబ్రోసియా ఫుడ్‌ ఫామ్‌ కంపెనీ ఆ ప్రత్యేకమైన మష్రుమ్స్ విత్తనాలు అందిస్తుందని చెప్పారు. అవి కొని మీరు మష్రుమ్స్‌ పెంచితే.. వాటిని తమ కంపెనీనే తిరిగి భారీ ధరకు కొనుగోలు చేస్తుందని కూడా తెలిపారు. అలా రైతులకు మాయమాటలు చెప్పి కేజీ మష్రుమ్స్‌ విత్తనాలకు గాను రూ.30 వేలు వసూలు చేశారు. అలా చాలా మంది రైతుల నుంచి దాదాపు ఒక కోటి రుపాయల వరకు వసూళ్లకు పాల్పడ్డారు. కానీ, ఆ తర్వాత విత్తనాలు ఇవ్వలేదు ఏం ఇవ్వలేదు. ఏంటా అని రైతులు ఆరా తీస్తే అసలు కంపెనీలే లేవు. అదంతా పెద్ద స్కామ్‌ అని తేలింది. దీంతో వారి చేతుల్లో మోసపోయిన రైతు సందీప్‌ సింగ్‌ రావత్‌ పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్తే పోలీసులు కేసును రిజిస్టర్‌ చేయలేదు.

అతను కోర్టుకు వెళ్లి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో భోవాలి పోలిస్‌ స్టేషన్‌లో సందీప్‌ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ రెండు ఫేక్‌ కంపెనీలకు చెందిన ఆరుగురు వ్యక్తులను ఇప్పటికే అరెస్ట్‌ చేశారు. ఆ ఆరుగురిలో మన హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి కూడా ఉండటం గమనార్హం. కరోనా కారణంగా ఎంతో మంది జీవనోపాధిని కోల్పోతే.. ఈ కేటుగాళ్లు కరోనాను పేరు చెప్పి ఇంత పెద్ద స్కామ్‌ చేశారు. పోలీసులు అరెస్ట్‌ చేసిన వ్యక్తుల్లో పిలిభిత్‌కు చెందిన గౌరవేంద్ర గంగ్వార్, పిలిభిత్ రోడ్ కు చెందిన దేవేష్ సింగ్ గంగ్వార్, పవన్ కుమారి, బుదౌన్ కు చెందిన శైలేంద్ర సింగ్, హైదరాబాద్‌కు చెందిన నూరుద్దీన్ షాబుద్దీన్ పటేల్‌లు ఉన్నారు. వీరి నుంచి ఇప్పటికే పోలీసులు స్టేట్‌మెంట్లు తీసుకున్నారు.