Fake Pilot Arrest: అడ్డదారిలో ఈజీగా డబ్బులు సంపాదించాలనే దురాశ..జీవితాలను నాశనం చేస్తుంది. చేస్తున్న ఉద్యోగాన్ని వదిలేసి అధిక సంపాదన కోసం మోసాలకు పాల్పడుతూ చివరికి కటకటాలపాలయ్యాడు సిక్కింకు చెందిన 25 ఏళ్ల హేమంత్ శర్మ. ఒకటికాదు రెండుకాదు.. మోసాలు చేయడంలో అతగాడు త్రిబుల్ సెంచరీ దాటేశాడు. నాలుగో శతకానికి ప్రయత్నిస్తుండగా అతని మోసాలు వెలుగులోకి రావడంతో గురుగ్రామ్ పోలీసులకు చిక్కాడు. ఇన్ని మోసాలు ఎలా చేశాడో తెలిస్తే ప్రతి ఒక్కరూ షాకవ్వాల్సిందే.సిక్కింలోని గ్యాంగ్ టక్ కు చెందిన హేమంత్ శర్మ గతంలో బెంగుళూరు విమానశ్రయంలో గ్రౌండ్ స్టాఫ్ గా, ఫైవ్ స్టార్ హోటల్ లో ఫ్రంట్ ఆఫీస్ ఎగ్జిక్యూటివ్ గా రెండేళ్లపాటు పనిచేశాడు. చేస్తున్న ఉద్యోగం, వస్తున్న సంపాదనతో సంతృప్తి చెందకపోవడంతో ఈజీగా ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో రెండేళ్ల క్రితం హర్యానాలోని గురుగ్రామ్ కు మకాం మార్చాడు. అక్కడ ఓ అపార్ట్ మెంట్ లో అద్దెకు దిగి.. మోసాలు చేయడం ప్రారంభించాడు. దాదాపు సోషల్ మీడియాలో 150కి పైగా ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేసి తనను తాను ఫైలట్ గా చెప్పుకుంటూ.. ప్రయివేట్ ఎయిర్ లైన్స్ లో క్యాబిన్ సిబ్బందిగా పనిచేసే అమ్మాయిలకు ఫ్రెండ్స్ రిక్వెస్ట్స్ పంపించి..వారితో స్నేహం చేసేవాడు.
సోషల్ మీడియా ద్వారా స్నేహం ఏర్పడిన అమ్మాయిలకు చిన్న చిన్న బహుమతులు, ఫ్లవర్స్ పంపిస్తూ ఉండేవాడు. నేరుగా ఎవర్ని కలిసేవాడు కాదు హేమంత్ శర్మ. తనకు పరచయమైన వారితో రెండు నెలల పాటు స్నేహం చేస్తున్నట్లు నటించి వారి నుంచి అందినంత దోచుకుని మోసం చేసేవాడు. తాను హోటల్ లో ఉన్నానని క్రెడిట్ కార్డు పోయిందని కొన్ని సార్లు, జేబు దొంగలు తన పర్సు కొట్టేశారని మరికొన్ని సార్లు, తన బ్యాంకు అకౌంట్ బ్లాక్ అయ్యిందంటూ సోషల్ మీడియా ద్వారా పరిచయమైన వారిని డబ్బులు అడిగేవాడు. ఇది నిజమేనని నమ్మిన చాలా మంది ఈ కేటుగాడికి డబ్బులు పంపించేవారు. ఇలా మోసాలకు పాల్పడిన ప్రతిసారి శర్మ తన మెబైల్ నెంబర్ మార్చేసేవాడు. ఇప్పటివరకు సుమారు వంద మొబైల్ నెంబర్లను శర్మ ఉపయోగించగా.. తాను బెంగుళూరు నుంచి గురుగ్రామ్ కు వచ్చేటప్పుడే 60కి పైగా సిమ్ కార్డులు కొనుగోలు చేసినట్లు పోలీసులు విచారణలో ఒప్పుకున్నాడు.
మరింత పకడ్భందీగా మోసం చేస్తూ పోలీసులకు ఎలా దొరికాడనుకుంటున్నారా? గోల్ప్ కోర్సు రోడ్ లో నివాసం ఉండే ఒకమ్మాయి తాను సోషల్ మీడియాలో పరిచయమైన వ్యక్తి ద్వారా రూ.1.20 లక్షలు మోసపోయినట్లు సైబర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో..దీనిపై విచారణ జరిపిన పోలీసులు మోసాల్లో త్రిబుల్ సెంచరీ చేసిన శర్మను పట్టుకున్నారు. కేవలం ఈ ఏడాదే 25 లక్షల రూపాయలకు పైగా మోసాల ద్వారా కూడబెట్టగా..ఇప్పటిర వరకు ఎంత దోచుకున్నాడో బ్యాంకు ఖాతాలు పరిశీలించి లెక్కలు తేల్చే పనిలో పడ్డారు పోలీసులు. దాదాపు 300కు పైగా మోసాల్లో శర్మ ఇన్వాల్వ్ అయినట్లు పోలీసులు ప్రాథమిక నిర్థారణకు వచ్చారు. శర్మ ఉదంతంతో సోషల్ మీడియాలో వచ్చే ఫ్రెండ్స్ రిక్వెస్ట్స్ పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు పోలీసులు.బి అలర్ట్..
మరిన్ని క్రైమ్ న్యూస్ చదవండి