Viral Video: లోతు అంచనా వేయకుండా పైనుంచి పూల్‌లోకి డైవ్ కొట్టాడు.. అంతే

మహారాష్ట్రలోని మాల్వన్ తాలూకా వైరీ గ్రామంలోని ఓ రిసార్ట్‌లో విషాదం చోటుచేసుకుంది. స్విమ్మింగ్ పూల్‌లో నీటి లోతు అంచనా వేయకుండా ఎత్తు నుంచి దూకిన 25 ఏళ్ల యువకుడు తల బలంగా పూల్ అడుగు భాగాన్ని ఢీకొనడంతో తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. ఈ ఘటన నేపథ్యంలో స్విమ్మింగ్ పూల్‌లలో భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.

Viral Video: లోతు అంచనా వేయకుండా పైనుంచి పూల్‌లోకి డైవ్ కొట్టాడు.. అంతే
Leisure Trip Turned Fata

Updated on: Jun 28, 2026 | 11:50 AM

 

స్నేహితులతో కలిసి సరదాగా వెళ్లిన విహారయాత్ర ఓ యువకుడి ప్రాణాలను బలిగొంది. మహారాష్ట్రలోని మాల్వన్ తాలూకా వైరీ గ్రామంలో ఉన్న ఓ రిసార్ట్‌లో స్విమ్మింగ్ పూల్‌లో జరిగిన ప్రమాదంలో 25 ఏళ్ల యువకుడు మృతి చెందాడు. మృతుడిని సంగ్లీ జిల్లాకు చెందిన శ్రేణిక్ తకాలేగా గుర్తించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. శ్రేణిక్ తన స్నేహితులతో కలిసి రిసార్ట్‌కు వెళ్లాడు. ఈ క్రమంలో స్విమ్మింగ్ పూల్‌లోకి ఎత్తు నుంచి దూకాడు. అయితే తాను దూకిన ప్రాంతంలో నీటి లోతు చాలా తక్కువగా ఉందనే విషయాన్ని గుర్తించలేదు. దూకిన వెంటనే అతని తల స్విమ్మింగ్ పూల్ అడుగు భాగాన్ని బలంగా ఢీకొట్టింది. దీంతో తీవ్ర తలకు గాయమై అక్కడికక్కడే స్పృహ కోల్పోయాడు. గమనించిన స్నేహితులు వెంటనే అతడిని నీటిలో నుంచి బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలను సేకరిస్తున్నారు.

స్విమ్మింగ్ పూల్‌లో ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు

  • ఒంటరిగా స్విమ్మింగ్‌కు వెళ్లకండి. ఎప్పుడూ మీతో పాటు మరొకరు ఉండేలా చూసుకోండి.
  • ఈత బాగా తెలిసిన వ్యక్తితో కలిసి మాత్రమే స్విమ్మింగ్ చేయడం మంచిది.
  • చిన్న పిల్లలను లోతైన స్విమ్మింగ్ పూల్‌లోకి తీసుకెళ్లకుండా, వారికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పిల్లల పూల్‌ను మాత్రమే ఉపయోగించండి.
  • స్విమ్మింగ్ పూల్‌లోకి దూకే ముందు నీటి లోతు ఎంత ఉందో తప్పనిసరిగా తెలుసుకోండి.
  • లైఫ్‌గార్డ్ విధుల్లో ఉన్న స్విమ్మింగ్ పూల్‌లను మాత్రమే వినియోగించడం సురక్షితం.
  • పూల్ చుట్టూ తడి నేలపై జారిపడే ప్రమాదం ఉండటంతో అప్రమత్తంగా ఉండాలి.
  • మీకు ఈత వచ్చిన స్థాయిని మించి లోతైన నీటిలోకి వెళ్లకండి.
  • సరదాగా ఈత కొడుతున్నప్పటికీ ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి.
  • ఫన్ కోసం తోటి ఫ్రెండ్స్‌ను నీటిలో ముంచడం లాంటివి చేయవద్దు..
  • ట్రైనింగ్ లేకుండా కొత్త ప్రయోగాలు చేయవద్దు
  • ఈత పూర్తయిన తర్వాత శరీరాన్ని శుభ్రమైన నీటితో కడుక్కోవాలి. స్విమ్మింగ్ పూల్‌లో ఉండే క్లోరిన్ వంటి రసాయనాలు చర్మం, జుట్టుపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది.

సరదాగా గడపాలని వెళ్లిన విహారయాత్ర విషాదంగా మారడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. స్విమ్మింగ్ పూల్‌లలో కనీస భద్రతా నిబంధనలు పాటించడం ఎంత ముఖ్యమో ఈ ఘటన మరోసారి గుర్తు చేస్తోంది.

Follow Us