
మహారాష్ట్రలో వెలుగులోకి వచ్చిన భారీ పాల కల్తీ వ్యవహారం దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనకు దారితీస్తోంది. ఆహార – ఔషధ విభాగం (FDA), పోలీసుల సంయుక్త ఆపరేషన్‌లో ధరాశివ్ జిల్లా భూమ్ తాలూకా కేంద్రంగా నడుస్తున్న కృత్రిమ పాల తయారీ దందా బయటపడింది. డిటర్జెంట్ పౌడర్, పామాయిల్, నాసిరకం రసాయనాలతో పాలను తయారు చేసి అసలైన పాలుగా మార్కెట్లోకి పంపినట్లు అధికారులు గుర్తించారు.
దర్యాప్తులో భాగంగా స్వాధీనం చేసుకున్న రికార్డులను పరిశీలించగా, గత ఆరు నెలల్లో సుమారు 2 లక్షల30 వేల 470 కిలోల నాణ్యత లేని పాలపొడిని ఉపయోగించినట్లు గుర్తించారు. ఈ పాలపొడితో దాదాపు 23 లక్షల 4 వేల 70 లీటర్ల కృత్రిమ పాలను తయారు చేసినట్లు ప్రాథమికంగా తేలింది. దీని విలువ సుమారు రూ.9.21 కోట్లుగా అధికారులు అంచనా వేస్తున్నారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ప్రతి 100 లీటర్ల అసలైన పాలలో 10 లీటర్ల వరకు కృత్రిమ పాలను కలిపి సరఫరా చేసినట్లు తెలుస్తోందన్నారు. ఈ లెక్కన భూమ్ ప్రాంతంలోని పాల సేకరణ కేంద్రాల ద్వారా మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాలకు 2.3 కోట్ల లీటర్లకు పైగా కల్తీ పాలు చేరి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు.
కృత్రిమ పాలు సహజ పాల మాదిరిగా కనిపించేందుకు, కొవ్వు శాతం పెంచేందుకు డిటర్జెంట్ పౌడర్, పామాయిల్, రసాయన పదార్థాలను ఉపయోగించినట్లు పోలీసులు గుర్తించారు. ఇలాంటి పదార్థాలు కలిగిన పాలను దీర్ఘకాలం తీసుకుంటే కాలేయం, మూత్రపిండాలు, జీర్ణవ్యవస్థపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఈ అక్రమాలపై చర్యలను FDA కమిషనర్ తుకారాం ముండే బాధ్యతలు స్వీకరించిన తర్వాత మరింత వేగవంతం చేశారు. డెయిరీలు, పాల రవాణాదారులు, పంపిణీదారులు, టోకు వ్యాపారులు, రిటైల్ దుకాణాల వరకు మొత్తం సరఫరా వ్యవస్థపై తనిఖీలు ముమ్మరం చేశారు. దాడుల్లో 61 బస్తాల కల్తీ పాలపొడిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ దందాలో బాలాసాహెబ్ గోడ్గే అనే వ్యక్తి పలు డెయిరీ యూనిట్లకు కల్తీ పదార్థాలు సరఫరా చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో ఏడుగురిపై కేసులు నమోదు చేసినప్పటికీ, నిందితుల్లో పలువురు పరారీలో ఉన్నారు. వారిని పట్టుకునేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) రంగంలోకి దిగింది.
ఇదిలా ఉండగా, FDA తనిఖీల నేపథ్యంలో పాలు, పనీర్ సరఫరాలో మార్పులు కనిపిస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో తనిఖీల భయంతో వ్యాపారులు పాలను పారబోస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రజారోగ్యంతో సంబంధం ఉన్న ఈ కేసులో దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఆహార భద్రతా నిబంధనలు ఉల్లంఘించిన వారిపై భారీ జరిమానాలు, కఠిన శిక్షలు అమలు చేసే అవకాశం ఉంది. మహారాష్ట్రలో వెలుగులోకి వచ్చిన ఈ పాల కల్తీ వ్యవహారం దేశవ్యాప్తంగా ఆహార భద్రతపై మరోసారి చర్చకు దారితీసింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..