
ముంబై, మే 21: ఎంతో విలువైన జీవితం కేవలం చిన్న చిన్న కారణాలతో చేజార్చుకోవడం ముర్ఖత్వమే అవుతుంది. నేటి యువత చేసే పనులు అలాగే ఉన్నాయి. ఇన్‌స్టా రీల్స్ కోసం పడరాని పాట్లు పడుతున్నారు. బుద్ధిగా చదువుకుని కెరీర్‌లో ఎదగడం సంగతి పక్కనపెట్టేసి ఎందుకూ కొరగాని వీడియోలో, రీల్స్‌తో కాలం వెళ్లదీస్తున్నారు. అంతటితో ఆగకుండా ప్రమాదకర రీతిలో రీల్స్ చేస్తూ ప్రాణాలు సైతం పోగొట్టుకుంటున్నారు. తాజాగా పదో తరగతి చదువుతున్న ఓ టీనేజ్ గర్ల్ అదే చేసింది. బిల్డింగ్‌పైకి ఎక్కి సాయంకాల సంధ్యను రకరకాల ఫోజుల్లో ఫొటోలు కొట్టసాగింది. కానీ ఫొటోల మైకంలోపడి బిల్డింగ్ అంచువరకు వచ్చేసింది. అంతే.. 8వ అంతస్థు నుంచి కిందపడిపోయి ప్రాణాలు విడిచింది. ఈ హృదయ విదారక సంఘటన ముంబైలోని దహిసర్‌లో జరిగింది. వివరాల్లోకెళ్తే..
ఈ అమ్మాయి పేరు జాన్వి సవాలా (16). ఆమె స్థానికంగా ఉన్న ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతోంది. జాన్వి తన తల్లిదండ్రులకు ఏకైక సంతానం. ఈ ఏడాది పదో తరగతి పరీక్షలు కూడా రాసి మంచి మార్కులతో పాసైంది. జాన్వీ తల్లిదండ్రులు దహిసర్ తూర్పులోని మిస్టికా నగర్‌లోని పరిఖి అనే భవనంలోని ఏడవ అంతస్తులో నివాసం ఉంటున్నారు. జాన్వీ తండ్రి సమీర్ సావ్లా (వయస్సు 42) ఓ వస్త్ర వ్యాపారి. ఆదివారం (మే 18) సాయం జాన్వీ భవనం టెర్రస్ పైకి వెళ్లి ఫోటోలు తీసుకుంటానని తండ్రికి చెప్పింది. తండ్రి సమీర్ కూడా ఓకే అన్నాడు. దీంతో జాన్వీ సూర్యాస్తమయాన్ని ఫోటోలు తీయడానికి ఎనిమిదవ అంతస్తుపైకి వెళ్ళింది. గోడపై కూర్చుని రీల్స్ తయారు చేసేందుకు ఫోటో తీస్తుండగా, ఒక్కసారిగా బ్యాలెన్స్ తప్పి అక్కడి నుంచి నేలపై పడిపోయింది.
ఈ సంఘటన జరిగినప్పుడు జాన్వీ తండ్రి సమీర్ గ్రౌండ్ ఫ్లోర్‌లోని బెంచ్ మీద కూర్చున్నాడు. జాన్వి అతనికి ముందు కొంత దూరంలో పడిపోయింది. కళ్లముందే ఒక్కగానొక్క కూతురు రక్తం మడుగులో పడిపోవడం చూసిన సమీర్ గుండె అల్లాడిపోయింది. వెంటనే రక్తంతో తడిసిపోయిన కూతురిని చేతుల్లోకి తీసుకుని సమీపంలోని మిస్టికా నగర్‌లోని ప్రగతి ఆసుపత్రికి పరుగులు తీశాడు. కానీ డాక్టర్ ఆమెను పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు ప్రకటించారు. దీంతో జాన్వీ తల్లిదండ్రులు బిడ్డను చూసుకుని కుమిలిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. జాన్వి తల్లిదండ్రుల వాంగ్మూలం నమోదు చేసుకున్నారు. ఈ కేసులో ఎలాంటి నేర సంబంధిత కారణాలు లేవని జాన్వి తల్లిదండ్రులు తెలిపారు. జాన్వీ భవనం టెర్రస్ గోడపై కూర్చుని సూర్యాస్తమయ ఫోటోలు తీస్తుండగా బ్యాలెన్స్ కోల్పోయి కిందపడిపోయిందని బాలిక తల్లిదండ్రులు పోలీసులకు చెప్పినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. దీంతో పోలీసులు ప్రమాదవశాత్తు సంభవించిన మరణంగా కేసు నమోదు చేసుకున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.