ఒక్కగానొక్క కొడుకు.. ఫోన్‌కు బానిసై చేయకూడని పనిచేశాడు! మొబైల్‌‌కు అడిక్ట్ అయిన పిల్లలకు గుణపాఠం

డిజిటల్ యుగంలో పిల్లలపై ఆన్‌లైన్ కంటెంట్ ప్రభావం ఎంత తీవ్రంగా ఉంటుందో మరోసారి చర్చనీయాంశమైంది. ఇటీవల జరిగిన ఓ విషాదకర ఘటన తల్లిదండ్రుల బాధ్యత, పిల్లల మొబైల్ వినియోగంపై పర్యవేక్షణ, అలాగే డిజిటల్ అవగాహన అవసరాన్ని గుర్తు చేసింది. చిన్నారుల భద్రత కోసం కుటుంబాలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని ఈ ఘటన నొక్కి చెబుతోంది.

ఒక్కగానొక్క కొడుకు.. ఫోన్‌కు బానిసై చేయకూడని పనిచేశాడు! మొబైల్‌‌కు అడిక్ట్ అయిన పిల్లలకు గుణపాఠం
Mobile Addiction

Updated on: Jun 22, 2026 | 12:28 PM

ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. మొబైల్ ఫోన్‌లో చూసిన ఓ స్టంట్‌ను చేసే క్రమంలో 11 ఏళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. మకన్‌పూర్ ఖాదర్ గ్రామంకు చెందిన వంశ్ అనే బాలుడు ఐదో తరగతి చదువుతున్నాడు. తండ్రి సునీల్‌కు నలుగురు సంతానంలో అతడే ఏకైక కుమారుడు. అతనికి ముగ్గురు సోదరీమణులు ఉన్నారు. మొబైల్ ఫోన్‌లో గేమ్స్ ఆడటం, స్టంట్ వీడియోలు చూడటం అతడికి అలవాటుగా ఉండేదని గ్రామస్తులు తెలిపారు.

ఘటన జరిగిన రోజు ఇంట్లో ఇతర పిల్లలు ఆడుకుంటుండగా వంశ్ తన గదిలోకి వెళ్లాడు. అక్కడ మొబైల్‌లో చూసిన ఒక స్టంట్‌ను అనుకరించే ప్రయత్నం చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో అతని మెడ చుట్టూ ఉన్న గుడ్డ అకస్మాత్తుగా బిగుసుకుపోవడంతో ఊపిరాడక అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. కొంతసేపటి తర్వాత బాలుడిని గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే అతను మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. తమ ఏకైక కుమారుడి మరణంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. గ్రామంలో కూడా విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై దంకోర్ పోలీస్ స్టేషన్ పోలీసులు విచారణ చేపట్టారు. ప్రాథమిక దర్యాప్తులో మొబైల్ గేమ్ లేదా వీడియోకు నేరుగా సంబంధించిన ఆధారాలు ఇంకా లభించలేదని, బాలుడు ఏ తరహా స్టంట్‌ను అనుకరించాడో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. కుటుంబ సభ్యులు పోస్ట్‌మార్టం నిర్వహించేందుకు నిరాకరించినట్లు కూడా పోలీసులు వెల్లడించారు.

ఈ ఘటన నేపథ్యంలో పిల్లల మొబైల్ వినియోగంపై ఆందోళన వ్యక్తం అవుతోంది. సోషల్ మీడియా, వీడియో ప్లాట్‌ఫారమ్‌లలో కనిపించే ప్రమాదకరమైన స్టంట్లు, ఛాలెంజ్‌లను పిల్లలు అనుకరించే అవకాశం ఉండటంతో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. పిల్లల ఆన్‌లైన్ కార్యకలాపాలను పర్యవేక్షించడం, ప్రమాదకరమైన కంటెంట్ గురించి వారికి అవగాహన కల్పించడం ద్వారా ఇలాంటి విషాదాలను నివారించవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us