అయ్యప్ప శరణుఘోషతో పులకిస్తున్న శబరిగిరులు, మరికొన్ని గంటల్లోనే మకరజ్యోతి దర్శన భాగ్యం, టీవీ9 లో ప్రత్యక్షప్రసారం

కరోనా ఆంక్షల కారణంగా ఈసారి లక్షలాది తెలుగు భక్తులు శబరి యాత్రకు వెళ్లలేకపోయారు. కానీ వారి మనస్సుల్లో శరణుఘోష మిన్నంటుతూనే..

  • Venkata Narayana
  • Publish Date - 7:35 pm, Wed, 13 January 21

కరోనా ఆంక్షల కారణంగా ఈసారి లక్షలాది తెలుగు భక్తులు శబరిగిరి యాత్రకు వెళ్లలేకపోయారు. కానీ వారి మనస్సుల్లో శరణుఘోష మిన్నంటుతూనే ఉంది. వారి దృష్టి అంతా మకరజ్యోతి మీదనే ఉంది. మరికొద్ది గంటల్లోనే మకరజ్యోతి దర్శన భాగ్యం కల్గుతుంది. కోవిడ్‌ నిబంధనలు కచ్చితంగా అమలు చేస్తూ.. ఈ ఏడాది మకరవిళక్కు ఏర్పాట్లు చేసింది ట్రావెన్‌కోర్‌ దేవస్థానం. మండలకాలం పాటు దీక్ష చేసి.. ఇరుముడి కట్టుకుని.. శబరిమలకు చేరుకున్నారు ఎంతోమంది భక్తులు. కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ సన్నిధానంలో మణికంఠుని దర్శనం కోసం..మకర జ్యోతి దివ్యానుభూతి కోసం ఎదురుచూస్తున్నారు.

రేపు మకర సంక్రాంతిరోజు సాయంత్రం 5 గంటల 40 నిమిషాలకు తిరువాభరణాలతో పందళరాజవంశీయులు సన్నిధానం చేరుకుంటారు. శబరిమల ఆలయ ప్రధాన తంత్రి వారికి స్వాగతం పలికి..వారు తెచ్చిన బంగారు ఆభరణాలను అయ్యప్పకు అలంకరిస్తారు. అనంతరం సాయంత్రం 6.30 గంటలకు పొన్నాంబలమేడు నుంచి మకరజ్యోతి దర్శనమిస్తుంది. మకర జ్యోతిని ముమ్మారులు తనివితీరా దర్శించి..ఇరుముడి సమర్పించి..ధన్యోహం ఓ శబరీశా అంటూ మాటలకందని ఆధ్యాత్మికానందాన్ని పొందుతారు స్వాములు. ఆ దృశ్యాలను టీవీ9లో ప్రత్యక్షప్రసారం చేస్తుంది. ఈసారి శబరిమలకు వెళ్లలేకపోయిన భక్తులందరూ టీవీ9లో మకరజ్యోతిని దర్శించవచ్చు. జ్యోతి స్వరూపనే శరణమయ్యప్ప అంటూ మణికంఠుడి కీర్తించవచ్చు.