
టమోటాలు లేకుండా వంట చేయడం ఎవరికీ సాధ్యం కాదు. చట్నీ నుంచి సాంబార్ వరకు ప్రతి వంటకానికి టమోటాలు అవసరం. అందుకే మనం మార్కెట్ నుంచి కాస్త ఎక్కువ మొత్తంలో టమోటాలు కొని నేరుగా ఫ్రిజ్‌లో ఉంచుతాం. ఈ విధంగా రిఫ్రిజిరేటర్‌లో టమోటాలు నిల్వ చేయడం వల్ల వాటి రుచి మారడమే కాకుండా ఆరోగ్యానికి కూడా హానికరం అని నిపుణులు హెచ్చరించారు. కాబట్టి టమోటాలు చెడిపోకుండా ఎలా సరిగ్గా నిల్వ చేయాలో ఇక్కడ తెలుసుకుందాం..
బాగా పండిన టమోటాలను ఫ్రిజ్‌లో నిల్వ చేయవచ్చు. కానీ ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం వాటిని ఐదు రోజుల కంటే ఎక్కువ నిల్వ చేయకూడదట. అతి శీతల ఉష్ణోగ్రతలు టమోటాలలో కణ నిర్మాణాన్ని దెబ్బతీస్తాయి. దీనివల్ల వాటి నాణ్యత తగ్గుతుంది. కాబట్టి మీరు వాటిని రెండు లేదా మూడు రోజుల్లో ఉపయోగించుకుంటే మంచిది. ఫ్రిజ్‌లో ఉంచవచ్చు లేదంటే వాటిని బయట గది ఉష్ణోగ్రత వద్ద ఉంచడం మంచిది. ఈ విధంగా మీరు టమోటాల పూర్తి ప్రయోజనాలను పొందవచ్చు.
సాధారణంగా టమోటాలను ఒక వారం కంటే ఎక్కువ రోజులు ఫ్రిజ్‌లో ఉంచితే, అవి బయటి వైపు బాగా కనిపించవచ్చు కానీ లోపల కుళ్ళిపోవడం ప్రారంభించవచ్చు. వంటలో ఇటువంటి టమోటాలను ఉపయోగించడం వల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి. రిఫ్రిజిరేటర్‌లో అధిక తేమ వల్ల టమోటాలు మనకు తెలియకుండానే చెడిపోతాయి. ఇటువంటి టమోటాలు తినడం వల్ల అనారోగ్యం, వాంతులు, విరేచనాలు వస్తాయి. రోగనిరోధక శక్తి బలహీనపడటం, ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. మీరు టమోటాలను తాజాగా ఉంచుకోవాలనుకుంటే వాటిని కొన్న వెంటనే కొన్ని రోజుల్లోనే ఉపయోగించడానికి ప్రయత్నించండి. ఫ్రిజ్‌లో నిల్వ చేసినప్పటికీ కూరగాయల కోసం కేటాయించిన డ్రాయర్‌లో ఉంచండి. టమాట లోపల నల్లటి మచ్చలు, దుర్వాసన ఉన్న టమోటాలను ఉపయోగించవద్దు.
మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్ చేయండి.