ప్రపంచం చాలా ఆధునికంగా మారింది. చంద్రుడిలో అడుగు పెట్టారు. సముద్రం లోతులను కొలుస్తున్నారు. అయినా ఇప్పటికీ కొంతమంది రోజుకు రెండు పూటల భోజనం కోసం తహతహలాడే పరిస్థితి ఉంది. ప్రపంచంలోని చాలా దేశాలు ఆకలి చావు వంటి తీవ్రమైన సమస్యలను ఎదుర్కొంటున్నాయి. ఆహారం మన జీవితంలో ఒక ముఖ్యమైన భాగం.. అయినప్పటికీ ఆహారం తినకుండా నిద్రపోయేవారు వందల సంఖ్యలో ఉన్నారు. ఆహారం లేకుండా జీవితాన్ని ఊహించలేము.. అయినా అనేక దేశాల్లోని ప్రజలు ఆకలితో పస్తులు ఉంటున్నారు. దీంతో ఆహారం ప్రాముఖ్యత, భద్రత, ఆకలికి సంబంధించిన సమస్యల గురించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలకు తెలియజేయడానికి ప్రతి సంవత్సరం అక్టోబర్ 16న ప్రపంచ ఆహార దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న దేశాలు చాలా పురోగతి సాధించాయి.. అయితే ప్రపంచ జనాభా పెరుగుదలతో.. ఆకలి పెను సవాలుగా మారుతోంది.
ప్రజలు .. ముఖ్యంగా పిల్లలు పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. ఆకలి చావులు, పోషకాహార లోపంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు కృషి చేస్తున్నారు. ఆకలితో ఏ వ్యక్తి ప్రాణాలు కోల్పోకూడదన్నది దీని లక్ష్యం. అక్టోబర్ 16న ప్రపంచ ఆహార దినోత్సవంగా ఎందుకు జరుపుకుంటారు? దీని చరిత్ర ఏమిటి? 2024 సంవత్సరంలో దీని థీమ్ ఏమిటి? తెలుసుకుందాం..
ప్రపంచ ఆహార దినోత్సవాన్ని జరుపుకోవడం ముఖ్య ఉద్దేశ్యం ఆకలి ఎంత శాపమో ప్రజలకు అవగాహన కల్పించడం. ఒకవైపు ప్రజలు ఆకలితో నిద్రపోతుంటే.. మరోవైపు కొందరు ఆహారాన్ని వృథా చేస్తున్నారు. ప్రపంచ ఆహార దినోత్సవం ద్వారా ఆహారాన్ని వృధా చేయకూడదనే విషయాన్ని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పేందుకు కృషి చేస్తున్నారు. ఆహారాన్ని ఆదా చేయడం, ఆ ఆహారాన్ని ప్రజలకు పంపిణీ చేయడం చాలా ముఖ్యం. ప్రపంచ స్థాయిలో ఇలాంటి దినోత్సవాన్ని జరుపుకోవడం వల్ల ప్రజల్లో అవగాహన ఏర్పడుతుంది.
ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (FAO) 1945లో ప్రపంచ ఆహార దినోత్సవాన్ని ఏర్పాటు చేసింది. ఈ దినోత్సవాన్ని ఐక్యరాజ్యసమితి సంస్థ 2014లో ప్రారంభించింది. 2014లో ఈ రోజు ప్రారంభం నుంచి ఆహార భద్రతపై దృష్టి సారిస్తున్నారు. వ్యవసాయానికి సంబంధించిన అనేక అంశాలపై దృష్టి సారిస్తున్నారు. ప్రజలు ఆహార ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడానికి, ఆకలితో బాధపడుతున్న వారికి సహాయం చేయడానికి ముందుకు రావాలని ప్రోత్సహిస్తున్నారు.
ప్రపంచ ఆహార సవాళ్లను హైలైట్ చేయడానికి ప్రతి సంవత్సరం ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (FAO) ఒక థీమ్‌ను విడుదల చేస్తుంది. 2024లో ఆహార దినోత్సవ థీమ్ మెరుగైన జీవితం, మంచి భవిష్యత్తు కోసం ఆహార హక్కు. ఈ థీమ్ ముఖ్య లక్ష్యం ఆహారం , ఆరోగ్యకరమైన జీవితం గురించి ప్రజలకు అవగాహన కల్పించడం. ఆహారం మానవులకే కాదు.. ప్రతి జీవికి అవసరం ఎందుకంటే ఆహరం తినడం వలనే జీవించగలుగుతాము. ఆహారం శరీరానికి శక్తినిస్తుంది. ఆహారం శరీరానికి అందకపోతే శారీరకంగానే కాదు మానసికంగా కూడా అనారోగ్యానికి గురవుతాం.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..