
చలికాలం మొదలైందంటే చాలు.. శరీరంలో నీరసం, అలసట, కీళ్ల నొప్పులు వేధించడం సర్వసాధారణం. ఈ సీజన్లో శరీరాన్ని వెచ్చగా ఉంచుతూ, రోగనిరోధక శక్తిని పెంచడానికి మన పెద్దలు సూచించిన సాంప్రదాయ ఆహారాలు ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా మీరు తరచుగా బలహీనంగా, నీరసంగా ఫీలవుతుంటే.. ఈ చలికాలంలో అవిసె గింజలు, బెల్లం, గోధుమ పిండితో ఇంట్లోనే ఎంతో రుచికరమైన, పోషకమైన లడ్డూలను తయారు చేసుకోండి. సూపర్‌ఫుడ్‌గా పిలువబడే అవిసె గింజల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, ఫైబర్, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. ఇవి నీరసాన్ని తగ్గించి, శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. మరి చేదు లేకుండా, నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఈ అవిసె గింజల లడ్డూలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
చేదు రాకుండా: అవిసె గింజలను తక్కువ మంట మీద, వాటి నుండి కమ్మటి సువాసన వచ్చి చిటపటలాడే వరకు మాత్రమే వేయించాలి. ఎక్కువగా వేయిస్తే గింజలు మాడిపోయి చేదు వస్తాయి.
గట్టిపడకుండా: లడ్డూల కోసం బెల్లం పాకం పట్టాల్సిన అవసరం లేదు. కేవలం నెయ్యిలో బెల్లాన్ని కరిగించి మంట ఆర్పేయాలి. దీనివల్ల లడ్డూలు గట్టిపడకుండా ఎంతో మృదువుగా ఉంటాయి.
అవిసె గింజల పొడి: ముందుగా ఒక పొడి బాణలిలో అవిసె గింజలను మధ్యస్థ మంట మీద 3-4 నిమిషాల పాటు వేయించాలి. పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీలో వేసి కొద్దిగా కరకరలాడేలా పొడి చేసుకోవాలి.
డ్రైఫ్రూట్స్ – గోంద్ వేయించడం: బాణలిలో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేడి చేసి, తరిగిన బాదం, జీడిపప్పు, తామర గింజలు, గోంద్ (జిగురు) వేసి లేత బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి. వేగిన జిగురును చల్లారాక మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి.
గోధుమ పిండి వేయించడం: అదే బాణలిలో మిగిలిన నెయ్యి వేసి, గోధుమ పిండిని వేయాలి. పిండి బంగారు రంగులోకి మారి, కమ్మటి సువాసన వచ్చే వరకు తక్కువ మంట మీద కలుపుతూ వేయించుకోవాలి.
బెల్లం కరిగించడం: మరో పాత్రలో తురిమిన బెల్లం, 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి బెల్లం పూర్తిగా కరిగే వరకు తక్కువ మంట మీద ఉడికించి, ఒక పొంగు రాగానే మంట ఆపేయాలి.
మిశ్రమాన్ని కలపడం: ఒక పెద్ద వెడల్పాటి పళ్లెంలో వేయించిన గోధుమ పిండి, అవిసె గింజల పొడి, వేయించిన డ్రైఫ్రూట్స్, గోంద్ పొడి, శొంఠి పొడి, యాలకుల పొడి వేసి బాగా కలపాలి. ఇందులో కరిగించిన బెల్లం మరియు మిగిలిన గోరువెచ్చని నెయ్యిని పోసి అంతా కలిసేలా మిక్స్ చేయాలి.
లడ్డూలు చుట్టడం: మిశ్రమం కొద్దిగా వెచ్చగా ఉన్నప్పుడే చేతులకు కొద్దిగా నెయ్యి రాసుకుని, మీకు నచ్చిన సైజులో లడ్డూలు చుట్టుకోవాలి.
పూర్తిగా చల్లారిన తర్వాత ఈ లడ్డూలను గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేసుకోవచ్చు. ప్రతిరోజూ ఉదయం ఒక గ్లాసు గోరువెచ్చని పాలతో పాటు ఒక్క లడ్డూ తింటే.. చలికాలం మొత్తం నీరసం దరిచేరదు, శరీరం ఉక్కులా బలంగా మారుతుంది.