
చలికాలంలో చల్లని వాతావరణం, తక్కువ తేమ కారణంగా చర్మంలోని సహజ తేమ తగ్గి ముఖం పొడిబారి, నిర్జీవంగా కనిపిస్తుంది. కొందరిలో చర్మం సాగినట్లు లేదా పొడిగా అనిపించడం వంటి సమస్యలు వస్తాయి. ఇలాంటప్పుడు చర్మానికి తగినంత తేమ అందించడం అవసరం. అవిసె గింజల జెల్, కలబంద గుజ్జు కలయికతో తక్కువ ఖర్చుతో ఇంట్లోనే ఫేస్ జెల్ తయారు చేసుకోవచ్చని పలువురు చర్మ సంరక్షణ నిపుణులు చెబుతున్నారు. ఈ మిశ్రమం తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం, పూర్తి ప్రయోజనాలేంటో ఇప్పుడు చూద్దాం..
2 టేబుల్స్పూన్ల అవిసె గింజలు
1 కప్పు నీరు
1 టేబుల్‌స్పూన్ కలబంద జెల్
1 విటమిన్ ఇ క్యాప్సూల్
1 టేబుల్‌స్పూన్ బాదం నూనె లేదా కొబ్బరి నూనె. జిడ్డు లేదా మొటిమల చర్మం ఉన్నవారు నూనెను వేయకూడదు.
పాన్‌లో అవిసె గింజలు, నీరు వేసి మధ్యస్థ మంటపై కలుపుతూ మరిగించాలి. నీరు చిక్కబడి జెల్ లాగా మారినప్పుడు స్టవ్ ఆఫ్ చేసి, కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే వస్త్రం లేదా జల్లెడతో వడకట్టాలి. జెల్ పూర్తిగా చల్లారిన తర్వాత కలబంద జెల్, విటమిన్ ఇ క్యాప్సూల్ అవసరమైతే బాదం లేదా కొబ్బరి నూనె కలిపి, శుభ్రమైన గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేసుకోవాలి.
రాత్రి నిద్రపోయే ముందు మైల్డ్ ఫేస్‌వాష్‌తో ముఖం కడిగి, టవల్‌తో సున్నితంగా తుడవాలి. ఆ తర్వాత ముఖం, మెడపై పలుచని పొరలా జెల్‌ను రుద్దకుండా తేలికగా రాయాలి. చికాకు లేదా మంట ఏమీ లేకపోతే రాత్రంతా అలాగే ఉంచుకోవచ్చు.
అవిసె గింజలు: ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు, యాంటీఆక్సిడెంట్లు ఉండటం వల్ల చర్మానికి పోషణ అందించి మృదువుగా ఉంచడంలో సహాయపడతాయి.
కలబంద జెల్: చర్మానికి తేమ, చల్లదనం అందించి పొడిబారడం, నిర్జీవత తగ్గించి ముఖాన్ని తాజాగా ఉంచడంలో తోడ్పడుతుంది.
విటమిన్ ఇ: యాంటీఆక్సిడెంట్ గుణాలు కలిగి ఉండి, చర్మం పొడిబారడాన్ని తగ్గించి మృదువుగా కనిపించేందుకు సహాయపడుతుంది.
బాదం / కొబ్బరి నూనె: బాగా పొడి చర్మం ఉన్నవారిలో తేమ నిలిపి ఉంచడానికి, చర్మం మృదువుగా ఉండటానికి ఉపయోగపడతాయి.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..