
మార్కెట్‌లో ఆవనూనె, వేరుశనగ నూనె, నువ్వుల నూనె, సోయాబీన్, పొద్దుతిరుగుడు, రైస్ బ్రాన్, ఆలివ్ ఆయిల్, కొబ్బరినూనె వంటి ఎన్నో రకాల వంటనూనెలు అందుబాటులో ఉన్నాయి. అయితే వీటిలో ఏ నూనె ఆరోగ్యానికి అత్యంత శ్రేష్ఠమైనదనే సందేహం చాలామందిలో ఉంటుంది. అనేకమంది ప్రకటనలు చూసి నూనెలను ఎంచుకుంటారు. కానీ, ప్రతి వంటనూనెకి దాని స్వంత పోషక విలువలు, ఉపయోగించే ప్రత్యేక విధానాలు ఉంటాయి. అన్ని పరిస్థితుల్లోనూ, అందరికీ సరిపోయే ఒకే ఒక్క పర్ఫెక్ట్ వంటనూనె అంటూ ఏదీ ఉండదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. మీ వయస్సు, ఆరోగ్య స్థితి, ఆహార అలవాట్లు, వంట వండే విధానంపై ఆధారపడి వంటనూనెను ఎంచుకోవాల్సి ఉంటుంది
భారతీయ వంటకాల్లో ఎక్కువ కాలంగా ఆవనూనెను ఉపయోగిస్తున్నారు. ఇందులో మోనో అన్‌శాచురేటెడ్, పాలి అన్‌శాచురేటెడ్ కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. దీని స్మోక్ పాయింట్ చాలా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఇది డీప్ ఫ్రై చేయడానికి, అలాగే సాధారణ వంటలకు చాలా అనుకూలంగా ఉంటుంది.
ఎక్కువ వేడి వద్ద వండే వంటకాలకు వేరుశనగ నూనె మంచి ఎంపిక. ఇందులో విటమిన్ ఈ, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. వేయించడానికి, తాలింపులకు దీనిని ధారాళంగా ఉపయోగించవచ్చు.
ఆలివ్ ఆయిల్‌లో మోనో అన్‌శాచురేటెడ్ ఫ్యాట్స్, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఎక్స్‌ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్‌ను సలాడ్లు, లైట్ కుకింగ్ లేదా డ్రెస్సింగ్ కోసం ఉపయోగిస్తే మంచిది. సాధారణ వంటల కోసం రిఫైన్డ్ ఆలివ్ ఆయిల్‌ను ఉపయోగించవచ్చు.
భారతీయ ఇళ్లల్లో అత్యధికంగా వాడే వంటనూనెలలో పొద్దుతిరుగుడు నూనె ఒకటి. ఇది చాలా తేలికగా ఉండి, వంటకాల సహజ రుచిని మార్చదు. ఇందులో విటమిన్ ఈ పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మ ఆరోగ్యానికి, కణాల రక్షణకు ఎంతో మేలు చేస్తుంది. అంతేకాకుండా ఇందులో ఉండే లినోలెయిక్ యాసిడ్ శరీరానికి అవసరమైన హెల్దీ ఫ్యాట్స్‌ను అందిస్తుంది. దీని స్మోక్ పాయింట్ ఎక్కువగా ఉండటం వల్ల సాధారణ వంటలతో పాటు ఫ్రై చేయడానికి కూడా దీనిని విరివిగా ఉపయోగిస్తారు.
రైస్ బ్రాన్ ఆయిల్‌లో ఒరైజనాల్ అనే శక్తివంతమైన మూలకం ఉంటుంది. ఇది రక్తంలో కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచడానికి సహాయపడుతుంది. దీని స్మోక్ పాయింట్ కూడా ఎక్కువగా ఉండటం వల్ల భారతీయ వంటకాలకు ఇది సురక్షితమైన ఎంపికగా నిలుస్తుంది.
నువ్వుల నూనెలో యాంటీ ఆక్సిడెంట్లు, హెల్దీ ఫ్యాట్స్ మెండుగా ఉంటాయి. దక్షిణ భారత, ఆసియా వంటకాల్లో దీనిని విశేషంగా వాడతారు. దీనిని పరిమిత పరిమాణంలో క్రమం తప్పకుండా తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
కొబ్బరి నూనెలో శాచురేటెడ్ ఫ్యాట్స్ పరిమాణం కాస్త ఎక్కువగా ఉంటుంది. కొన్ని రకాల సాంప్రదాయ వంటకాల్లో దీనిని వాడినప్పటికీ, రోజూవారీ వంటల్లో ఎక్కువ మొత్తంలో వాడకపోవడమే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.
ఆరోగ్య నిపుణుల సలహా ప్రకారం.. ఎల్లప్పుడూ ఒకే రకమైన నూనెను వాడటానికి బదులుగా, వేర్వేరు వంటలకు వేర్వేరు నూనెలను ఉపయోగించడం లేదా సమయానుకూలంగా వంటనూనెలను మారుస్తూ ఉండటం వల్ల శరీరానికి అవసరమైన అన్ని రకాల హెల్దీ ఫ్యాట్స్, పోషకాలు లభిస్తాయి.